హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Accident: ఏపీలో ఘోరం.. లారీని ఢీకొట్టి.. కాలిపోయిన కారు.. ముగ్గురు సజీవ దహనం

AP Accident: ఏపీలో ఘోరం.. లారీని ఢీకొట్టి.. కాలిపోయిన కారు.. ముగ్గురు సజీవ దహనం

మంటల్లో కాలిపోతున్న కారు

మంటల్లో కాలిపోతున్న కారు

Prakasam Road Accident: కారులో ఉన్న వారిని కాపాడేందుకు పోలీసులు, స్థానికులు ఎంతో ప్రయత్నించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పెట్రోల్ లీకై మంటలు భారీగా ఎగిసిపడడంతో.. వారంతా కాలిపోయి.. మరణించారు.

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం (AP Road Accident) జరిగింది. ఓ కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఆ వెంటనే మంటలంటుకున్నాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం తిప్పాయిపాలెంలో ఈ ఘటన (Prakasam Accident)జరిగింది. ప్రకాశం జిల్లా కంబం నుంచి శ్రీశైలం వెళ్తున్న కారు.. టైరు పేలడంతో ఒక్కాసారిగా అదుపుతప్పింది. అనంతరం వేగంగా దూసుకెళ్లి లారీని ఢీకొట్టింది. ఆ తర్వాత ఫ్యూయెల్ ట్యాంక్ నుంచి పెట్రోల్ లీకై..మంటలంటుకున్నాయి. క్షణాల్లోనే పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. కారులో ఉన్న వ్యక్తులకు తప్పించుకునే అవకాశమే లేకుండా పోయింది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కారు బూడిదైంది. కారులో ఉన్న వ్యక్తులంతా.. వారు కూర్చున్న చోటే.. సజీవ దహనమయ్యారు. కారు టైరు పేలిపోవడం, అదుపు తప్పి లారీని ఢీకొట్టడం, పెట్రోల్ లీకై మంటలు చెలరేగడం.. అంతా క్షణాల్లోనే జరిగిపోయింది. చూస్తుండగానే కళ్ల ముందే ఘోరం జరిగిపోయింది.

Tirupati Special Trains: శ్రీవారి భక్తులకు గమనిక... తిరుపతికి మరిన్ని ప్రత్యేక రైళ్లు

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బందితో కలిసి మార్కాపురం సీఐ రామాంజనేయులు, ఎస్సై సుమన్ ఘటనా స్థలానికి వెళ్లారు. అప్పటికే కారు తగులబడుతోంది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి. అతి కష్టం మీద వాటిని అదుపు చేశారు. అనంతరం డోర్లు బద్దలు కొట్టి చూడగా.. లోపల ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వారంతా కాలిబూడిదయ్యారు. కారులో ఉన్న వారిని కాపాడేందుకు పోలీసులు, స్థానికులు ఎంతో ప్రయత్నించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పెట్రోల్ లీకై మంటలు భారీగా ఎగిసిపడడంతో.. వారంతా కాలిపోయి.. మరణించారు. ప్రమాదానికి గురైన కారు నెంబరును AP39DE6450 గుర్తించారు. చిత్తూరు జిల్లా భాకరపేటకు చెందిన నరేంద్ర పేరుతో రిజిస్టరయింది.

ప్రమాదంలో మరణించిన కారు డ్రైవర్‌ను భాకరపేటకు చెందిన రావూరి తేజ (35)గా గుర్తించారు. మరణించిన మరో ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాలు పూర్తిగా కాలిపోయి.. గుర్తుపట్టరాని స్థితిలో ఉన్నాయి. డీఎన్ఏ పరీక్షలు చేసిన తర్వాతే.. మృతులపై మరింత స్పష్టత వస్తుంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే రావూరి తేజ కుటుంబానికి సమాచారం ఇచ్చారు. కారులో ఎవరెవరు ఉన్నారన్న దానిపై వివరాలు తెలుసుకుంటారు. ఈ ఘటనతో భాకరపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు. రోడ్డుప్రమాదంలో కాలి బూడిదయ్యాడని తెలిసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Road accident

ఉత్తమ కథలు