ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) భూములు, ఆస్తుల రక్షణకు ప్రభుత్వం చేపట్టిన వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు - భూ రక్ష పథకంలో భాగంగా రీసర్వే పూర్తయిన భూములకు సంబంధించిన సమగ్ర భూసర్వే రికార్డులను సీఎం జగన్ (CM YS Jagan) ప్రజలకు అంకితం చేశారు. అలాగే 37 గ్రామాల్లో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ సేవలను క్యాంప్ కార్యాలయం నుంచి ప్రారంభించారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం ద్వారా మంచి కార్యక్రమానికి మళ్లీ ప్రభుత్వం ముందడుగు వేస్తోందని సీఎం అన్నారు. దేశంలో తొలిసారిగా అత్యంత శాస్త్రీయ పద్దతిలో సమగ్ర భూసర్వే తొలి దశలో 51 గ్రామాల్లో భూ సర్వే పూర్తి చేశామని జగన్ తెలిపారు. 11,501 గ్రామాల్లో డిసెంబర్ 2022 నాటికి రీసర్వే పూర్తి చేస్తామని పేర్కొన్నారు. నేటి నుంచి 37 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు.
భవిష్యత్లో వివాదాలకు తావు లేకుండా సమగ్ర సర్వే చేపట్టినట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రజలు తమ ఆస్తుల లావాదేవీలు గ్రామంలో కనిపించే విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. ఇటువంటి మంచి సంస్కరణ నేటి నుంచి అమల్లోకి తెస్తున్నామని సీఎం అన్నారు. భూములకు సంబంధించి ట్యాంపరింగ్ జరుగుతోందన్న ఫిర్యాదులు వచ్చాయని.., పట్టాదారు పాస్ బుక్లకు ఆశించినంత లాభం జరగలేదన్నారు. భూమికి చెందిన నిర్ధిష్టమైన హద్దులు, హక్కులు ఇప్పటివరకు లేవని తెలిపారు. కేవలం 90 శాతం కేసులు సివిల్ వివాదాలకు సంబంధించినవేనని.., శాస్త్రీయ పద్దతుల్లో భూములకు నిర్థిష్టంగా మార్కింగ్ చేసి ప్రతి ఒక్కరికీ ఐడెంటిఫికేషన్ నంబర్ ఇస్తే ల్యాండ్ వివాదాలకు చెక్ పెట్టొచ్చన్నారు సీఎం.
రాష్ట్రప్రభుత్వం రూ.1,000 కోట్ల వ్యయంతో 4,500 సర్వే బృందాలు, 70 కార్స్ బేస్ స్టేషన్లు, 2 వేల రోవర్లతో అత్యాధునిక సాంకేతికతను వినియోగించి సమగ్ర భూసర్వేను చేపట్టిన ప్రారంభించింది. ఇందులో భాగంగా మొదటి దశలో 51 గ్రామాల్లోని 12,776 మంది భూ యజమానులకు చెందిన 21,404 భూ కమతాలను అధికారులు రీసర్వే చేశారు. ఇందులో భాగంగా వారికి చెందిన 29,563 ఎకరాల భూములను రీసర్వే చేసి.. 3,304 అభ్యంతరాలను పరిష్కరించారు. జూన్ 2023 నాటికి దశలవారీగా రాష్ట్రంలో మిగిలిన భూముల రీసర్వేను కూడా పూర్తి చేయనున్నారు. తర్వాత రీసర్వే పూర్తయిన గ్రామాల్లో అవసరమైన ప్రక్రియను పూర్తి చేసి ఆయా గ్రామ సచివాలయాల్లో స్థిరాస్తులను రిజిస్ట్రేషన్ చేస్తారు.
భూముల రీసర్వే పూర్తయిన గ్రామాల్లోని గ్రామ సచివాలయాల్లోనే ప్రభుత్వం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలను ఏర్పాటు చేసింది. గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులనే సబ్ రిజిస్ట్రార్లుగా నియమించింది. రెవెన్యూ శాఖ(స్టాంపులు, రిజిస్ట్రేషన్లు) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఈ మేరకు నోటిఫికేషన్లు జారీ చేశారు. భూరికార్డులను సులభంగా తనిఖీ చేసుకునేలా రిజిస్ట్రేషన్ సేవలను గ్రామ సచివాలయాల స్థాయిలో వికేంద్రీకరిస్తున్నట్లు తెలిపారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Village secretariat