ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) తన సొంత నియోజకవర్గం కడప జిల్లా (Kadapa District) పులివెందులలో పర్యటిస్తున్నారు. క్రిస్ట్ మస్ వేడుకల కోసం పులివెందుల వెళ్లిన ఆయన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పులివెందుల ఇండస్ట్రియల్ పార్క్ లో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ కు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. రూ.110 కోట్ల పెట్టుబడిలో టెక్స్ టైల్స్ పార్కును అదిత్యా బిర్లా గ్రూప్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తోంది. ఈ సందర్భంగా ప్రసంగించిన సీఎం ఫార్చ్యూన్-500 కంపెనీల జాబితాలో ఆదిత్యా బిర్లా గ్రూప్ ఉందని.. దీని ద్వారా పులివెందలలో యువతకు వేలాది ఉద్యోగాలు వస్తాయన్నారు. పులివెందుల ప్లాంట్ లో మొదటి విడతలో 2వేల మందికి ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు.
ఉపాధి అవకాశాలతో పాటు స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమం ద్వారా యువతకు శిక్షణ ఇస్తామన్నారు. పులివెందులలో ఏర్పాటు చేస్తున్న స్కిల్ డెవలప్ మెంట్ కాలేజీని నైపుణ్య శిక్షణ కోసం వినియోగించుకోవచ్చన్నారు. ప్లాంట్ కు సమీపంలోనే కొత్తగా జగనన్న కాలనీని నిర్మిస్తుండటంతో కార్మికులకు మరింత సౌలభ్యంగా ఉంటుందని.. అంతేకాకుండా మరిన్ని సదుపాయలు కల్పిస్తామని సీఎం అన్నారు.
అనంతరం సీఎం జగన్ రూ.128.56 కోట్లతో పులివెందులలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పట్టణంలోని పేదలకు 353.02 ఎకరాలలో 8042 మంది లబ్దిదారులకు ఇంటిపట్టాల పంపిణీ చేశారు. అలాగే పులివెందుల మునిసిపాలిటిలోని 7309 మంది లబ్దిదారులకు, బ్రాహ్మణపల్లి హౌసింగ్ కాలనీలో 733 మంది లబ్దిదారులకు ఇంటిపట్టాలను అందజేశారు. అలాగే రూ. 10.50 కోట్ల నిధులతో పులివెందుల మార్కెట్ యార్డులో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. రూ. 3.64 కోట్లతో మోడల్ పోలీస్ స్టేషన్, రూ.1.50 కోట్లతో పెద్దముడియం పోలీస్ స్టేషన్, రూ.32 లక్షలతో కాసినాయన పోలీస్ స్టేషన్లో నిర్మించే డార్మెటరీలను ప్రారంభించారు.
దీంతో పాటు రూ.2.60 కోట్లతో పులివెందుల రాణితోపు వద్ద ఆక్వాహబ్ ను సీఎం ప్రారంభించారు. అక్వా హబ్ ద్వారా నాణ్యమైన చేపలు, రొయ్యల వంటివి ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు. పులివెందుల ప్రజలకు రుచికరమైన చేపలు తినే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.
పులివెందుల బిడ్డగా ఈ ప్రాంతం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని సీఎం తెలిపారు. శిల్పారామం అభివృద్ధికి రూ.13 కోట్లు కేటాయించామని త్వరలోనే పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్నారు. అలాగే స్థానిక చెరువును టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేస్తున్నామని.., విద్యార్థులు, యువతకు ఇండోర్ స్టేడియం కూడా అందుబాటులోకి రాబోతోందని జగన్ తెలిపారు. 2023నాటికి పులివెందుల రూపులేఖలు మార్చేస్తానని జగన్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాష, మంత్రులు అదిమూలపు సురేష్, సీదిరి అప్పలరాజు, ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Pulivendula