ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో తీవ్ర చర్చనీయాంశమైన గుంటూరు (Guntur) నగరంలోని జిన్నా టవర్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవల జిన్నా టవర్ పేరు మార్చాలని.. లేకుంటే కూల్చేస్తామని బీజేపీ నేతలు హెచ్చరించడంతో ప్రభుత్వం వెంటనే అక్కడ జాతీయ జెండాను ఏర్పాటు చేయడంతో పాటు టవర్ కు జాతీయ జెండాలోని రంగులు వేయడంతో వివాదం సద్దుమణిగింది. ఐతే తాజాగా జిన్నా టవర్ వద్ద జాతీయ జెండాను తొలగించడంతో కలకలం రేగింది. దీంతో మరోసారి బీజేపీతో పాటు స్థానికులు ఆందోళనకు సిద్ధమవడంతో కార్పొరేషన్ అధికారులు స్పందించారు. జిన్నా టవర్ వద్ద జాతీయ జెండాను తొలగించలేదని.. ఎత్తుపెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని జీఎంసీ కమిషనర్ నిషాంత్ కుమార్ తెలిపారు. గతంలో 40 అడుగుల ఎత్తులో ఉన్న జెండాను 60 అడుగులకు పెంచుతున్నామని.. పాత దిమ్మెను స్థానంలో కొత్తగా కాంక్రీట్ వేసి బలంగా దిమ్మెను నిర్మిస్తున్నామన్నారు.
కొత్త దిమ్మె ఏర్పాటు పనులు రెండు రోజుల్లో పూర్తవుతాయని కొత్త జెండాను ఏర్పాటు చేస్తామని నిశాంత్ కుమార్ తెలిపారు. జిన్నా టవర్ పై కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని.. అందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. బైస్ మెంట్ ను పటిష్టం చేసే ఉద్దేశంతోనే దిమ్మె తొలగించామన్నారు. మరోవైపు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాలమరణం నేపథ్యంలో ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిందని.. అందులో భాగంగానే జిన్నా టవర్ వద్ద ఉన్న జాతీయ పతాకాన్ని అవనతం చేశామన్నారు. జెండాను అవనతం చేయడంతో కొత్త దిమ్మెను నిర్మించే పనులు చేపట్టినట్లు నిశాంత్ కుమార్ వివరించారు.
గత ఏడాది డిసెంబర్లో జిన్నా టవర్ పై తీవ్ర వివాదం రేగిన సంగతి తెలిసిందే. దేశవిభజనకు కారకుడైన మహ్మద్ అలీ జిన్నా పేరుతో టవర్ ఉండటాన్ని బీజేపీ వ్యతిరేకించింది. ఆ టవర్ కు అబ్దుల్ కలామ్ పేరు పెట్టాలని లేకుంటే కూల్చేస్తామని హెచ్చరింది. దీనిపై ముస్లిం లీగ్ నేతలు మండిపడటంతో వాతావరణం వేడెక్కింది. ఆ తర్వాత ప్రభుత్వం జిన్నా టవర్ పేరు మార్చేది లేదని స్పష్టం చేసింది.
హిస్టరీ ఇదే..!
గుంటూరు నగరంలో ఉన్న ప్రాంతాల్లో ఒకటైన జిన్నా టవర్ సెంటర్.. పాకిస్తాన్ జాతిపిత పేరుతో ఉంది. మొహమ్మద్ అలీ జిన్నా పేరుతో నిర్మించిన ఈ టవర్ గుంటూరు నగరంలో జిన్నా టవర్ గా పిలుస్తారు. 1941 ప్రాంతంలో సత్తెనపల్లి సమీపంలోని కంటిపూడి పరిసర గ్రామాల్లో హిందూ-ముస్లింల మధ్య ఘర్షణలు జరిగాయి. ఆ ఘర్షణలో ముస్లిం వర్గానికి చెందిన 14 మందికి జీవిత ఖైదు పడింది. దీంతో అప్పటి గుంటూరు ఎమ్మెల్యేగా ఉన్న లాల్ జాన్ బాషా వారిని జీవిత ఖైదు నుండి తప్పించటానికి బొంబాయిలో న్యాయవాదిగా ఉన్న జిన్నా సహాయం తీసుకున్నారు. 14 మందికి జీవిత ఖైదు శిక్షగా స్థానిక కోర్టు విధిస్తే, బొంబాయి హైకోర్టులో దానిని రద్దు చేయించారు. అప్పట్లో జిన్నా గుంటూరు వస్తున్నారన్న సమాచారంతో ఆయన గౌరవార్ధం ఆ స్థూపాన్ని నిర్మించారు. ఐతే ఆయనకు తీరిక లేకపోవడంతో రాలేకపోవడంతో అప్పటి నుంచి ఆ టవర్ ను జిన్నా టవర్ గా పిలుస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.