ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో డబ్బుల్లేక విద్యార్థులు చదువును ఆపే పరిస్థితులు రాకూడదని సీఎం జగన్ (AP CM YS Jagan) అన్నారు. ఉన్నత విద్యపై క్యాంప్ కార్యాలయంలో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రాస్‌ఎన్‌రోల్ మెంట్ రేషియో (జీఈఆర్) గణనీయంగా పెంచేందుకే విద్యాదీవెన (Jagananna Vidya Deevena), వసతి దీవెన (Jagananna Vasathi Deevena) అమలు చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. పూర్తిస్థాయి ఫీజు రియింబర్స్ మెంట్‌ను విద్యా దీవెన కింద అమలు చేస్తున్నామన్న సీఎం.., వసతి ఖర్చులూ పెట్టుకోలేక చదువులు ఆపేసే పరిస్థితులు ఉండకూడదన్నారు. గతంలో కన్నా గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో(జీఈఆర్) పెరిగిన మాట వాస్తవమే అయినా సంతృప్తి చెందకూడదన్నారు. జీఈఆర్ 80శాతానికి పైగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగాలను కల్పించే చదువులు దిశగా కోర్సులు ఉండాలని సూచించారు. ఇప్పుడున్న కోర్సులకు సంబంధించి అనుబంధకోర్సులు, ప్రత్యేక కోర్సులు తీసుకురావాలన్నారు.
విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేందుకు వీలుగా ఇంగ్లిషుపై పట్టు, ప్రావీణ్యం ఉండాలని జగన్ సూచించారు. జీఆర్‌ఈ, జీ మ్యాట్ పరీక్షలపైన కూడా విద్యార్థులకు మంచి శిక్షణ ఇవ్వాలన్నారు. ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నారో, అంతమందికీ విద్యాదీవెన, వసతి దీవెన ఇస్తున్నామని జగన్ గుర్తుచేశారు. రాష్ట్రంలో వెనుకబడ్డ ప్రాంతాల్లో అమ్మాయిలు చదువులకు దూరమవుతున్నారని.. దీనిపై వీటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, వారిలో చైతన్యం తీసుకురావాలని జగన్ సూచించారు. ముఖ్యంగా కర్నూలు పశ్చిమ ప్రాంతం, చిత్తూరు, ప్రకాశం జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు.
రాష్ట్రంలో 4-5 యూనివర్శిటీలను ఎంపిక చేసుకుని, దేశంలో ఉత్తమ యూనివర్శిటీల స్థాయికి తీసుకెళ్లాలన్న సీఎం.. పట్టభద్రులకు తప్పనిసరిగా 10 నెలల ఇంటర్న్ షిప్ ఉండాలన్నారు. మొదటి ఏడాది 2 నెలలు, రెండో ఏడాది 2 నెలలు, మూడో ఏడాది 6 నెలల ఇంటర్న్ షిప్ ఉండేలా కార్యాచరణ రూపొదంచాలన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న దాదాపు 30 నైపుణ్యకాలేజీల్లో కూడా ఇంటర్న్ షిప్ కోసం ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో ఒక డిగ్రీ కాలేజీ ఉండాలని.. దీనిని నాడు నేడు కింద అభివృద్ధి చేయాలన్నారు. డిగ్రీ కాలేజీలను అత్యుత్తమంగా తీర్చిదిద్దడానికి ఒక వ్యవస్థను తీసుకురావాలమని.., రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీలో జాయిన్ అయ్యారంటే... ఆ విద్యార్థికి మంచి విజ్ఞానం రావాలనే విధంగా ప్రమాణాలు పెంచాలన్నారు.
రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ డిగ్రీకాలేజీలను జేఎన్టీయూ తరహాలో ఒక ప్రత్యేక యూనివర్శిటీ లాంటి వ్యవస్థ కిందకు తీసుకురావాలని జగన్ ఆదేశించారు. మంచి పరిజ్ఞానం ఉన్నవారిని ప్రతిపాదిత వ్యవస్థకు నేతృత్వం వహించేలా చూడాలన్నారు. సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ, సీఎస్ సమీర్ శర్మ, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె శ్యామలరావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.