(సయ్యద్ అహ్మద్ - కరెస్పాండెంట్ - న్యూస్18)
గుడివాడ నియోజకవర్గం రాష్ట్రంలో మరోసారి హాట్‌టాపిక్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే గుడివాడలో తమకు కొరకరాని కొయ్యగా మారిన కొడాలి నానికి చెక్ పెట్టేందుకు అన్ని అవకాశాల్నీ పరిశీలించిన టీడీపీ అధిష్టానం... చివరకు దేవినేని నెహ్రూ వారసుడు అవినాష్‌ను రంగంలోకి దింపింది. అంతవరకూ బాగానే ఉన్నా... ఇవాళ పార్టీలో చేరనున్న వంగవీటి రంగా వారసుడు రాధాకృష్ణకు ఇది పెనుసవాలుగా మారబోతోంది. మచిలీపట్నం ఎంపీ సీటు కేటాయించేందుకు టీడీపీ సిద్ధమైంది. అయితే గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం మచిలీపట్నం పార్లమెంటు పరిధిలోకి వస్తుంది. ఇక్కడ చిరకాల ప్రత్యర్థులైన వంగవీటి, దేవినేని కుటుంబాలు కలిసి పనిచేస్తేనే గుడివాడతో పాటు మచిలీపట్నం ఎంపీ సీటును టీడీపీ గెలవగలుగుతుంది. మరి ఇది సాధ్యమేనా? పాత పగలను పక్కనపెట్టి ఈ లెజెండరీ కుటుంబాలు కలుస్తాయా? కలిసినా ఓటర్లు వీరిని ఆదరిస్తారా? ఇవన్నీ ప్రస్తుతానికి సమాధానం దొరకని ప్రశ్నలే.
దేవినేని కుటుంబం పేరెత్తితే అంతెత్తున లేచే వంగవీటి కుటుంబ వారసుడు రాధాకృష్ణకు అనుకోని కష్టం వచ్చిపడింది. విజయవాడ సెంట్రల్ సీటు ఇవ్వలేదనే కారణంతో వైసీపీని వీడి టీడీపీలో చేరిన రాధాకృష్ణకు ఆ పార్టీ హ్యాండిచ్చింది. బోండా ఉమను కాదని విజయవాడ సెంట్రల్ సీటు ఇవ్వడం కుదరదని తేల్చేసింది. దీంతో ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించిన వంగవీటి రాధా... చేసేది లేక చివరికి మళ్లీ టీడీపీ తలుపు తట్టారు. ఇవాళ ఆయన టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. అంత వరకూ బాగానే ఉన్నా.. మచిలీపట్నం ఎంపీ నియోజకవర్గం నుంచి ఆయన్ను పోటీ చేయాలని టీడీపీ సూచించింది. దీనికి అంగీకరించి ఆయన పార్టీలో చేరుతున్నారు.
వాస్తవానికి వైసీపీ వంగవీటి రాధాను గతంలో ఆయన పోటీ చేసిన విజయవాడ తూర్పు లేదా మచిలీపట్నం ఎంపీ స్ధానాన్ని ఆఫర్ చేసింది. కానీ ఈ రెండూ కాదని ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పారు. చివరికి రాధాకు అసెంబ్లీ అవకాశం దక్కకపోగా... మచిలీపట్నం ఎంపీ సీటులో పోటీ చేయాల్సిన పరిస్ధితి వచ్చింది. ఈ మాత్రం దానికి వైసీపీలో ఉంటే సరిపోయేది కదా అని ఆయన అభిమానులే వ్యాఖ్యానిస్తున్నారు.
మరోవైపు వైసీపీలో ఉంటూనే మచిలీపట్నం ఎంపీ సీటు తీసుకుని ఉంటే గుడివాడ వైసీపీ అభ్యర్ధి కొడాలి నానితో కలిసి తన ప్రత్యర్థి దేవినేని అవినాష్‌ను ఓడించే అవకాశం దక్కేది. ఇప్పుడు టీడీపీలో బందరు ఎంపీగా బరిలోకి దిగడంతో అవినాష్‌ను ఓడించడం మాట అటుంచి ఆయనతో తప్పనిసరిగా కలిసి పనిచేయాల్సిన పరిస్థితి ఉంటోంది.
బందరు ఎంపీగా రాధా గెలవాలంటే మాత్రం గుడివాడ సెగ్మెంట్లో ఓట్లు తప్పనిసరి. ఈ వ్యవహారం శత్రువుకు శత్రువు మిత్రుడన్న చందంగా ఎవరికి కలిసి వస్తుందో తెలియని పరిస్ధితి. బందరు ఎంపీగా గెలిచినా, గెలవకపోయినా వంగవీటి రాధా, దేవినేని అవినాష్ ఏ మేరకు కలిసి పనిచేస్తారన్నది ప్రశ్నార్థకమే. కనీసం కలిసి ప్రచారమైనా నిర్వహిచడం అనుమానమే.
ఇవి కూడా చదవండి :
ఎన్నికల తేదీలపై బీజేపీ లెక్కలేంటి?... రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల జోరు ఎలా ఉంది?
ఎన్నికల్లో డబ్బులు పంచితే పార్టీలకు మూడినట్లే... ఈసీ కమిటీ చూస్తోందిగా...
రూ.50 వేల కోట్లు... ఎన్నికల కోసం ఈసీ పెడుతున్న ఖర్చు
టీడీపీ, వైపీసీ, జనసేన తొలి జాబితాలు రెడీ... నేడు రిలీజ్?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh Assembly Election 2019, Chandrababu naidu, Nani