దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (Mekapati Goutham Reddy) కి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ నివాళులర్పించింది. ఈ మేరకు సీఎం జగన్ (AP CM YS Jagan).. సంతాపతీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గౌతమ్ రెడ్డి ఇక లేరు అని ఊహించడానికే చాలా కష్టంగా ఉందని సీఎం అన్నారు. గౌతమ్ రెడ్డి లేని లోటు తనకు, పార్టీకి, రాష్ట్రానికి పూడ్చలేనిదన్నారు. గౌతమ్ రెడ్డి నా కన్నా పెద్దవాడైనా.. తనను అన్నా అని పిలిచేవాడని గుర్తుచేసుకున్నారు. మంచి స్నేహితుడు ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నన్నారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పుడు తనతో పాటు నడిచిన అతి తక్కువ మందిలో గౌతమ్ రెడ్డి ఒకరన్నారు. నెల్లూరు జిల్లా కోసం గౌతమ్ రెడ్డి కలలను సాకారం చేస్తామని సీఎం చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి ఉదయగిరికి తాగునీటిని అందిస్తామన్నారు. అలాగే నెల్లూరు జిల్లాలో ఉన్న సంగం బ్యారేజీ పనులను 6 వారాల్లో పూర్తి చేసి ఆ బ్యారేజీకి గౌతమ్ రెడ్డి పేరు పెడతామన్నారు.
రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకురావడంతో గౌతమ్ రెడ్డి కీలక పాత్ర పోషించారని సీఎం జగన్ అన్నారు. అంతేకాదు పెద్దపెద్ద కంపెనీల యాజమాన్యాలతో చర్చించి వారికి భరోసా కల్పించారన్నారు. చివరి నిముషం వరకు రాష్ట్రాభివృద్ధి కోసమే పనిచేశారన్నారు. తాను లేకపోయినా తన ప్రాంతానికి మంచి జరగాలన్న ఆశను నెరవేరుస్తామని జగన్ తెలిపారు. ఉదయగిరిలోని మెరిట్స్ కాలేజీని గౌతమ్ రెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీగా మారుస్తామని సీఎం ప్రకటించారు.
సభలో నా పక్కన కూర్చోవాల్సిన వ్యక్తి.., ఇవాళ లేకపోవడం ఎంతో బాధ కలిగిస్తోందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. దేవుడు మంచివాళ్లను త్వరగా తీసుకుపోతారంటారని.., అందుకే ఆయన ఈ లోకాన్ని వీడారేమోని భావోద్వేగానికి లోనయ్యారు. గౌతమ్‌రెడ్డి మరణం అత్యంత బాధాకరమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆయనలో కోపం ఉండేది కాదని.., వివాదరహితుడు. అందరితో ఎంతో సఖ్యతగా ఉండేవారని గుర్తుచేసుకున్నారు.
గౌతమ్ రెడ్డి గురించి ఇలా మాట్లాడాల్సి రావడం ఎంతో దురదృష్టకరమని ఎమ్మెల్యే రోజా అన్నారు. తాను ఏపీఐఐసి ఛైర్‌పర్సన్‌గా ఉన్న సమయంలో ఒక చెల్లిగా చేసేవారని.., ఎప్పటికప్పుడు తనను గౌడ్ చేసేవారన్నారు. ఆయన ఒక బాహుబలి. అలాంటి వ్యక్తి క్షణాల్లో మాయమయ్యారు. ఆయన లేడన్న విషయం ఇప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదని రోజా అన్నరు.
గౌతమ్ రెడ్డితో తనకు వ్యక్తిగతంగా ఎంతో అనుబంధం ఉందన్నారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. మంచి ఫిట్‌నెస్ ఉన్న గౌతమ్‌రెడ్డి అంత హఠాత్తుగా వెళ్లిపోతారని ఏనాడూ ఊహించలేదన్నారు. రాజకీయాల్లో ఆయన వివాద రహితుడు. మంత్రిగా ఆయన తన శాఖలో తనదైన ప్రత్యేక ముద్ర చూపారని సురేష్ చెప్పారు. రాజకీయాల్లో ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న వ్యక్తి గౌతమ్‌రెడ్డి. ఆయన మరణం రాష్ట్రానికి తీరనిలోటు అని అభిప్రాయపడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.