P. Anand Mohan, Visakhapatnam, News18. Andhra University: భావి తరాల కోసం ఆంధ్రా విశ్వవిద్యాలయం అధ్యాపకులు బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పాత కథలు, కావ్యాలు, శాస్త్రాలు, పురాణాలు భవిష్యత్తు తరాలకు అందించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగాా తాళపత్ర గ్రంధ సంపదనంతా డీజీటలైజేషన్ చేసేందుకు అడుగులు వేస్తున్నారు. కథలు, కావ్యాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇలా ఏదైనా పూర్వపు రోజుల్లో తాళపత్ర గ్రంధాలపైనే రాసేశారు. ఎంతో అపూర్వమైన విజ్ఞాన సంపద తాళపత్ర గ్రంధాల్లో ఉంది. అందుకే తాళపత్ర గ్రంథాలు భారతదేశానికి చెందిన విలువైన జాతీయ సంపదగా మేధావులు చెబుతుంటారు. అయితే ఆ గ్రంధాలన్ని ఇప్పుడు అందుబాటులో లేవు. దొరికిన వాటిలో కూడా చాలా శిధిలావస్థకు చేరుకున్నాయి. వాటిని కాపాడుకునేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆంధ్రా యూనివర్సీటిలో కూడా వేలాది తాళపత్ర గ్రంధాలున్నాయి. వాటిని భవిష్యత్తు తరాలకు అందించేందుకు తాళపత్ర గ్రంధ సంపదనంతా డీజీటలైజేషన్ చేస్తున్నారు.
1927 సంవత్సరం ఏయూలో డాక్టర్ వీఎస్ కృష్ణా లైబ్రరరీ ప్రారంభమైంది. ఇప్పుడు ఐదు లక్షల 30 వేల వరకు ఎన్నో రంగాలకు సంబంధించిన పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు విలువైన, అరుదైన తాళపత్రగ్రంధాలు కూడా ఎన్నో ఉన్నాయి. వీటిని ప్రత్యేకమైన విభాగంలో భద్రపరుస్తున్నారు. వీటిని నిత్యం సంరక్షిస్తూ, పాడవకుండా అనేక చర్యలు చేపడుతున్నారు.
అలాగే వందల ఏళ్ల నాటి తాళపత్ర గ్రంథాల పరిరక్షణకు 90 ఏళ్ల కిందటే ఏయూలో తాళపత్ర గ్రంధ విభాగం పేరుతో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం 2,663 తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. అప్పట్లో బొబ్బిలి సంస్థానం 220, విశాఖకు ఆర్ష గ్రంథాలయ ప్రతినిధి ఎంబార్ 1368, తుమ్మపాలకు చెందిన ఈమని వెంకటేశ్వర్లు 119, నందిపల్ల్లికి చెందిన నిష్టల రమణయ్య 66, గవరవరానికి చెందిన అన్నపూర్ణయ్య 40 తాళపత్ర గ్రంథాలు ఏయూ లైబ్రెరీకి బహుకరించారు. వీటితో పాటు వివిధ ప్రాంతాల నుంచి కొన్ని తాళపత్రగ్రంధాలను కొనుగోలు కూడా చేశామని ఏయూ అధికారులు చెబుతుంటారు.
తాళపత్రాల రూపంలో ఉన్నవి చాలా విలువైన గ్రంధాలు.. వాటిని సరిగ్గా భద్రపరచగలిగితే 5 నుంచి ఆరు వందల ఏళ్ల వరకు చెక్కుచెదరకుండా ఉంచవచ్చునని ఏయూ లైబ్రెరీయన్ వెంకటేశ్వరావు అంటున్నారు. తొలి రోజుల్లో తాటి ఆకుల్ని పేడ, వేపాకురసంలో వేసి ఉడకబెట్టిన తరువాత ఆకులను అందంగా కత్తిరించి రచనలకు వాడేవారని చెబుతున్నారు.
అలాంటి తాళపత్రాలు ఏయూలో ఇప్పటికీ పదిలంగా ఉన్నాయని, ఆరు భాషాల్లో ఉన్న తాళపత్ర గ్రంథాలు ఉన్నాయని, తాళపత్రాలు శిధిలావస్థకు చేరకుండా రక్షించడానికి ప్రత్యేకంగా తాళపత్ర గ్రంధ విభాగాన్ని నిర్వహిస్తున్నామంటున్నారు. తాళపత్రాలు మరింత కాలం భద్రంగా ఉండేలా కూడా చర్యలు తీసుకుంటున్నామని, భావి తరాలకు వీటి గొప్పతనం తెలియజేయాలనే లక్ష్యంతో వీటిని డిజిటలైజేషన్ చేస్తున్నామని లైబ్రెరీయన్ వెంకటేశ్వర్లు స్పష్టం చేస్తున్నారు.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.