ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీలో అవినీతి, అక్రమాలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ భావించారు. అందుకు అనుగుణంగా ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్డ్ సర్వీసెస్(ఆప్కాస్)ను ఏర్పాటు చేశారు. అందుకు సంబందించి ఆప్కాస్ను శుక్రవారం సీఎం జగన్ ప్రారంభించారు. దీనికి చైర్మన్గా సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ)కు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ముఖ్యకార్యదర్శి, ప్రభుత్వ కార్యదర్శుల్లో ఎవరో ఒకరు చైర్మన్గా వ్యవహరించనున్నారు. ఈ నూతన వ్యవస్థ వల్ల ఎక్కడా అవినీతికి అవకావం లేదు. ఉద్యోగాలు, వేతనాలల్లో ఎక్కడా చేతివాటానికి ఆస్కారం లేదు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగ నియమాకాల్లో పూర్తి పారదర్శకత కల్పించనున్నామని సీఎం జగన్ తెలిపారు.
ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తామని, ఈఎస్ఐ, పీఎఫ్ అమలు చేయడంతో పాటు ఎటువంటి లంచాలు, వివక్షత లేకుండా జీతాలు వారి చేతుల్లోకి వచ్చేలా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రస్తుతానికి 50449 మందికి నియామక పత్రాలు ఇస్తామని, ఈ సంఖ్యను వచ్చే రోజుల్లో మరింతగా పెంచుతామని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో కాంట్రాక్టులో 20 మంది పనిచేయాలని ఉంటే 15 మందితో పని చేయించి.. మిగిలిన వేతనాలను కాంట్రాక్టర్లే తీసుకునేవారని పేర్కొన్నారు. ఇకపై పైరవీలు, దళారులకు చోటు లేకుండా కాంట్రాక్టు ఉద్యోగులకు పూర్తి భద్రత కల్పిస్తామని వివరించారు.