ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్దమవుతోన్న వేళ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఇప్పుడున్న మంత్రుల్లో దాదాపు అందరినీ పదవుల నుంచి తప్పించబోతున్నారని, ఒకరిద్దరు మినహా అందరూ కొత్తవాళ్లకే మంత్రి పదవులు ఇస్తారని ప్రచారం జరుగుతుండగా, ఇద్దరు డిప్యూటీ సీఎంల విషయంలో సర్కారు సంచలన చర్యకు దిగింది. డిప్యూటీ సీఎం నారాయణస్వామికి భారీ షాకిస్తూ ఆయన శాఖల్లో కోత విధించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ గెజిట్‌ను విడుదల చేశారు. మరో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ శాఖలనూ వేరొకరికి బదిలీ చేయబోతున్నారు. ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి..
ఏపీలో త్వరలోనే చేపట్టబోయే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఎవరి పదవి ఉంటుందో, ఎవరి పదవి ఊడుతుందోనని తీవ్రంగా చర్చ నడుస్తోన్న సమయంలోనే.. డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి షాక్ తగిలింది. ఆయన శాఖల్లో కోత విధించారు. వాణిజ్య పన్నుల శాఖ ను నారాయణ స్వామి నుంచి తప్పించారు. ఆ శాఖను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కు అప్పగిస్తూ.. దీనిని ‘శాఖల పునర్వ్యవస్థీకరణ’గా పేర్కొంటూ జగన్ సర్కారు గెజిట్ నోట్ జారీచేసింది. దీంతో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఇప్పుడు ఎక్సైజ్ శాఖకే పరిమితం కానున్నారు.
నారాయణస్వామి తర్వాత మరో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ శాఖల్లోనూ కోత పడనుంది. ధర్మాన నిర్వహిస్తోన్న స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలను కూడా ఆర్ధిక మంత్రి బుగ్గనకే అప్పగించేలా త్వరలోనే మరో గెజిట్ జారీ కానుంది. అప్పుడు ధర్మాన సైతం ఒకేశాఖ(రెవెన్యూ శాఖ)కు పరిమితమవుతారు. ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో)లో కీలక అధికారి అయిన ప్రవీణ్ ప్రకాశ్ సూచనల మేరకు, ముఖ్యమంత్రి జగన్ అనుమతితో అమలైనట్లుగా చెబుతోన్న ఈ నిర్ణయం.. రాష్ట్రాల్లో పరిపాలనకు సంబంధించి కొత్త ఒరవడిగానూ నిలిచింది. కేంద్ర ప్రభుత్వం తరహాలో ఏపీలోనూ పన్నులకు సంబంధించిన అన్ని శాఖలను ఆర్థిక శాఖ పరిధిలోకి తీసుకొస్తున్నారు.
సాధారణంగా అన్ని రాష్ట్రాల్లోనూ రెవెన్యూ విభాగంలో కీలకమైన వాణిజ్య పన్నులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలు విడిగా కొనసాగుతూ, వేర్వేరుగా మంత్రులు సైతం ఉంటారు. అయితే, ఏపీలో జగన్ సర్కారు అనుసరిస్తోన్న వినూత్న విధానాలకు అనుగుణంగా ఆ రెండు శాఖలను రెవెన్యూ శాఖ నుంచి విడగొడ్డి, ఆర్థిక శాఖ పరిధిలోకి తేవాలని నిర్ణయించారు. ఆదాయం (రెవెన్యూ) లభించే అన్ని విభాగాలనూ ఆర్థిక శాఖ పరిధిలోకి తేవడం ద్వారా వనరుల సమీకరణ, సమన్వయం మరింత పెరుగుతుందని ప్రభుత్వం భావించింది. ఈ దిశగా జులై నుంచి సాగుతోన్న కసరత్తు ఓ కొలిక్కి రావడంతో డిప్యూటీ సీఎం నుంచి వాణిజ్యశాఖను తొలగించి, ఆర్థిక శాఖకు అప్పగిస్తూ గెజిట్ జారీ అయింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను ఆర్థిక శాఖలో కలిపే మరో గెజిట్ త్వరలోనే జారీ కానుంది. నిజానికి ఈ విధానాన్ని రాష్ట్రాలేవీ పాటించకున్నా, కేంద్ర ప్రభుత్వంలో మాత్రం రెవెన్యూ విభాగం తొలి నుంచీ ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోనే ఉంటోంది. జగన్ తాజా నిర్ణయం ఏమేరకు ఫలితాన్నిస్తుందో వేచిచూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra pradesh news, Ap cm jagan, Narayana Swamy