Antarvedi: అంతర్వేదిలో ఉద్రిక్తత, మంత్రులను అడ్డుకున్న ధార్మిక సంఘాలు

మంత్రులు వెల్లంపల్లి, పినిపే విశ్వరూప్‌ను అడ్డుకుంటున్న ధార్మిక సంఘాల కార్యకర్తలు

Antervedi Temple Chariot: అంతర్వేది లక్ష్మీనృసింహ స్వామి ఆలయం వద్ద రథం దగ్ధమైన ప్రదేశాన్ని పరిశీలించడానికి వచ్చిన మంత్రులు వెల్లంపల్లి, పినిపే విశ్వరూప్, స్థానిక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావులను అక్కడ ఉన్న ధార్మిక సంఘాలు అడ్డుకున్నాయి.

  • Share this:
    తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో ఉద్రిక్తత నెలకొంది. ఆలయం వద్ద రథం దగ్ధమైన ప్రదేశాన్ని పరిశీలించడానికి వచ్చిన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి, సాంఘిక సంక్షేమ శాఖామంత్రి పినిపే విశ్వరూప్, స్థానిక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావులను అక్కడ ఉన్న ధార్మిక సంఘాలు అడ్డుకోవడంతో పరిస్థితి అదుపుతప్పింది. రథం దగ్ధమైన సంఘటనకు సంబంధించి ప్రభుత్వం చేపట్టిన విచారణ భక్తులను తప్పుదోవ పట్టించేదిగా ఉందని హిందూ ధార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఆలయం వద్దకు వచ్చిన ప్రజాప్రతినిధులకు భజరంగ్ దళ్ సభ్యులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఘటనా ప్రదేశం వద్ద ఏర్పాటుచేసిన బారికేడ్లను ధార్మిక సంఘాలవారు తోసుకొని ముందుకు రావడంతో అక్కడ వాతావరణం వేడెక్కింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితి చక్కబెట్టే ప్రయత్నం చేశారు.

    తూర్పు గోదావరి జిల్లా... అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వందల ఏళ్ల నాటి చరిత్ర ఉన్న అగ్నికుల క్షత్రియుడు, అలయ నిర్మాత కోపనాతి కృష్ణమ్మ నిర్మించిన రథం కాలి బూడిదైంది. మరోవైపు లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో అగ్నిప్రమాదం జరిగి... ఉత్సవ రథం కాలి బూడిదవ్వడాన్ని విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ఖండించారు. ఈ ఘటన దురదృష్టకరం అన్న ఆయన... దీనిపై తక్షణం విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇది దుండగుల చర్యగా తేలితే కఠినంగా శిక్షించాలన్నారు. హిందువుల మనోభావాలతో ముడిపడిన అంశం ఇది అన్న స్వామి... నరసింహస్వామి రథోత్సవం లోపు కొత్త రథ నిర్మాణం పూర్తయ్యేలా దేవాదాయ శాఖ త్వరపడాలని కోరారు.

    అయితే, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు దీనిపై అనుమానం వ్యక్తం చేశారు. అంతర్వేది రథోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని అన్నారు. రథం కాలిపోయిన విధానం చూస్తుంటే ఒక కుట్ర ప్రకారం జరిగినట్లు అనుమానాలు కలుగుతున్నాయని తెలిపారు. దీనిపై రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ ప్రకటన చేయాలని.. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ‘ఎప్పుడు ఇలాంటి ఘటనలు జరిగిన ఒక పిచ్చివాడు చేశాడంటూ కేసులు కొట్టేస్తున్నారు. అలా కాకుండా విచారణ జరిపించి బాధ్యులెవరైన, ఏ మతస్థులైన కఠినంగా శిక్షించాలి. ఒక మతం పై జరిగిన దాడిలా ప్రజలు భావించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో వెల్లంపల్లి శ్రీనివాస్ కాకుండా స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటన చేయాలి. రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా.’ అని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే కొందు అధికారుల మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: