ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, వరద ప్రభావిత జిల్లాల్లో తాజా పరిస్థితి, తీసుకుంటున్న సహాయ చర్యలపై సీఎం జగన్ (AP CM YS Jagan).., కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోదావరికి ముందస్తుగానే వరదలు వచ్చాయని.., గడిచిన వందేళ్లలో ఇంత ముందుగా ఈ స్ధాయిలో వరద రాలేదని సీఎం అన్నారు. సాధారణంగా ఆగష్టులో 10 లక్షల క్యూసెక్కుల వరదనీరు ఉంటుందన్న జగన్.. తొలిసారిగా జులై మాసంలోనే 10 లక్షల క్యూసెక్కులకు పైబడి వరద వచ్చినట్లు తెలిపారు. ఇది జాగ్రత్తపడాల్సిన అంశమన్నారాయన. ప్రస్తుతం ధవళేశ్వరంలో 13 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల అవుతోందని.., రెండో ప్రమాద హెచ్చరిక నడుస్తోందగని.., రేపు ఉదయానికి వరద పెరిగి., 15 నుంచి 16 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉన్నందున మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం అన్నారు.
మహారాష్ట్రలో భారీ వర్షాల నేపథ్యంలో గోదావరినదికి వరదలు కొనసాగే అవకాశం ఉందన్న జగన్., ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవాలని అదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఒక్కరూ కూడా మృత్యువాత పడకూడదని, కూనవరం, చింతూరుల్లో 2 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ఉన్నాయని.., వి.ఆర్.పురం, కూనవరం, అమలాపురం, వేలురుపాడుల్లో 4 ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు ఉన్నాయని.., లైన్ డిపార్ట్‌మెంట్లు ప్రత్యామ్నాయాలతో సిద్ధంగా ఉండాలని సూచించారు.
కంట్రోలు రూమ్స్ సమర్థవంతంగా పనిచేయాలన్న సీఎం.., అవసరమైనచోట వరద సహాయక శిబిరాలు ప్రారంభించాలని చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారిని వెంటనే శిబిరాలకు తరలించాలని.. అక్కడ ఏర్పాట్లు బాగుండాలన్నారు. మంచి ఆహారం, తాగునీరు, ఇతర సౌకర్యాల ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని.., బాధితుల పట్ల మానవతాదృక్ఫధంతో మెలగాలని స్పష్టం చేశారు.
సహాయక శిబిరాల నుంచి ఇళ్లకు వెళ్లేటప్పుడు వ్యక్తికి అయితే రూ.1000, ప్రతి కుటుంబానికి రూ.2వేల రూపాయలు ఇవ్వాలని ఆదేశించారు. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది, నర్సులు, ఇతర సిబ్బంది పూర్తిగా అందుబాటులో ఉండాలని.., అత్యవసర మందులను అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేశారు.
తాగునీటి పథకాలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలన్న సీఎం.., కరెంటు సరఫరాకు అంతరాయం వచ్చిన నేపథ్యంలో అత్యవసర సర్వీసులు నడిచేందుకు వీలుగా జనరేటర్లను అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. చెరువులు, ఇరిగేషన్‌కాల్వలు.. ఎక్కడ బలహీనంగా ఉన్నాయో.. అక్కడ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు.
అల్లూరు సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లకు రూ.2కోట్ల చొప్పున తక్షణ నిధులు ఇస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. సీఎంఓ అధికారులు అందుబాటులో ఉంటారని.., వరద కారణంగా జరిగిన నష్టాలపై ఎప్పటికప్పుడు వివరాలు సేకరించి రోజువారీ నివేదికలు పంపాలని కలెక్టర్లకు సీఎం సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.