ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగిన జంట హత్యల కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మూఢవిశ్వాసాలకు తోడు మానసిక రుగ్మతల కారుణంగా తల్లిదండ్రులో కన్న కూతుళ్లను దారుణంగా హత్య చేశారు. అప్పటి నుంచి రాష్ట్రంలో ఏదో ఓ చోట అలాంటివే బయటకు వస్తున్నాయి. ఇటీవల చిత్తూరు జిల్లాకు చెందిన ఓ డిగ్రీ విద్యార్థి దేవుడి దగ్గరకు వెళ్తున్నానంటూ ఇల్లు విడిచి వెళ్లిపోగా అతడ్ని విశాఖలో పట్టుకున్నారు. తాజా విశాఖపట్నంలోనే ఓ ఫ్యామిలీ వింత ప్రవర్తనతో స్థానికులను పరుగులు పెట్టించింది. వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నం శివారులోని అజిమాబాద్ లో ఓ కుటుంబం నివాసముంటుంది. కుటుంబంలోని నలుగురు ఇంటి లోపల గడియ పెట్టుకొని రాత్రంతా వింత అరుపులు, కేకలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు.
దీంతో హడలిపోయిన స్థానికులు వారిని పిలిచేందుకు యత్నించారు. ఎంత పిలిచినా ఒక్కరు కూడా స్పందించకపోవడంతో మదనపల్లి తరహా ఘటన ఏమైనా జరిగిందేమోనని భయంతో వణికిపోయారు. ఆ వెంటనే గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కూడా హుటాహుటిన ఆ ఇంటికి చేరుకున్నారు. పోలీసులు పిలిచినా ఆ ఇంట్లో వాళ్లు స్పందించకపోవడంతో వేరే దారిలేక తలుపులు పగులగొట్టారు. లోపల వారు ప్రాణాలతో ఉండటం చూసి ఊపిరి పీల్చుకున్న పోలీసులు వెంటనే ఆ నలుగుర్ని బయటకు తీసుకొచ్చి ప్రశ్నించారు.
భర్త అబ్దుల్ మజీద్, భార్య మేహర్, కొడుకు నూరుద్దీన్, కుమార్త నూర్ గా గుర్తించారు. వీరంతా కొన్నాళ్లుగా మానసిక రుగ్మతలకు గురై వింతవింతగా ప్రవర్తిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఐతే ఇటీవల వీరి ప్రవర్తన మరింత మితిమీరడంతో పోలీసులను పిలవాల్సి వచ్చిందని తెలిపారు. పోలీసులు నలుగురిని వైద్యం కోసం మెంటల్ ఆస్పత్రికి తరలించారు.
మదనపల్లిలో చోటు చేసుకున్న ఘటన తర్వాత ఎక్కడ ఏ ఫ్యామిలీ కాస్త తేడాగా కనిపించినా స్థానికులు కంగారు పడిపోతున్నారు. ఎవరికైనా దెయ్యం పట్టినట్లు పొరబాటున తెలిసినా చుట్టుపక్కల వాళ్లంతా బెంబేలెత్తిపోతున్నారు. విశాఖ ఘటన విషయంలోనూ మదనపల్లి హత్యల ప్రభావం గట్టిగానే పడినట్లుంది. అందుకే స్థానికులు కేకలు వినిపించగానే భయంతో వణికిపోయారు. తీరా వారికి మానసిక సమస్యలున్నాయని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra pradesh news, AP News, Crime, Crime news, Gajuwaka, Telugu news, Visakhapatnam, Vizag