ANDHRA PRADESH TDP LEADER SLAMS ON JAGAN GOVERNMENT ON FARMERS DAY CELEBRATIONS NGS VSP
Andhra Pradesh: నేడు రైతు దినోత్సవం కాదు.. రైతు దగా దినోత్సవం.. మాజీ మంత్రి ఫైర్
జగన్ సర్కార్ తీరుపై అయ్యన్న ఆగ్రహం
ఏపీ ప్రభుత్వం తీరుపై మరోసారి టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. రైతులను నిలువునా మోసం చేసి.. ఇప్పుడు రైతు దినోత్సవాలు ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు. అయితే కౌంటర్ గా టీడీపీ హయాంలోనే రైతులు మోసపోయారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.
ఏపీ వ్యాప్తంగా రైతు దినోత్సవ వేడుకలకు అధికార పార్టీ పిలుపు ఇచ్చింది. రాష్ట్రంలో ఎక్కడికక్కడ వేడుకలు నిర్వహిస్తోంది. అయితే విపక్షాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నాయి. రైతులను దగా చేసి రైతు దినోత్సవం నిర్వహించే అర్హత జగన్ రెడ్డికి లేదని మాజీమంత్రి అయ్యన్న పాత్రుడు మంండిపడ్డారు. తన నివాసం దగ్గర టీడీపీ పార్టీ శ్రేణులతో కలసి ప్లేకార్డులతో నిరసన తెలిపారు అయ్యన్న పాత్రుడు. ఒకే దఫాలో 12,500లు ఇస్తామంటూ రైతులను మోసం చేసి, 7,500 లకు పరిమితం చేసిన జగన్ రెడ్డి అని ఆరోపించారు. అలాగే ఎరువులు, విత్తనాల పై రాయితీ ఎత్తేసిన ఘనత జగన్ రెడ్డి ప్రభుత్వానిదే అని ఆయన విమర్శించారు. రైతులను జగన్ రెడ్డి నిండా మోసం చేశారన్నారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలనలో రైతులు అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
టీడీపీ ప్రభుత్వ హయంలో ఏపీ వ్యాప్తంగా వ్యవసాయ రంగంలో సగటున 11 శాతం వృద్ధి సాధిస్తే.. నేడు కరోనా సమయంలో పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు అప్పుల పాలవ్వాల్సి వస్తోంది అన్నారు. వరుస ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉండగా రైతు దినోత్సవం చెయ్యడం ఏంటి అని ప్రశ్నించారు. రైతు వ్యతిరేక విధానాలతో కోనసీమ రైతులు క్రోప్ హాలిడే ప్రకటించే పరిస్థితికి తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
వైఎస్ జయంతిని రైతు దినోత్సవంగా జరపడం హాస్యాస్పదమని అన్నారు మరో మాజీ మంత్రి చినరాజప్ప. రైతు ఆత్మహత్యలు, క్రాఫ్ హాలిడే వంటి ఘోరాలు వైఎస్ హయాంలోనే జరిగాయన్న విషయాన్ని ప్రజలు మరిచిపోలేదన్నారు. ఆనాడు రైతు వ్యతిరేక విధానాలకు వైఎస్సార్ శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. ఇప్పడు ప్రాజెక్టుల పేరుతో జగన్ డబ్బులు లాగుతున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతును పట్టించుకునే పరిస్థితి లేకపోవడం దారుణమని విమర్శించారు. ఇప్పటికైనా రైతు సమస్యలను అర్థం చేసుకుని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచనలు చేశారు చినరాజప్ప.
రైతుల బతుకులను అంధకార బంధురం చేసిన జగన్ రెడ్డి, ఏ ముఖంపెట్టుకొని రైతు దినోత్సవాలు చేస్తున్నారు? అంటూ టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్తో గతంలో ఆలింగనాలు చేసుకొని, ముద్దులుపెట్టిన ముఖ్యమంత్రి, కృష్ణా జలాల దుర్వినియోగంపై నేడు ఎందుకు నోరెత్తడంలేదని ప్రశ్నించారు. పంట కాలువలను సకాలంలో బాగుచేయడం, రైతులకు నాణ్యమైన విత్తనాలు, పురుగుమందులు అందించడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.