ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రివర్గం (AP Cabinet) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గురువారం సీఎం జగన్ (AP CM YS Jagan) అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో సంక్షేమ క్యాలెండర్ (AP Welfare Schemes) కు ఆమోదం తెలపడంతో పాటు వ్యవసాయంపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి వ్యవసాయ సీజన్ ముందుగానే ప్రారంభించడమే కాకుండా.. కృష్ణ, గోదావరి డెల్టాలకు, రాయలసీమ ప్రాజెక్టులకు ముందుగానే నీటిని విడుదల చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా గోదావరి డెల్టాకు జూన్ 1న, కృష్ణా డెల్టాకు జూన్ 10న, రాయలసీమకు జూలై 30న నీటిని విడుదల చేసే నిర్ణయానికి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక సంక్షేమ పథకాల క్యాలెండర్ ను మంత్రివర్గం ఆమోదించింది. వచ్చే రెండు నెలల్లో ఏయే పథకాలు అమలు చేయబోతున్నదీ తేదీలతో సహా ప్రకటిచింది.
మే 13వ తేదిన కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా అర్హులైన మత్స్యకార కుటుంబాలకు రూ.10వేల చొప్పున జమ చేయనుంది. మే16న వైఎస్ఆర్ రైతు భరోసా (YSR Rythu Bharosa) కింద రైతుల ఖాతాల్లో రూ.5,500 చొప్పున జమ చేస్తారు. మే 31న ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద రెండు విడతల్లో రూ.7,500ను అర్హులైన రైతుల ఖాతాల్లో వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
జూన్ 19న యానిమల్ అంబులెన్సుల ప్రారంభోత్సవం ఉంటుంది. జూన్ 6వ తేదీన కమ్యూనిటీ హైరింగ్ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 3వేల ట్రాక్టర్లు, 402 హార్వెస్టర్లను పంపిణీ చేస్తారు. జూన్ 14న వైఎస్ఆర్ పంటల బీమా పథకం కింద గత ఏడాది పంటలు నష్టపోయిన రైతులకు బీమా చెల్లిస్తారు. జూన్ 21న జగనన్న అమ్మఒడి పథకం (Jagananna Ammavodi Scheme) కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.15వేల చొప్పున జమ చేస్తారు. జూన్ 1న వ్యవసాయరంగానికి సాగునీటి ప్రణాళిక ప్రారంభమవుతుంది.
సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు సైతం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్న్ ఇచ్చింది. పెనుగొండలో టూరిస్ట్ క్యాంపస్ కోసం భూమి కేటాయించింది. తిరుపతి జిల్లాలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. నెల్లూరులో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి యూనివర్సిటీ, సర్వేపల్లిలో బయోఇథనాల్ ప్లాంట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కడప జిల్లాలో ఆస్పత్రి నిర్మాణానికి ఆమోదం తెలిపింది. పామర్రులో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆధునీకరణ, పులివెందులలో మహిళా డిగ్రీ కళాశాలలో నియామకాలకు ఆమోదం తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP cabinet