విశాఖపట్టణం జిల్లాలో మరో ఘోరం సంభవించింది. ఓ కంపెనీలో అగ్నిప్రమాదం సంభవించింది. గాజువాక నియోజకవర్గంలోని ఆగనంపూడి పరిధిలో ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్కులోని పారామౌంట్ ఆగ్రో ఇండస్ట్రీస్ (Paramount Agro Industries) అనే కంపెనీ ఉన్న సంగతి తెలిసిందే. ఆ కంపెనీలో బుధవారం రాత్రి ఆగ్నిప్రమాదం సంభవించింది. ఆయిల్ ను నిల్వచేసే కేంద్రం వద్ద నుంచి మంటలు ఎగిసిపడినట్లు తెలుస్తోంది. ఫైర్ ఇంజిన్లు రంగంలోకి దిగి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. మంటలు ఏమాత్రం అదుపులోకి రాలేదు. అయితే ఘటన జరిగిన సమయంలో సిబ్బంది ఎవరూ లోపల లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. దీంతో ప్రాణనష్టం తప్పిపోవడంతో కంపెనీ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. దాదాపు 10 కోట్ల రూపాయల మేరకు ఆస్తినష్టం జరిగి ఉంటుందని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మంటలు ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఇదిలా ఉండగా గతేడాది మే నెల ఏడో తారీఖున విశాఖ జిల్లాలోనే ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీక్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనను రేకెత్తించింది. రెండు గ్రామాలు ఈ ఘటన వల్ల తీవ్రంగా ప్రభావితం చెందాయి. పదకొండు మంది ఈ ప్రమాదం బారిన పడి చనిపోయారు. వందలాది మంది తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గ్యాస్ ప్రభావానికి లోనై మనుషులంతా ఎక్కడికక్కడ పడిపోయారు. పశువులు, పక్షులు, చివరకు తాగే నీరు కూడా గ్యాస్ ప్రభావానికి గురయ్యాయి. ఘటన జరిగిన తర్వాత అత్యంత వేగంగా స్పందించిన ఏపీ సర్కారు, బాధితులను ఆదుకోవడంలో కూడా ఉదారతను చాటుకుంది. ఈ ఘటన వల్ల మరణించిన వారి కుటుంబాలకు కోటి రూపాయల పరిహారాన్ని అందజేయడం గమనార్హం.
కాగా, త్వరలోనే విశాఖకు పరిపాలనా రాజధానిని మార్చాలని జగన్ సర్కారు ప్రయత్నాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. విశాఖకు రాజధానిని రానివ్వడం ఇష్టం లేని వాళ్లే ఈ తరహా ప్రమాదాలకు ఒడిగడుతున్నారనీ, ఈ ఘటనల్లో కుట్ర కోణం ఉందని వైసీపీ ముఖ్యులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే ఈ ఆరోపణల్లో నిజం లేదని ఈ ఘటనకు సంబంధించిన విచారణల్లో వెల్లడవడం గమనార్హం. ఏదిఏమైనా విశాఖలో వరుస ప్రమాదాలు జరగడంతో ఆ ప్రాంత వాసులు ఆందోళనకు గురవుతున్నారు.
Published by:Hasaan Kandula
First published:January 28, 2021, 07:52 IST