అంతర్వేదిలో అగ్నిప్రమాదంపై స్వరూపానందేంద్ర స్వామి ఆవేదన... ఏమన్నారంటే...

అంతర్వేదిలో అగ్నిప్రమాదంపై స్వరూపానందేంద్ర స్వామి (File)

Antarvedi Fire Accident: అసలా అగ్నిప్రమాదం ఎందుకు జరిగింది? రథాన్ని తగలబెట్టింది ఎవరు? ఇది మనుషుల పనా, ప్రకృతి విపత్తా? నిజానిజాలు తేల్చాలని ప్రభుత్వం ఆదేశించింది.

 • Share this:
  అంతర్వేది: తూర్పు గోదావరి జిల్లా... అంతర్వేదిలోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో అగ్నిప్రమాదం జరిగి... ఉత్సవ రథం కాలి బూడిదవ్వడాన్ని విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ఖండించారు. ఈ ఘటన దురదృష్టకరం అన్న ఆయన... దీనిపై తక్షణం విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇది దుండగుల చర్యగా తేలితే కఠినంగా శిక్షించాలన్నారు. హిందువుల మనోభావాలతో ముడిపడిన అంశం ఇది అన్న స్వామి...
  నరసింహస్వామి రథోత్సవం లోపు కొత్త రథ నిర్మాణం పూర్తయ్యేలా దేవాదాయ శాఖ త్వరపడాలని కోరారు. ఈ ఘటనపై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో... వందల ఏళ్ల నాటి చరిత్ర ఉన్న అలయ నిర్మాత కోపనాతి కృష్ణమ్మ గారు నిర్మించిన రథం కాలి బూడిదైంది. దీనిపై మంత్రి వెల్లంపల్లి... దేవాదాయ క‌మిష‌న‌ర్ అర్జున‌రావు‌, జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు. ఘటన జరిగిందని తెలిసిన వెంటనే సహాయ చర్యలు చేపట్టామనీ, ఫైరింజన్‌తో మంటల్ని అదుపులోకి తెప్పించామని అధికారులు వివరించారు. దీనిపై పోలీస్, రెవెన్యూ అధికారులు దర్యాప్తు జరపాలంటూ, విచార‌ణ అధికారిగా దేవాదాయ శాఖ అద‌న‌పు క‌మిష‌న‌ర్ రామ‌చంద్రమోహన్‌ను ఆదేశించారు వెల్లంపల్లి.

  ఘ‌ట‌న‌కు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథం పునః నిర్మాణానికి చ‌ర్యలు చేప‌ట్టాల‌ని దేవాదాయ క‌మిష‌న‌ర్‌కి మంత్రి సూచించారు. అసలా అగ్నిప్రమాదం ఎందుకు జరిగింది? రథాన్ని తగలబెట్టింది ఎవరు? ఇది మనుషుల పనా, ప్రకృతి విపత్తా? అన్నది దర్యాప్తు తర్వాత తేలనుంది.
  Published by:Krishna Kumar N
  First published: