విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయంలో అమ్మవారి రథం వెండి సింహాల మాయంపై ఏపీలో రాజకీయ దుమారం రేగుతోంది. ఈవో పొంతనలేని సమాధానాలు చెప్పడంపై విపక్షా పార్టీల నేతలు విరుచుకుపడుతున్నారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు దుర్గ గుడికి వెళ్లి అమ్మవారి రథాన్ని పరిశీలించారు. విగ్రహాల మాయంపై ఈవో సురేష్‌ను నిలదీశారు. ఐతే ఆయన వివరణపై సోమువీర్రాజు మండిపడ్డారు. లాకర్లో ఉన్నాయని ఈవో చెబుతున్నారని... అదే నిజమైతే అన్ని విగ్రహాలూ అక్కడే ఉండాలి కదా అని ప్రశ్నించారు. కానీ బద్దలుకొట్టి సింహం విగ్రహాలను బలవంతంగా తొలగించిన్లు రథంపై ఆనవాళ్లు ఉన్నాయని ధ్వజమెత్తారు సోమువీర్రాజు.
''దుర్గగుడి రథానికి ప్రాముఖ్యత ఎక్కువ. ఈ రథం ఖరీదు రూ.15 లక్షలని ఈవో చెప్పారు. రథంపై ఉండే నాలుగు సింహాల్లో ఒకటే ఉంది. మూడు సింహాలు బలవంతంగా తొలగించబడ్డాయి. నాలుగో సింహం కాలు కూడా తెగిపోయింది. వాటిపై వెండి కోటింగ్ మాత్రమే ఉంటుందని చెప్పారు. లాకర్లో ఉన్నాయని ఈవో చెప్పే ప్రయత్నం చేశారు. ఉంటే నాలుగు లాకర్లో ఉండాలి. మూడే ఎందుకు పెట్టారు. ఒకవేళ లాకర్లో పెట్టారని అనుకున్నా..వాటి తీసే పద్దతి ఉంటుంది. ఇలా బద్దలుగొట్టి తొలగిస్తారా? అధికారుల నిర్లక్ష్య వైఖరే దీనికి కారణం. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ప్రభుత్వం రెండు రోజుల్లో నిజా నిజాలను ప్రజలకు తెలియజేయాలి.'' అని సోమువీర్రాజు అన్నారు.
కాగా, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం ఉత్సవాల్లో వినియోగించే వెండి రథం సింహాలు మాయమయ్యాయి. మొత్తం నాలుగు సింహాలకు గాను ఒక్కటే మిగిలి ఉంది. దానిని కూడా పెకిలించేందుకు ప్రయత్నించి విఫలమయినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. ఒక్కో సింహం విగ్రహానికి 8 కేజీల వెండి వినియోగించారని తెలుస్తోంది. ఈ లెక్కన రూ.15 లక్షల విలువైన 24 కేజీల వెండి అదృశ్యమైంది. కానీ ఈవో మాత్రం వెండి పూతే ఉంటుందని చెబుతున్నారు. అంతర్వేది రథం ఘటన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో రథాల భద్రతపై అధికారులు దృష్టి సారించిన నేపథ్యంలో.. సోమవారం దుర్గగుడి ఈవో సురేష్ బాబు విజయవాడ నగర కమిషనర్ శ్రీనివాస్ ఆలయ రథాన్ని పరిశీలించగా వెండి సింహాలు మాయమైన విషయం తెలిసింది.