• Home
  • »
  • News
  • »
  • andhra-pradesh
  • »
  • ANTI CORRUPTION BUREAU RAIDING IN KANAKA DURGAMMA TEMPLE AT INDRAKEELADRI IN VIJAYAWADA OF ANDHRA PRADESH HERE ARE THE DETAILS PRN

Vijayawada Durga Temple: దుర్గగుడిలో ఏసీబీ దాడుల కలకలం... అమ్మసన్నిధిలో అవినీతి నిజమేనా..?

విజయవాడ దుర్గగుడి (ఫైల్ ఫోటో)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) విజయవాడలోని (Vijayawada) ఇంద్రికీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో (Kanakadurga Temple) కలకలం రేగింది. సిబ్బందిపై అవినీతి ఆరోపణలు రావడం కలకలం సృష్టిస్తోంది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని ఇంద్రికీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో కలకలం రేగింది. అమ్మవారి సన్నిధిలో అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అమ్మవారి దర్శన టికెట్ల అమ్మకాల్లో అవినీతి ఆరోపణలపై స్పందించిన అధికారులు టికెట్ కౌంటర్లలో సోదాలు నిర్వహించారు. 300 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్ల కౌంటర్లలో.. టికెట్ల కంటే అదనంగా నగదు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. కౌంటర్లతో పాటు స్టోర్స్, ఇతర విభాగాల్లోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు 40 మంది అధికారులతో కూడిన బృందం ఆలయంలో తనిఖీల్లో పాల్గొన్నట్లు సమాచారం. ఏసీబీ దాడులపై ఆలయ పాలకమండలి గానీ, ఈవో సురేష్ బాబుగానీ స్పందించలేదు.

    ఇటీవల కనకదుర్గమ్మ ఆలయం తరచూ వివాదాల్లో నిలుస్తోంది. అమ్మవారి వెండిరథంపై సింహాల ప్రతిమల అదృశ్యమైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో దాదాపు నాలుగు నెలల విచారణ అనంతరం నిందితులను పట్టుకున్నారు. చోరీ చేసిన వెండిని కూడా అధికారులు రికవరీ చేశారు. అలాగే దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారి ప్రత్యేక దర్శనం టికెట్లు ధరలు పెంచడం, కొవిడ్ నిబంధనలకు విరుద్ధంగా భక్తులను అనుమతించడం, ముందస్తు బుకింగ్ లేకుండా ఆలయానికి వచ్చిన వారికి అధిక ధరలకు టికెట్లు విక్రయించి దర్శనానికి అనుమతించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

    ఇది చదవండి: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల... పోలింగ్ ఎప్పుడంటే...



    అలాగే అమ్మవారి హుండీ లెక్కింపులోని ఆలయ సిబ్బంది చేతివాటం ప్రదర్శించినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. నవరాత్రుల తర్వాత ఇద్దరు ఆలయ సిబ్బంది హుండీ లెక్కింపులో చేతివాటం ప్రదర్శించగా.. వారి దగ్గర నగదు రికవరీ చేసి పంపారే తప్ప కఠిన చర్యలు తీసుకోలేదు. హుండీ లెక్కింపు సమయంలో ఆలయ అధికారులు నిబంధనలు పాటించలేదన్న ఆరోపణలు కూడా వినిపించాయి. ఇక భవానీ దీక్షల విరమణ సందర్భంగానూ అవకతవకలు జరిగినట్లు ప్రచారం జరిగింది. అలాగే గతంలో అమ్మవారి చీరలు మాయమైన ఘటనపై కూడా ఆలయ అధికారులు, పాలకమండలి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.
    Published by:Purna Chandra
    First published: