ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మరో పోర్టు పనులు ప్రారంభమయ్యాయి. నెల్లూరు జిల్లా (Nellore District) కందుకూరు నియోజకవర్గంలో రామాయపట్నం పోర్టుకు సీఎం జగన్ (AP CM YS Jagan) శంకుస్థాపన చేశారు. తొలుత సముద్రుడికి పట్టువస్త్రాలు సమర్పించిన ఆయన.. పోర్టు నిర్మాణ పైలాన్ ను ఆవిష్కరించారు. రామాయపట్నం పోర్టుకు పునాది రాయి వేయడం ఆనందంగా ఉందని సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. రామాయపట్నం పోర్టు ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో భావనపాడు, కాకినాడ గేట్ వే పోర్టు, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులతో పాటు 9 ఫిషింగ్ హార్బర్లను కూడా నిర్మిస్తున్నామన్నారు.
నాలుగు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్లతో పాటు ఇప్పటికే ఉన్న ఐదు పోర్టులు కలిపి ప్రతి 50 కిలోమీటర్లకు పోర్టు లేదా ఫిషింగ్ హార్హర్ అందుబాటులో ఉంటాయన్నారు. పోర్టులన్నీ పూర్తైతే దాదాపు లక్ష మంది మత్స్యకార కుటుంబాలకు ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. అదే జరిగితే స్థానిక మత్స్యకార కుటుంబాలు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరముందన్నారు.
రామయపట్నం పోర్టు విషయంలో గత ప్రభుత్వం రాజకీయం చేసిందన్నారు. 2019 ఏప్రిల్ లో ఎన్నికలుండగా.. ఫిబ్రవరిలో చంద్రబాబు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. డీపీఆర్, భూసేకరణ లేకుండా శంకుస్థాపన పేరుతో టెంకాయ కొట్టి స్థానికులను మోసం చేశారని జగన్ ఆరోపించారు. ఇంతకన్నా అన్యాయం, మోసం లేదని సీఎం విమర్శించారు. రుణమాఫీ పేరుతో రైతులు, మహిళలు, ఉద్యోగాల పేరుతో యువతను, ప్రాంతాల దగ్గర కూడా చంద్రబాబు మోసాలకు పాల్పడ్డారని విమర్శించారు.
ఇది చదవండి: పవన్ వర్సెస్ గంటా.. ఆసక్తిని రేకెత్తిస్తున్న గాజువాక వార్.. 2024లో హైలెట్ ఇదేనా..?
రామాయమట్నం కోసం 800 ఎకరాల భూసేకరణ చేపట్టి రూ.3,740 కోట్లతో పనులు కూడా జరుగుతున్నాయన్నారు. ఈ పోర్టు ద్వారా నాలుగు బెర్తులు త్వరలోనే సిద్ధమవుతాయని.. ఆ తర్వాత 6 బెర్తులు కూడా నిర్మిస్తామన్నారు. రామాయపట్నం ద్వాలా 25 మిలియన్ టన్నుల కార్గో రవాణాకు అవకాశముందన్నారు. మొత్తం పది బెర్తులు పూర్తైతే 50 మిలియన్ టన్నుల సరుకు రవాణా సాధ్యమవుతుందన్నారు. ఈ పోర్టులకు అనుసంధానంగా కావలి నియోజకవర్గ పరిధిలో పారిశ్రామిక కారిడార్ ను కూడా ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. అలాగే కావలి, కందుకూరు నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గుడివాడ అమర్ నాథ్ మాట్లాడుతూ.. స్థానిక ప్రజలను మభ్యపెట్టేందుకు 2019లో చంద్రబాబు శంకుస్థాపనల పేరుతో డ్రామాలాడారని ఆరోపించారు. కార్యక్రమంలో అంబటి రాంబాబు, కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యేలు మహీధర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.