నేడు ఏపీలో అమ్మఒడి పథకం ప్రారంభం... వాళ్లకు వర్తించదు

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవరత్నాల హామీలకు సంబంధించిన పథకాల్ని ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. తాజాగా ఇవాళ అమ్మఒడికి శ్రీకారం చుడుతోంది.

news18-telugu
Updated: January 9, 2020, 5:31 AM IST
నేడు ఏపీలో అమ్మఒడి పథకం ప్రారంభం... వాళ్లకు వర్తించదు
వైఎస్ జగన్
  • Share this:
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో అక్షరాశ్యత పెంపే లక్ష్యంగా... అమ్మఒడి పథకాన్ని ప్రారంభిస్తోంది ప్రభుత్వం. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.6500 కోట్లు కేటాయించింది. ఈ పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్... ఇవాళ చిత్తూరులో ప్రారంభించబోతున్నారు. పిల్లలను బడికి పంపే ప్రతి తల్లి బ్యాంక్‌ అకౌంట్లో సంవత్సరానికి రూ.15వేలు వేస్తామని వైఎస్‌ జగన్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీ... మహిళలను విశేషంగా ఆకట్టుకుంది. ఈ పథకాన్ని ముందుగా 1–10 తరగతుల విద్యార్థులకు ప్రవేశపెట్టినా... ఇంటర్‌ వరకూ వర్తింపజేయాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా దాదాపు 43 లక్షల మంది తల్లులకు ప్రయోజనం చేకూరనుందని ప్రభుత్వం తెలిపింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ ఒక్క చిన్నారీ బడికి దూరం కాకూడదన్న ఆశయంతో వైఎస్‌ జగన్‌ ఈ పథకానికి రూపకల్పన చేశారు. అన్ని గుర్తింపు పొందిన ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, ప్రయివేట్‌ జూనియర్‌ కళాశాలలు, గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా సంరక్షకులకు ఈ పథకం వర్తిస్తుంది. ప్రతి ఏటా జనవరిలో నేరుగా బ్యాంక్‌ అకౌంట్లలో డబ్బు జమచేయనున్నారు.

ఇదీ సీఎం టూర్ షెడ్యూల్ : ఉదయం 9 గంటలకు సీఎం వైఎస్‌ జగన్‌... గుంటూరులోని తాడేపల్లి ఇంటి నుంచి బయలుదేరుతారు. ఉదయం 11.15కి చిత్తూరు పీవీకేఎన్‌ గవర్నమెంట్‌ డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్‌ సభా ప్రాంగణం చేరుకుంటారు. 11.15 -11.35 మధ్య పాఠశాల విద్యాశాఖ ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను సీఎం జగన్‌ పరిశీలిస్తారు. 11.35 -11.40 మధ్య స్ధానిక అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్ధాపన కార్యక్రమాల్లో సీఎం వైఎస్‌ జగన్‌ పాల్గొంటారు. 11.45- 1.45 మధ్య అమ్మఒడి కార్యక్రమం ప్రారంభోత్సవంలో సీఎం జగన్ పాల్గొంటారు. తర్వాత ప్రసంగిస్తారు. సాయంత్రం 3.45కి సీఎం జగన్ తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

పథకంపై కొన్ని విమర్శలు : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెస్తున్న అమ్మఒడి పథకంపై కొన్ని విమర్శలు వస్తున్నాయి. సాధారణంగా తల్లిదండ్రులకు ఒకరే సంతానం ఉంటే... ఆ ఒక్కర్నీ ఎలాగొలా చదివించుకోగలరు. అందుకు ప్రభుత్వ పథకంపై ఆధారపడాల్సిన అవసరం అంతగా ఉండదు. అదే ఎక్కువ మంది పిల్లలు ఉంటే... అందర్నీ చదివించడం, పోషించడం చాలా కష్టం. వారికి అమ్మఒడి పథకం తప్పనిసరిగా అవసరమవుతుంది. ఐతే, అమ్మఒడి పథకం వల్ల ఒక్క సంతానం ఉన్న తల్లులకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుంటే... ఎక్కువ మంది పిల్లలు ఉన్న తల్లులకు తక్కువ ప్రయోజనం కలుగుతుండటం విచారకరం. ఉదాహరణకు ముగ్గురు పిల్లలు ఉంటే... ఈ పథకం వల్ల ఒక్కొక్కరికీ ఆ తల్లి రూ.5వేలు మాత్రమే కేటాయించగలదు. అదే ఒక్కరే సంతానం ఉంటే... రూ.15వేలనూ ఆ ఒక్కరికే కేటాయించగలదు. ఇది సరైన విధానం కాదంటున్నారు ఆర్థిక నిపుణులు. ఒక్కో సంతానానికీ రూ.15 వేల చొప్పున ఇవ్వాలంటున్నారు. అప్పుడు ఎంత మంది పిల్లలు ఉంటే... అంతమందికీ సమానంగా డబ్బును కేటాయించినట్లవుతుందని సూచిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం తల్లికి ఎంత మంది పిల్లలు ఉన్నా... చివరి బిడ్డకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని అంటోంది.

First published: January 9, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు