ఏపీ శాసన మండలి రద్దులో మరో కీలక ఘట్టం..

ఏపీ శాసన మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీ తీసుకున్న నిర్ణయం పార్లమెంటు సచివాలయానికి చేరింది. ఈ నెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. రెండు విడతలుగా జరిగే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఈ తీర్మానం చర్చకు వచ్చిదంటే చాలు ఇక ఆమోదం లాంఛనమే అవుతుంది.


Updated: January 28, 2020, 4:02 PM IST
ఏపీ శాసన మండలి రద్దులో మరో కీలక ఘట్టం..
దేశ వ్యాప్తంగా పది లక్షల మందికి సగటున 556 టెస్టులు చేస్తున్నారు.
  • Share this:
(సయ్యద్ అహ్మద్, న్యూస్ 18 విజయవాడ కరెస్పాండెంట్)
ఏపీ శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీ తీసుకున్న నిర్ణయం పార్లమెంటు సచివాలయానికి చేరింది. ఇవాళ అసెంబ్లీ తీర్మానం ప్రతిని అధికారులు పార్లమెంటుకు పంపారు. ఈ తీర్మానాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకుని పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదించాల్సి ఉంటుంది. అన్నీ అనుకున్నట్లు పార్లమెంటు ఆమోదం తర్వాత మండలి రద్దును కేంద్రం నోటిఫై చేయాల్సి ఉంటుంది.

ఏపీ శాసనమండలి రద్దు దిశగా వైఎస్ జగన్ సర్కారు మరో అడుగు వేసింది. మూడు రాజధానుల ఏర్పాటుకు ఉద్దేశించిన రెండు కీలక బిల్లులను అసెంబ్లీ ఆమోదం తర్వాత మండలిలో చర్చించి సెలక్ట్ కమిటీకి పంపిన నేపథ్యంలో ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఈ ప్రక్రియ జరగలేదని ప్రభుత్వం భావించింది. దీంతో మండలి తీరుపై అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చించిన ప్రభుత్వం.. న్యాయ నిపుణుల అభిప్రాయం కూడా తీసుకున్న తర్వాత మండలి రద్దుపై తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించింది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలన్నీ మండలి ఇలాగే తిరస్కరిస్తూ పోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని భావించిన ప్రభుత్వం మండలి రద్దుకే మొగ్గుచూపింది.

మండలి రద్దుపై అసెంబ్లీ ఆమోదించిన తీర్మానం ప్రతిని శాసనసభ సచివాలయం పార్లమెంటు సెక్రటేరియట్ కు పంపింది. దీన్ని పార్లమెంటు సెక్రటేరియట్ కేంద్ర హోంశాఖకి నివేదించనుంది. ఈ తీర్మానాన్ని కేంద్రంలోని ఎన్డీయే సర్కారు ఆమోదించే లేదా పక్కనబెట్టే అవకాశాలు ఉంటాయి. దీంతో ఏం జరగబోతోందా అన్న ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. రెండు విడతలుగా జరిగే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఈ తీర్మానం చర్చకు వచ్చిదంటే చాలు ఇక ఆమోదం లాంఛనమే అవుతుంది. కానీ చర్చకు రావాలంటే ముందుగా కేంద్రం సమావేశాలకు ముందు జరిగే కేబినెట్ భేటీలో ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీనిపై ముందుకు వెళ్లాలని భావిస్తే మాత్రం పార్లమెంటు బీఏసీ సమావేశంలో ఏపీ అసెంబ్లీ పంపిన తీర్మానాన్ని ఉభయసభల్లో ఎప్పుడు ప్రవేశపెట్టాలనే అంశాన్ని నిర్ణయిస్తారు.

సాధారణంగా బడ్జెట్ పై చర్చ తర్వాత ఇలాంటి అంశాలపై కేంద్రం చర్చకు చేపట్టే అవకాశాలుంటాయి. కాబట్టి బడ్జెట్ ప్రవేశపెట్టాక ఏదో ఒక రోజు ఏపీ మండలి రద్దు బిల్లు చర్చకు వచ్చే అవకాశముంది. గతంలో రాష్ట్రాల నుంచి వచ్చిన ఇలాంటి విజ్ఞప్తులను మూడు లేదా నాలుగు నెలల్లో కేంద్రం ఆమోదించి పంపిన సందర్భాలున్నాయి. కాబట్టి కేంద్రం మండలి రద్దు బిల్లును ఆమోదించాలంటే మాత్రం ఈ సమావేశాల్లోనే ఉభయసభల్లో ప్రవేశపెట్టే అవకాశముంది. అప్పుడు ఇరు సభలూ సాధారణ మెజారిటీతో ఈ బిల్లును ఆమోదిస్తే ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదంతో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు.

ప్రస్తుతం కేంద్రంతో వైసీపీ ప్రభుత్వానికి ఉన్న సత్సంబంధాలు, గతంలో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు, తాజాగా సీఏఏ బిల్లులపైనా వైసీపీ ఇచ్చిన బేషరతు మద్దతు వంటి విషయాలను కేంద్రం పరిగణనలోకి తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు లేకపోవచ్చని తెలుస్తోంది. ఈ మేరకు కేంద్రంలోని పెద్దలతో వైసీపీ నేతలు సంప్రదింపులు ప్రారంభించినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే పార్లమెంటు సమావేశాలు ముగిసేలోపు జగన్ సర్కారు ఆశించినట్లుగానే ఏపీ మండలి రద్దు నోటిఫికేషన్ విడుదల కానుంది.
Published by: Shiva Kumar Addula
First published: January 28, 2020, 4:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading