news18-telugu
Updated: November 3, 2020, 12:33 PM IST
సీఎం జగన్(ఫైల్ ఫోటో)
కరోనా సీజన్ లోనూ ఆగకుండా ఏపీ సీఎం వైఎస్ జగన్ వరుసగా పథకాలను ప్రారంభిస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. తాజాగా మరో పథకానికి ఆయన శ్రీకారం చుట్టునున్నారు. ఫుట్పాత్ లు, వీధుల్లో వస్తువులు, తినుబండారాలు విక్రయించే వ్యాపారులకు రూ.10వేల చొప్పున రుణాలు అందించే "జగనన్న తోడు" పథకాన్ని ఈ నెల 6న సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ కమిషనర్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ పథకం కింద బ్యాంకుల నుంచి చిరు వ్యాపారులకు రుణాలు ఇప్పించడంతో పాటు ఆ రుణాలపై అయ్యో వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. తీసుకున్న రుణాన్ని మాత్రం వాయిదాల పద్దతిలో లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంది. ఫుట్ పాత్ లు, వీధుల్లో తోపుడు బండ్లు, సైకిళ్లపై వివిధ వస్తువులు, కూరగాయలు, పండ్లు అమ్ముకుని జీవనం సాగించే వారితోపాటు రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లు నడిపే వారు, గంపలు లేదా బట్టలపై వివిధ వస్తువులు అమ్ముకునే వారంతా ఈ పథకం కింద లబ్ధి పొందనున్నారు.
సంప్రదాయ వృత్తులైన ఇత్తడి పని చేసేవారు, బొబ్బిలి వీణ, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, కలంకారీ, తోలు బొమ్మల అమ్మకందారులతో పాటు కుమ్మరి వారికి సైతం ఈ పథకం కింద రుణాలు ఇవ్వనున్నారు. అయితే ఈ పథకం కింద ఇప్పటివరకు దాదాపు 9.08 లక్షల మందిని ప్రభుత్వం అర్హులుగా గుర్తించింది. వీరందరికీ ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ. 10 వేల వరకు వడ్డీలేని రుణాన్ని బ్యాంకుల ద్వారా అందించనున్నారు. ఇందుకు రూ. 474 కోట్లను సర్కారు ఖర్చు చేయనుంది. ఈ రుణం మీద అయ్యే రూ. 52 కోట్ల వడ్డీని ప్రభుత్వమే భరించనుంది. అయితే ఇంకా అర్హులెవరైనా మిగిలిపోతే గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.
ఇదిలా ఉంటే.. ప్రైవేట్ స్కూల్స్ కు ఏపీ సర్కార్ గట్టి షాక్ ఇచ్చింది. ప్రైవేట్ స్కూళ్ళ ఆగడాలకు చెక్ పెట్టడం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలంటే ఇక నుంచి టీసీలతో పని లేకుండా చేసింది. కేవలం తల్లిదండ్రుల అంగీకార పత్రం ఉంటే చాలు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్చుకునేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వల్ల చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్థికంగా దెబ్బతిన్నారు. అయితే, తమకుమాత్రం ఫీజులు చెల్లించాల్సిందేనంటూ ప్రైవేట్ స్కూల్స్ ఒత్తిడి చేస్తున్నాయి. పాత ఫీజులు చెల్లిస్తేనే కొత్త తరగతులకు కూర్చోబెడతామని హెచ్చరించే స్కూల్స్ కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఫీజులు చెల్లించలేని వారు స్కూలు మార్చుకుందామంటే టీసీ కావాలి. డబ్బులు చెల్లిస్తేనే ఆ స్కూళ్లు టీసీలు ఇస్తాయి. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో ప్రైవేట్ స్కూళ్ల నుంచి టీసీ లేకపోయినా గవర్నమెంట్ స్కూళ్లలో చేర్చుకుంటారు. ఏపీలో నవంబర్ 2 నుంచి ప్రభుత్వ స్కూళ్లు తెరుచుకోనున్నాయి. దశలవారీగా వివిధ తరగతులకు క్లాసులు నిర్వహిస్తారు.
Published by:
Nikhil Kumar S
First published:
November 3, 2020, 12:29 PM IST