ఇసుక సరఫరాపై సీఎం జగన్ కీలక నిర్ణయం..తాజా మార్గదర్శకాలు ఇవే

ప్రతీకాత్మక చిత్రం

గ్రామాలు, చిన్న చిన్న వాగుల్లో ఇసుకను గుర్తించి స్థానికంగా అమ్మకాలు చేపట్టాలని ఆదేశించారు. దీనికి సంబంధించి 3 నెలల కాలానికి తాజా మార్గదర్శకాలు జారీచేశారు.

 • Share this:
  ఏపీలో ఇసుక కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో ఇసుక లభ్యతను పెంచేందుకు అధికారులకు కీలక ఆదేశాలు జారీచేసింది. ప్రధాన నదుల్లో ప్రవాహాలు తగ్గకపోవడంతో అందుబాటులో ఉన్న వాగులు, వంకలు, ఇతరత్రా చిన్న నదుల్లో ఇసుక లభ్యతను గుర్తించాలని కలెక్టర్లను జగన్ ఆదేశించారు.  గ్రామాల వారీగా ఇసుకను గుర్తించి.. గ్రామ సచివాలయంలో చెల్లింపు చేసి ఆ ఇసుకను పొందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గుర్తించిన రీచ్‌ల్లో పర్యవేక్షణ బాధ్యతను గ్రామ వాలంటీర్‌కు అప్పగించాలని చెప్పారు.

  అమరావతిలో ఇసుక కొరతపై సీఎం వైఎస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఇసుక లభ్యత, డిమాండ్‌పై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. నదుల్లో ప్రవాహం తగ్గకపోవడం, పైగా ఇంకా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోనే ఇసుక లభించడం కష్టంగా మారిందని జగన్‌కు అధికారులు వివరించారు. ఈ క్రమంలో గ్రామాలు, చిన్న చిన్న వాగుల్లో ఇసుకను గుర్తించి స్థానికంగా అమ్మకాలు చేపట్టాలని ఆదేశించారు. దీనికి సంబంధించి 3 నెలల కాలానికి తాజా మార్గదర్శకాలు జారీచేశారు.

  ఇసుక సరఫరాపై మార్గదర్శకాలు:
  గ్రామీణ ప్రాంతంలో ఇసుక రీచ్‌ల పర్యవేక్షణ బాధ్యత గ్రామ వాలంటీర్లదే.

  రవాణాచేస్తున్న వాహనాలు, తరలిస్తున్న పరిమాణాన్ని వాలంటీర్ రికార్డు చేయాలి.

  రవాణాచేస్తున్న వాహనానికి గ్రామ సెక్రటేరియట్‌ ఇన్‌ఛార్జి ఎస్-3 ఫామ్ జారీచేయాలి.

  ఈ ఫాంను వాడినా, వాడకున్నా కాలపరిమితి 48 గంటలే.

  వాడకపోయినా డబ్బు తిరిగి చెల్లించరు.. అంతేకాదు.. తిరిగి వాడుకునేందుకూ వీలుకాదు.

  ఇసుకను రవాణాచేస్తున్న ట్రాక్టర్లకు 20 కి.మీ వరకే అనుమతి. స్థానిక వినియోగాలకోసం ఎడ్లబండ్లకు మాత్రం అనుమతి ఉంటుంది.

  ఇసుక తరలింపు, నిల్వలో అక్రమాల నిరోధానికి తారుమారుచేయలేని సెక్యూరిటీ ఫీచర్లతో ఎస్‌–3 ఫాంలను, రిజిస్టర్లను గ్రామసచివాలయాలకు సమకూర్చనున్న ఏపీఎండీసీ.

  వాణిజ్య అవసరాలకు కాకుండా స్థానిక అవసరాలకు ఈ ఇసుకను వినియోగించాలని షరతు.

  వినియోగదారులు తమ వ్యక్తిగత అవసరాలకు మించి ఇసుకను నిల్వచేయడానికి వీల్లేదు.

  అలాంటి నిల్వచేసే వ్యక్తులపై తగిన చర్యలు గ్రామ సచివాలయమే తీసుకుంటుంది.

  ఏపీ వాల్టా చట్టం ప్రకారం ఇసుక తవ్వకాల్లో ఎలాంటి యంత్రాలను వినియోగించరాదు, కేవలం మానవ వనరులను మాత్రమే వినియోగించాలి.

  సరఫరా చేస్తున్న ఇసుకకు సంబంధించి వినియోగాన్ని గ్రామ సచివాలయమే పరిశీలించాలి.

  ఇసుక లభ్యత కోసం తీసుకున్న తాజా నిర్ణయాలు 3 నెలల కాలంవరకే అమలవుతాయి. ఆ తర్వాత మరోసారి ఇసుకపై ప్రభుత్వం సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటుంది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలను కలెక్టర్లు విస్తృతంగా ప్రచారం చేయాల్సి ఉంటుంది.
  Published by:Shiva Kumar Addula
  First published: