గతంలో ఎన్నడూ లేని విధంగా భారత్ లో విద్యుత్ సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. మన దేశంలో ఉత్పత్తి అయ్యే కరెంటులో 70శాతం బొగ్గు ఆధారితమని తెలిసిందే. దేశవ్యాప్తంగా 135 బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు ఉండగా వాటిలో సగానికి పైగా ప్లాంట్లలో బొగ్గు నిల్వలు దాదాపు అడుగంటి పోయాయి. అక్టోబర్ లోనూ వర్షాలు దంచికొకొడుతుండటంతో బొగ్గు ఉత్పత్తికి అదనపు అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఈ దశలో రాష్ట్రాల పరిస్థితి ఒకింత ఆందోళనకరంగా తయారైంది. బొగ్గు కొరత, విద్యుత్ సంక్షోభంపై మిగతా ముఖ్యమంత్రులు మౌనం వహించినా, ఏపీ సీఎం జగన్ మాత్రం కేంద్రానికి లేఖాస్త్రాన్ని సంధించారు. నేరుగా ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి విద్యుత్ సంక్షోభంపై జగన్ కీలక అంశాలను ప్రస్తావించారు..
ఆ రెండు అంశాలపై..
ప్రధాని మోదీకి రాసిన లేఖలో ఏపీ సీఎం జగన్ ప్రధానంగా విద్యుత్ ధరలు, అదనపు ఇంధనం అంశాలను ప్రస్తావించారు. విద్యుత్ ధరల నియంత్రణ, అదనపు ఇంధనం సమకూర్చే విషయమై కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జగన్ కోరారు. కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత పారిశ్రామిక రంగం తిరిగి ఊపందుకోవడంతో విద్యుత్ కు అమాంతం డిమాండ్ పెరిగిన విషయాన్ని, తద్వారా మారిన పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని జగన్ వివరించారు..
నెలలోనే డిమాండ్ 20శాతం పెరిగింది..
‘కోవిడ్ తర్వాత గత ఆరు నెలల్లో విద్యుత్ డిమాండ్ 15 శాతం పెరిగింది. గత ఒక్కనెలలోనే విద్యుత్ డిమాండ్ 20 శాతానికిపైగా పెరిగింది. విద్యుత్ కొనుగోలు చేయాలంటే కొన్ని సందర్భాల్లో యూనిట్‌కు రూ.20 చెల్లించాల్సి వస్తోంది. అవసరాల కోసం విద్యుత్ కొనుగోలు చేద్దామన్నా అందుబాటులో ఉండటం లేదు. కాబట్టి ఏపీ థర్మల్ ప్రాజెక్టులకు 20 ర్యాక్‌ల బొగ్గు కేటాయించాలని కోరుతున్నాం’ అని జగన్ విజ్ఞప్తి చేశారు. అంతేకాదు..
అదనపు గ్యాస్.. డిస్కంలకు లోన్లు..
ఏపీలోని థర్మల్ ప్రాజెక్టులకు 20 ర్యాక్ ల బొగ్గును కేటాయించాలన్న సీఎం జగన్.. ఆ దిశగా కొంతకాలంగా పనిచేయని బొగ్గు ప్లాంట్లను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని కేంద్రానికి సూచించారు. అలాగే, ఓఎన్‌జీసీ, రియలన్స్ ద్వారా ఏపీకి అత్యవసర ప్రాతిపదికన గ్యాస్ సరఫరా చేయాలనీ మోదీని కోరారు. పనిలోపనిగా విద్యుత్ డిస్కంలకు బ్యాంకుల ద్వారా సులభతరమైన రుణాలివ్వాలని, కేంద్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థలను పునరుద్ధరించి మరో 500 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని విన్నవించారు. ఏపీ సీఎం లేఖపై ప్రధాని కార్యాలయం స్పందించాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.