MP Raghurama: రఘురామ సెల్‌ఫోన్ సీజ్‌పై ప్రకటన విడుదల చేసిన ఏపీ సీఐడీ.. ఏం చెప్పిందంటే..

జగన్, సీబీఐ కోర్టు, రఘురామరాజు

రఘురామ సెల్‌ఫోన్‌ను సీఐడీ అధికారులు అనధికారికంగా జప్తు చేశారని, ఆ ఫోన్ నుంచి వాట్సాప్ సందేశాలు వెళుతున్నాయన్న వార్తలు ఇటీవల హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఆరోపణలపై ఏపీ సీఐడీ తాజాగా స్పందించింది. ఎంపీ రఘురామ సెల్‌ఫోన్‌ను తమ వద్దే ఉంచుకున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని సీఐడీ స్పష్టం చేసింది.

  • Share this:
    విజయవాడ: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజుకు, ఏపీ ప్రభుత్వానికి మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఏపీ సీఐడీ రఘురామను అరెస్ట్ చేయడం.. ఆ తర్వాత సుప్రీం కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే.. రఘురామ సెల్‌ఫోన్‌ను సీఐడీ అధికారులు అనధికారికంగా జప్తు చేశారని, ఆ ఫోన్ నుంచి వాట్సాప్ సందేశాలు వెళుతున్నాయన్న వార్తలు ఇటీవల హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఆరోపణలపై ఏపీ సీఐడీ తాజాగా స్పందించింది. ఎంపీ రఘురామ సెల్‌ఫోన్‌ను తమ వద్దే ఉంచుకున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని సీఐడీ స్పష్టం చేసింది. ఆయనపై నమోదైన కేసు దర్యాప్తులో భాగంగానే ఫోన్‌ను సీజ్ చేశామని, ఆ విషయాన్ని న్యాయస్థానానికి కూడా నివేదించామని సీఐడీ అధికారులు తెలిపారు. ఈ కేసులో రఘరామతో పాటు మరో రెండు తెలుగు న్యూస్ చానళ్లపై కూడా నిబంధనల ప్రకారమే దర్యాప్తు చేస్తున్నామని సీఐడీ పేర్కొంది.

    అంతేకాదు.. రఘురామ సెల్‌ఫోన్ జప్తునకు సంబంధించి ఏపీ సీఐడీ కొన్ని కీలక విషయాలను కూడా వెల్లడించింది. కేసు దర్యాప్తులో భాగంగా రఘురామ సెల్‌ఫోన్‌ను సీజ్ చేసిన సీఐడీ అధికారులు ఆ సెల్‌ఫోన్‌కు సీల్ వేసి గుంటూరులోని సీఐడీ న్యాయస్థానానికి సమర్పించారు. మే 18న ఆ సీల్ కవర్‌లోని సెల్‌ఫోన్‌ను ఫోరెన్సిక్ పరీక్షల కోసం ఏపీ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఫోరెన్సిక్ ల్యాబ్ తుది నివేదికను ఇవ్వాల్సి ఉంది. ఈ కేసు దర్యాప్తులో ప్రతీ అంశాన్ని న్యాయస్థానానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నామని సీఐడీ చెబుతోంది.

    ఇది కూడా చదవండి: GVMC: జీవీఎంసీ కూల్చివేతతో రోడ్డున పడ్డ దివ్యాంగులు.. అధికారుల చర్యపై సర్వత్రా విమర్శలు

    రఘురామ సెల్‌ఫోన్ మే 18 నుంచి ఫోరెన్సిక్ ల్యాబ్‌లో ఉందని, ఆ సెల్‌ఫోన్ తమకు అందుబాటులోనే లేదని సీఐడీ అధికారులు తెలిపారు. దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు ఎంపీ రఘురామకృష్ణ రాజు అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ఇప్పటికీ ఆ సెల్‌ఫోన్ నంబర్ ఏంటనేది కూడా సీఐడీ పోలీసులకు తెలియదని ఏపీ సీఐడీ ఓ ప్రకటనలో పేర్కొంది. జప్తు చేసిన ఎంపీ సెల్‌ఫోన్‌కు సబంధించిన అన్ని వాస్తవాలను సుప్రీం కోర్టుకు నివేదిస్తామని.. అనంతరం తదనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటామని సీఐడీ తెలిపింది.
    Published by:Sambasiva Reddy
    First published: