ANDHRA PRADESH VILLAGERS HELP MAN PERFORM WIFE LAST RITES IN GUNTUR DISTRICT SU GNT
Andhra Pradesh: పరిమళించిన మానవత్వం.. రోడ్డుపక్కన పొదల్లో మహిళ మృతదేహం.. అంత్యక్రియలు చేసేందకు భర్తకు సాయం చేసిన చౌటపాపాయపాలెం వాసులు..
రోడ్డుపక్కన పొదల్లో మహిళ మృతదేహం
భార్య మృతదేహానికి అంత్యక్రియలు జరపడానికి కూడా డబ్బులు లేని దయనీయ స్థితి ఆ వ్యక్తిది. అయితే అతనికి డబ్బులు అందజేసిన స్థానికులు అంత్యక్రియలు పూర్తి చేసేందుకు సాయపడ్డారు.
భార్య మృతదేహానికి అంత్యక్రియలు జరపడానికి కూడా డబ్బులు లేని దయనీయ స్థితి ఆ వ్యక్తిది. దీంతో రోడ్డు పక్కన పొదల్లో భార్య మృతదేహాన్ని దాచి చుట్టుపక్కల వారిని సాయం కోరేందుకు వెళ్లాడు. అయితే ఈలోపు రోడ్డుపక్కన మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందిచారు. అయితే డబ్బులు లేకపోవడం వల్లనే ఆ వ్యక్తి ఇలా చేశాడని తెలుసుకున్న స్థానికులు.. మానవత్వాన్ని చాటుకున్నారు. భార్య అంత్యక్రియలకు అవసరమైన డబ్బు సాయాన్ని అందించి పెద్ద మనసు చాటుకున్నారు. సమాజంలో మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది.
వివరాలు.. గుంటూరు జిల్లాలోని చౌటపాపాయపాలెంకి చెందిన రవణమ్మ, ఆమె భర్త అంజనేయులు తెలంగాణలోని నల్గొండ జిల్లాలోని ఓ పౌల్ట్రీ ఫామ్‌లో పనిచేస్తున్నారు. మార్చి 5న నల్గొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రవణమ్మ తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత ఆమెను మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె చికిత్స పొందుతూ మృతిచెందింది. దీంతో పోస్ట్‌మార్టమ్ అనంతరం ఆదివారం సాయంత్రం రవణమ్మ మృతదేహాన్ని.. ఆమె భర్తకు అప్పగించారు. దీంతో భార్య మృతదేహాన్ని తీసుకుని సొంతూరు చౌటపాపాయపాలెం తీసుకుని వచ్చాడు. అయితే అతనికి సొంతూరులో ఇల్లు లేకపోవడంతో.. మృతదేహాన్ని ఎక్కడో ఉంచాలో తెలియలేదు. అయితే అంజనేయులు తన ప్రయత్నాలు చేస్తుండగానే.. సమయం మించి పోతుందని చెప్పిన అంబులెన్స్ డ్రైవర్ మృతదేహాన్ని రోడ్డుపై దించి వెళ్లిపోయాడు.
దీంతో అంజనేయులు తెల్లని గుడ్డ కప్పి ఉన్న భార్య మృతదేహాన్ని పొదల్లో దాచి ఉంచి.. దహన సంస్కారాలకు అవసరం అయ్యే డబ్బు తన వద్ద లేకపోవడంతో సాయం కోరడానికి ఊర్లోకి వెళ్లాడు. ఈలోపు రోడ్డు పక్కన మృతదేహాం పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక, మరోవైపు భార్య అంతక్రియలు చేయడానికి డబ్బులు లేని అంజనేయులుకు తమవంతు సాయం చేశారు. అంత్యక్రియలకు సరిపడ డబ్బులు కలెక్ట్ చేసి.. అంజనేయులుకు అందజేశారు. దీంతో భార్య అంత్యక్రియలు పూర్తి చేయడానికి అంజనేయులుకు మార్గం సుగమమైంది.