విశాఖలో మీరు గడిపిన సమయం మీకు మధురానుభూతిని మిగులుస్తుందని భావిస్తున్నానని సీఎం జగన్ (CM YS Jagan) అన్నారు. జి-20(G-20 Summit) రెండో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది తమ ఉద్ధేశ్యమని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక.. 30 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇచ్చామని చెప్పుకొచ్చారు. 22 లక్షల ఇళ్లు కడుతున్నామని అన్నారు. ఈ ఇళ్లకు కనీస మౌలిక సదుపాయాలను కల్పించడానికి ప్రభుత్వం ముమ్మరంగా చర్యలు చేపడుతోందని తెలిపారు. దీనిపై సరైన చర్చలు జరిపి సస్టెయిన్‌బుల్ పద్ధతులను సూచించాలని కోరుతున్నానని సీఎం జగన్ అన్నారు. దీనిపై సరైన మార్గనిర్దేశకత్వం అవసరమని అన్నారు. దీనివల్ల మంచి ఇళ్లు పేదలకు సమకూరుతాయని అభిప్రాయపడ్డారు. దీనిపై మీ నుంచి మంచి ఆలోచనలు కావాలని అన్నారు. సమస్యలకు మంచి పరిష్కారాలు చూపగలగాలని సీఎం జగన్ తెలిపారు. ఈ అంశంపై మీరు చక్కటి చర్చలు చేయాలని చెప్పారు.
ఇక షెడ్యూల్ ప్రకారం రేపు బీచ్‌లో యోగా, మెడిటేషన్, పౌష్టికాహార వినియోగంపై నిపుణులతో అవగాహన కార్యక్రమాలుంటాయి. ఆ రోజంతా మౌలిక సదుపాయాల కల్పన అనే అంశంపై ప్రధాన సమావేశం ఉంటుంది. 30న ఉ.10 నుంచి మ.1.30 గంటల వరకు కెపాసిటీ బిల్డింగ్ వర్క్‌షాపు ఉంటుంది. అనంతరం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ముడసర్లోవ, కాపులుప్పాడ ప్రాంతాల్లో విదేశీయులు పర్యటిస్తారు. స్మార్ట్ వాటర్ మేనేజ్‌మెంట్, మెగా ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ పనితీరు, జిందాల్ కంపెనీ పరిధిలో నిర్వహించే వేస్ట్ మేనేజ్‌మెంట్ ఎనర్జీ తయారీ యూనిట్ పనితీరు గురించి అధికారులు వివరిస్తారు.
31న దేశవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కమిషనర్లతో పట్టణీకరణ, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై సింగపూర్, దక్షిణ కొరియా ప్రతినిధులతో చర్చిస్తారు. జన్‌భాగీదారీ కార్యక్రమం కింద స్థానిక నిపుణులతో వివిధ అంశాలపై చర్చా సమావేశాలు జరుగుతాయి. అనంతరం..విదేశీ ప్రతినిధులు తిరుగు ప్రయాణమవుతారు. సదస్సులో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా,ఫ్రాన్స్, జర్మనీ, భారత్,ఇండోనేసియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యా , సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, టర్కీ, యూకే, అమెరికా, యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు పాల్గొంటున్నారు.
జీ–20 సదస్సు నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టారు. సుమారు 2,500 మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. బందోబస్తుకు శ్రీకాకుళం , పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల నుంచి కూడా సిబ్బందిని రప్పించారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా పటిష్ట ఏర్పాట్లుచేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.