news18-telugu
Updated: October 6, 2020, 6:50 AM IST
నేడు ప్రధాని మోదీతో జగన్ భేటీ... కేంద్ర కేబినెట్లోకి వైసీపీ? (File)
AP CM Jagan Delhi Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... రెండు వారాల గ్యాప్‌లో రెండోసారి ఢిల్లీ పర్యటన పెట్టుకోవడంతో... రకరకాల ఊహాగానాలకు తెరలేచింది. ప్రధానంగా... వైసీపీని బీజేపీ... NDA కూటమిలోకి ఆహ్వానిస్తోందనే టాక్... ఢిల్లీ వర్గాల నుంచి వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం... కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాల్ని మొదటి నుంచి వైసీపీ సమర్థిస్తోంది. ఈమధ్య తెచ్చిన వివాదాస్పద వ్యవసాయ బిల్లులకు కూడా వైసీపీ మద్దతిచ్చింది. దాంతో... సహజంగానే బీజేపీకి వైసీపీ దగ్గరవుతోందనే ప్రచారం ఊపందుకుంది. అదే సమయంలో... NDAలో బీజేపీ భాగస్వామ్య పక్షాలుగా ఉన్న పార్టీలు కొన్ని కమలదళానికి గుడ్ బై చెబుతున్నాయి. ముఖ్యంగా... అకాళీదళ్ గుడ్ బై చెప్పడం... బీజేపీకి పెద్ద దెబ్బే అంటున్నారు. అటు శివసేన... బీజేపీకి ఆల్రెడీ హ్యాండ్ ఇచ్చి... కమలనాథులపై కత్తులు దూస్తోంది. కాబట్టి ఇప్పుడు బీజేపీకి ప్రాంతీయ పార్టీలతో అవసరం పెరిగింది. అటు ప్రతిపక్ష కాంగ్రెస్... ప్రజల్లోకి వెళ్లి ఆందోళనలతో హోరెత్తిస్తోంది. దాంతో... కమలంలో కలవరం మొదలైంది. అందువల్ల సీఎం జగన్ ఢిల్లీ టూర్ ఇప్పుడు ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ అయ్యింది.
బీజేపీతో దోస్తీ?: కొంతకాలంగా వైసీపీని బీజేపీ ఆహ్వానిస్తున్నా... దీనికి అనుకూలంగా, వ్యతిరేకంగా ఏ విధంగానూ స్పందించకుండా... వైసీపీ నేతలు నాన్చుతూ వచ్చారు. ఐతే... ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంతోపాటూ... కేంద్ర కేబినెట్లో మంత్రి పదవి, సహాయ మంత్రి పదవి ఇస్తే... NDAలో చేరేందుకు సిద్ధమేననే సంకేతాలు వైసీపీ పంపినట్లు ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇందుకు బీజేపీ కూడా సానుకూలంగానే ఉందని తెలుస్తోంది. ఇదే గనక నిజమైతే... ఎంపీ విజయసాయిరెడ్డికి... కేంద్ర మంత్రి పదవి దక్కుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
భేటీలో చర్చించే అంశాలు ఇవీ:
నేటి భేటీలో జగన్... పోలవరం ప్రాజెక్టు పూర్తి అంశం, రాష్ట్రానికి కేంద్ర సాయంగా ఇవ్వాల్సిన నిధులపై ప్రధానితో చర్చిస్తారని తెలిసింది. అలాగే... శాసనమండలి రద్దు అంశం కూడా ప్రస్తావనకు వస్తుందని సమాచారం. ఇవే చర్చిస్తారని బయటకు చెబుతున్నా... తెరవెనక అసలు విషయం అదే అంటున్నారు రాజకీయ నిపుణులు. రాష్ట్రంలో వైసీపీ నేతలు మాత్రం ఈ ఊహాగానాలను కొట్టివేస్తున్నారు. అలా జరిగే ప్రసక్తే లేదంటున్నారు.
జనసేనకు సమస్యేనా?:
ఏపీలో బీజేపీ, వైసీపీ కలిస్తే... వైసీపీతో రాజకీయ శత్రుత్వాన్ని పెంచుకున్న జనసేన... బీజేపీకి గుడ్‌బై చెప్పే అవకాశాలుంటాయి. అప్పుడు జనసేన మళ్లీ ఒంటరి పోరు సాగించక తప్పదు. అదే సమయంలో... జనసేనను ఆకర్షించేందుకు టీడీపీ మొదటి నుంచి ప్రయత్నిస్తూనే ఉంది. జనసేన ఒంటరి అయితే... టీడీపీ ప్రయత్నాలు జోరందుకునే అవకాశాలుంటాయి.
ప్రధానితో భేటీ కోసం సీఎం జగన్... సోమవారం మధ్యాహ్నం కడప నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. అక్కడి నుంచి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు. ఢిల్లీలోని తన ఇంటికి వెళ్లారు. షెడ్యూల్ ప్రకారం... ఇవాళ ఉదయమే ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ జరగనుంది. ఆ తర్వాత జగన్... నదీ జలాలకు సంబంధించిన అపెక్స్ కౌన్సిల్ వర్చువల్ భేటీలో పాల్గొంటారు.
Published by:
Krishna Kumar N
First published:
October 6, 2020, 6:50 AM IST