ఏపీ సీఎం జగన్‌కి ప్రధాని మోదీ షాకిస్తారా? నేడు ఏం జరుగుతుంది?

ఏపీ సీఎం జగన్‌కి ప్రధాని మోదీ షాకిస్తారా? నేడు ఏం జరుగుతుంది?

సీఎం వైఎస్ జగన్, ప్రధాని మోదీ

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. ఓవైపు రాజధానిని తరలించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే... దాన్ని అడ్డుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. మరి సీఎం ఢిల్లీ టూర్‌లో ఏం జరుగుతుంది?

 • Share this:
  ఏపీ రాజధానిని అమరావతి నుంచీ మూడు భాగాలుగా చేసి... విశాఖను పరిపాలనా రాజధానిగా చేసేందుకు సిద్ధమవుతున్న ఏపీ ప్రభుత్వం... 20న కేబినెట్ సమావేశంలో ఫైనల్ నిర్ణయం తీసుకోవాలనుకుంటోంది. ఐతే... ఇంతలోనే కేంద్రం నుంచీ ఏపీ సీఎం జగన్‌కు పిలుపు రావడంతో... ఇవాళ హడావుడిగా ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా జగన్... తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, చేయబోతున్న పనులపై ఇద్దరికీ వివరించి... రాజధాని తరలింపుపై ఇద్దరి అనుమతీ తీసుకోవాలని ప్రయత్నిస్తారని తెలిసింది. ఐతే... ఇందుకు అటు మోదీ గానీ, ఇటు అమిత్ షా గానీ ఒప్పుకునే అవకాశాలు కనిపించట్లేదు. ఇందుకు రెండు కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది... అమరావతిలో రాజధాని ఏర్పాటుకు ప్రధాని మోదీయే స్వయంగా శంకుస్థాపన చేయడం. రెండోది... ఏపీలో జనసేనతో పొత్తు పెట్టుకున్న బీజేపీ... మొదటి నుంచీ రాజధాని తరలింపు అంశానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తుండటం. ఇప్పుడు గనక కేంద్రంలో మోదీ, అమిత్ షాలు... జగన్ మాటను ఒప్పుకుంటే... రాజధాని తరలింపును అంగీకరిస్తే... అది ఏపీలో బీజేపీ, జనసేనల నిర్ణయాలకు వ్యతిరేక నిర్ణయం అవుతుంది. అందువల్ల అమిత్ షా అడ్డుపుల్ల వేస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

  నిజానికి రాజధాని తరలింపు అంశం రాష్ట్ర పరిధిలోనిది. అందువల్లే సీఎం జగన్... హైపవర్ కమిటీ... అన్నీ ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ నెల 20న మూడు రాజధానుల అంశంపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి... అందులో ఆమోదం పొందేలా ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఐతే... అమరావతి రైతుల సంగతేంటని ప్రశ్నిస్తున్న బీజేపీ... ఈ విషయంపై సీఎం జగన్‌ను కేంద్ర స్థాయిలో ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కేంద్రం గనక రాజధాని తరలింపుపై అభ్యంతరాలు చెబితే... అది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యతను దెబ్బతీస్తుంది. కేంద్రం నుంచీ రాష్ట్ర ప్రభుత్వానికి సరైన సహకారం అందకపోవచ్చు. అలాగని ఈ విషయంపై వెనక్కి తగ్గితే... వైసీపీ ప్రభుత్వం... కేంద్రం ముందు తలదించిందనే విమర్శలు వచ్చే అవకాశాలున్నాయి.

  ఏపీలో విపక్షాలు, రాజధాని రైతులు... అందరూ కేంద్రంపైనే ఆశలు పెట్టుకున్నారు. నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్న అమరావతి రైతులు... ప్రధాని మోదీయే తమను కాపాడాలంటున్నారు. ఆల్రెడీ జనసేనతో పొత్తుపెట్టుకున్న కేంద్రం... రాష్ట్ర ప్రభుత్వంపై అన్ని రకాలుగా ఒత్తిళ్లు పెంచే అవకాశాలున్నాయి. అందులో భాగంగా... రాజధాని అంశంపై గట్టిగానే ఒత్తిడి చేస్తారనే వాదన వినిపిస్తోంది. సీఎం జగన్ గత నెలలోనే ఢిల్లీ పర్యటనకు వెళ్లినా పార్లమెంటు సమావేశాలు, జార్ఖండ్ ఎన్నికల ఫలితాల్లో మోదీ, అమిత్ షా బిజీ అవ్వడంతో... భేటీ కుదరలేదు. ఇప్పుడు జనసేనతో పొత్తువల్ల జగన్‌కి అనుకూల పరిస్థితులు మరింత తగ్గాయి. ఈ క్రమంలో ఇవాళ్టి భేటీలో అటు మోదీ, ఇటు అమిత్ షా ఏం చెబుతారన్నది ఆసక్తిగా మారింది.
  Published by:Krishna Kumar N
  First published: