ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామ, వార్డు వాలంటీర్ వ్యవస్థను అమల్లోకి తెచ్చింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సులభంగా ప్రజల వద్దకు చేర్చేందుకు వాలంటీర్ వ్యవస్థ వినియోగిస్తోంది. ఈక్రమంలో ప్రజలకు అందాల్సిన సేవలు, ఇతర పనులు వాలంటీర్ల ద్వారానే పూర్తవుతున్నాయి. ప్రతినెల ఒకటో తారీఖున పెన్షన్లు ఇవ్వాలన్నా..! చేయూత, ఆసరా, రైతు భరోసా, కాపునేస్తం, ఆరోగ్య శ్రీ.., ఇలా ఏ పథకం ప్రజలకు చేరాలన్నా వాలంటర్లే కీలకం. వాలంటీర్ వ్యవస్థతో క్షేత్రస్థాయిలో ప్రజలకు వ్యయప్రయాసలు తగ్గిపోయాయి. ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్ధిదారుల గడపలోకే చేరుతున్నాయి. ఐతే తనకు సమీపంలో ఉన్న ఇళ్లకే వాలంటీర్ ప్రభుత్వ పథకాలు అందిస్తాడు. కానీ తన పరిధిలో ఓ చిన్నారి ఆరోగ్యం కోసం ఓ గ్రామ వాలంటీర్ ఏకంగా 1200 కిలోమీటర్లు ప్రయాణించాడు.
వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా, కొత్తూరు మండలంలోని ఓండ్రోజోల గ్రామానికి చెందిన గెల్లంకి రవికుమార్-సుధారాణి దంపతులు ఉపాధి కోసం బెంగళూరు వెళ్లారు. ఇంతలో అనుకోని కష్టం వచ్చింది. వారి రెండేళ్ల చిన్నారికి క్యాన్సర్ సోకినట్లు తేలింది. దీంతో అక్కడే తమ బిడ్డకు వైద్యం చేయిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే రూ.3.50 లక్షలు ఖర్చు చేశారు. చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో ఆరోగ్య శ్రీ తమ బిడ్డను కాపాడుతుందని భావించారు. ఐతే తమ పాప ఆరోగ్య శ్రీకార్డులో లేకపోవడంతో తమ గ్రామ వాలంటీర్ బరాటం నరసింగరావుకు ఫోన్ చేసారు. తల్లిదండ్రులు ఈకేవైశీ చేస్తే ఆరోగ్యశ్రీ కార్డు వస్తుందని చెప్పాడు.
1200 కిలోమీటర్ల ప్రయాణం
పాప ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండటంతో స్వగ్రామానికి రాలేమని రవికుమార్ దంపతులు వాలంటీర్ నరసింగరావుతో చెప్పారు. దీంతో తానే బెంగళూరు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఈనెల 13న ఒండ్రోజుల నుంచి బయయలుదేరిన నరసింగరావు దాదాపు 1200 కిలోమీటర్లు., 24గంటల పాటు ప్రయాణం చేసి బెంగళూరులోని సెయింట్ జాన్సస్ ఆస్పత్రికికి చేరుకున్నాడు. నరసింగరావు. ఆస్పత్రిలోనే పాప తల్లిదండ్రులతో ఈకేవైసీ చేయించాడు. తల్లిదండ్రులతో పాటు చిన్నారి వేలిముద్రలు కూడా తీసుకొని ఆరోగ్య శ్రీ కార్డును అప్ డేట్ చేశాడు. నాలుగు రోజుల్లో కార్డు వస్తుందని భరోసా ఇచ్చాడు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు వాలంటీర్ కు కృతజ్ఞతలు చెప్పారు. చిన్నారి ఆరోగ్యం కోసం ఇంతలా కష్టపడిన నరసింగరావును గ్రామస్తులు అభినందించారు.
Published by:Purna Chandra
First published:January 16, 2021, 11:59 IST