ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 30న విజయవాడలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరుకాబోతున్నారని తెలిసింది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా వైఎస్ జగన్ ఆహ్వానం పంపారని సమాచారం. ఈ ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన కేసీఆర్... హాజరవ్వబోతున్నారని తెలిసింది. ఇదివరకు టీడీపీ అధినేత చంద్రబాబు... అమరావతి భూమిపూజకు కేసీఆర్‌ను ఆహ్వానించారు. ఆ కార్యక్రమానికి వెళ్లిన కేసీఆర్... ఏపీతో సత్సంబంధాలు నెరిపారు. చాలా అంశాల్లో రెండు రాష్ట్రాలూ సంయమనంతో ముందుకు సాగాయి. కొన్ని అంశాలపై రెండు రాష్ట్రాల మధ్యా వివాదాలు ఉన్నప్పటికీ చంద్రబాబుతో సఖ్యతనే కొనసాగించారు కేసీఆర్. ఐతే... తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రెండు రాష్ట్రాల మధ్యా మాటల యుద్ధం జరిగింది. ప్రధానంగా చంద్రబాబు... తెలంగాణలో పోటీ చేయడం, ప్రజాకూటమితో జట్టుకట్టడంపై టీఆర్ఎస్ మండిపడింది. ఆ ఎన్నికల్లో ప్రజాకూటమి ఓడిపోవడంతో... కేసీఆర్ పైచేయి సాధించినట్లైంది. అప్పట్లో చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్న కేసీఆర్... తాజాగా చంద్రబాబు ఓడిపోవడంతో... మాట నెగ్గించుకున్నట్లైంది.
ప్రస్తుతం వైఎస్ జగన్‌తో కేసీఆర్‌కి ఎలాంటి విభేదాలూ లేవు. ఐతే... మున్ముందు ఎలాంటి సమస్యలూ రాకూడదని భావిస్తున్న కేసీఆర్... సంప్రదాయబద్ధంగా తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగే కేసీఆర్‌ను పిలిచారు. అందువల్ల తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడిన వైరుధ్యాలకు ఈ కార్యక్రమం చెక్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.