ఏపీ రాజధాని తరలింపుపై ఇవాళ అసెంబ్లీలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉండటంతో... దాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. ఛలో అసెంబ్లీకి పిలుపు ఇచ్చింది. దీంతో... 2500 మంది పోలీసులు అక్కడ మోహరిస్తున్నారు. మరో 2500 మంది పోలీసులు రాజధాని గ్రామాల్లో పహారా కాయబోతున్నారు. ఆల్రెడీ 144 సెక్షన్ అమల్లో ఉంది. పోలీస్ యాక్ట్‌లోని సెక్షన్ 30 కూడా అమల్లో ఉంది. ఫలితంగా ఎవరూ ఇల్లు దాటి బయటకు రాకూడదు. ఒకవేళ వచ్చినా ప్రశాంతంగా ఆందోళనలు చేయాలే తప్ప... ఉద్రిక్తతలకు దారితీస్తే పోలీసులు అరెస్టు చేసే ప్రమాదం ఉంటుంది. ప్రభుత్వం గనక రాజధానిని తరలించే ప్రకటన చేస్తే... విశాఖ పరిపాలనా రాజధానిగా మారుతుంది. హైకోర్టు కర్నూలుకు తరలిపోతుంది. విశాఖ, అమరావతిలో హైకోర్టు బెంచ్‌లు ఏర్పాటవుతాయి. అమరావతిలో శీతాకాల, వర్షాకాల సమావేశాలు జరుగుతాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు విశాఖలో జరుగుతాయి.
నేటి ఉదయం 9 గంటలకు సెక్రటేరియట్‌లో ఏపీ కేబినెట్ మీటింగ్ జరుగుతుంది. ఇందులో ఇవాళ హైపవర్ కమిటీ ఇచ్చే రిపోర్టు, అలాగే ఇంతకు ముందే వచ్చిన జీఎన్ రావు కమిటీ రిపోర్టు, బీసీజీ రిపోర్టులపై చర్చించి, ఆమోదించే ఛాన్సుంది. ఒకే రాజధాని - మూడు చోట్ల ఏర్పాటుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. అలాగే CRDA చట్టం రద్దు, CRDA బాధ్యతల్ని విజయవాడ - గుంటూరు - మంగళగిరి - తెనాలి (VGMT) పట్టణాభివృద్ధి సంస్థకు అప్పగించడం వంటి బిల్లుల్ని ఆమోదిస్తారని తెలిసింది. వికేంద్రీకరణ, రైతుల సమస్యలపైనా చర్చించి ఫైనల్ నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. ఉదయం 10 గంటలకు బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశం జరుగుతుంది. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశమవుతుంది.
రాజధాని తరలింపుపై ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. అసెంబ్లీలో మెజార్టీ వైసీపీదే కాబట్టి... ఆటోమేటిక్‌గా వైసీపీ నిర్ణయమే చెల్లుతుంది. మండలిలో మాత్రం టీడీపీకి మెజార్టీ ఉండటం వల్ల... అక్కడ అధికార, పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో ప్రవేశపెడతారని భావిస్తున్న బిల్లును అడ్డుకోవాలని టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. ఐతే... ఏకంగా మండలినే రద్దు చేయాలనే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. అదే జరిగితే... ఇక రాజధాని తరలింపును అడ్డుకోవడం టీడీపీ వల్ల కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amaravati, Andhra Pradesh, AP Assembly, AP cabinet, Ap cm jagan, AP News, AP Politics