ఏపీ ప్రత్యేక హోదా అటకెక్కినట్లేనా... వైసీపీ వ్యూహమేంటి..?

AP Special Status : రాష్ట్రం విడిపోయినప్పుడు ఏపీకి ఇచ్చిన ప్రధాన హామీ ప్రత్యేకహోదా. ఐదేళ్లుగా అది అమలవ్వలేదు. ఇప్పుడు అమలయ్యే అవకాశాలు మరింత తగ్గిపోయాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: May 24, 2019, 5:37 AM IST
ఏపీ ప్రత్యేక హోదా అటకెక్కినట్లేనా... వైసీపీ వ్యూహమేంటి..?
ఏపీకి ప్రత్యేక హోదా తెచ్చేదెవరు? ఇచ్చేదెవరు?
Krishna Kumar N | news18-telugu
Updated: May 24, 2019, 5:37 AM IST
ఏపీకి ప్రత్యేక హోదా రావాలంటే... కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇవ్వాలి. ఏపీలో గత టీడీపీ ప్రభుత్వం బీజేపీతో పొత్తు పెట్టుకొని... హోదా బదులు ప్యాకేజీ తీసుకోవడానికి సిద్ధపడటంతోనే ప్రత్యేక హోదా అంశం అటకెక్కినట్లైంది. నాలుగేళ్ల తర్వాత అదే బీజేపీకి దూరమైన టీడీపీ... ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అంటూ గళమెత్తినా బీజేపీ సర్కార్ దిక్కున్నచోట చెప్పుకోమంది. అందువల్ల ప్రత్యేక హోదా సాధించాలంటే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీతో, కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీకి అవసరం ఉండితీరాలనే ఆలోచన అందరిలోనూ కలిగింది. కానీ కేంద్రంలో ఇదివరకు 282 స్థానాలు సాధించిన బీజేపీ... ఇసారి ఏకంగా 303 సీట్లు సాధించి... సొంతంగానే మెజార్టీ దక్కించుకొని... అధికారంలోకి వస్తోంది. ఇక మిత్రపక్షాల మద్దతుతో NDA బలం 353కి పెరిగింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లోని వైసీపీతోగానీ, టీఆర్ఎస్‌తోగానీ బీజేపీకి ఎలాంటి అవసరమూ కనిపించట్లేదు. అందువల్ల కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి ప్రత్యేక హోదా సాధించాలని ఇన్నాళ్లూ నేతలు పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి.

వైసీపీ ఏం చేస్తుంది.. ? : ఏపీలో బంపర్ మెజార్టీ 151 సీట్లతో అధికారంలోకి వస్తున్న వైసీపీ ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకే కేంద్రంలో మద్దతు ఇస్తామన్న వైసీపీకి ఇప్పుడా పరిస్థితి కనిపించట్లేదు. వైసీపీ మద్దతు ఇచ్చినా, ఇవ్వకపోయినా బేఫికర్ అంటున్న బీజేపీ... ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశంతో ఉంటుందని అనుకోలేం. కాకపోతే... బీజేపీతో టీడీపీ వైరం పెట్టుకోగా... వైసీపీ మాత్రం ఎలాంటి వైరమూ లేకుండా ఉంటూ అధికారంలోకి వచ్చింది. మరి ఇప్పుడు ప్రత్యేక హోదాపై ఎలా ముందుకెళ్లాలన్నది ఆ పార్టీకి సవాలుగా మారింది.

కేంద్రం సహకారం లేకపోవడం వల్ల ఏపీలో అభివృద్ధి కుంటుపడింది. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలన్నా కేంద్రం నుంచీ నిధులు రావాల్సిందే. ప్రస్తుతం ఏపీ ఖజానా ఖాళీగా ఉంది. గత ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో చాలా హామీలు ఇచ్చి... వేరే అంశాల కోసం కేటాయించిన నిధులను... ఆ హామీలకు ఖర్చుపెట్టింది. ఫలితంగా దాదాపు రూ.2 లక్షల కోట్ల రూపాయల అప్పులున్నట్లు సమాచారం. ఇవన్నీ వైసీపీ ముందున్న సవాళ్లు. ఇప్పటికిప్పుడు వైసీపీ తాను ఇచ్చిన హామీలను అమలు చెయ్యాలన్నా నిధులు కావాల్సిందే. పరిపాలన సజావుగా సాగాలంటే కేంద్రంలో బీజేపీతో సఖ్యతగా మెలగాల్సిందే. అందువల్ల మొండిగా ముందుకెళ్లే పరిస్థితి లేనందువల్ల కేంద్రం ఇంతకుముందులాగే ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ససేమిరా అనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల ప్రస్తుత ప్రభుత్వం ఆ విషయాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టి... ఇతర అభివృద్ధి అంశాలపై దృష్టిసారించడమే మేలంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అలాకాదని ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని కేంద్రానికి ఎదురెళ్తే... ఇంతకుముందు ప్రభుత్వం లాగే కేంద్ర సహకారం కోల్పోయి... లేనిపోని సమస్యలు తెచ్చుకునే ప్రమాదం ఉందంటున్నారు.

First published: May 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...