ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు ఇవ్వడంతో మరోసారి వాతావరణం వేడెక్కింది. ఎస్ఈసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందించారు. పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వాగతించారు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఆయన.., హైకోర్టు తీర్పుపై స్పందించారు. షెడ్యూల్ ప్రకారమే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే దీనిపై ఉన్నతాధికారులతో సమావేశమవుతామని తెలిపారు. గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 5, 9, 13, 17వ తేదీల్లో నాలుగు దఫాల్లో ఎన్నికలు నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. ఎన్నికలకు సహకరిస్తామని ప్రభుత్వం హైకోర్టుకు వివరించినట్లు నిమ్మగడ్డ తెలిపారు. ఎన్నికలపై త్వరలోనే డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమవుతానన్నారు.
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు కొనసాగించాలని తీర్పు ఇచ్చింది. ఎన్నికలపై స్టే విధుస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హై కోర్టు కొట్టేసింది. కరోనా నిబంధనలు సడలించడంతో అన్నికార్యకలాపాలు సజావుగా సాగుతున్నందున ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన నోటిఫికేషన్ అమలు చేసుకోవచ్చని కోర్టు తెలిపింది.
మరోవైపు హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనిపై ఇప్పటికే ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ క్లారిటీ ఇచ్చారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీ కారణంగా రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడం కష్టమని ప్రభుత్వం వాదిస్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ఉయోగులు కూడా పంచాయతీ ఎన్నికల నిర్వహణను వ్యతిరేకిస్తున్నారు. సుప్రీం కోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లో ఇంప్లీడ్ అవుతునట్లు ఉద్యోగుల సంఘం ప్రకటించింది. ఉద్యోగులను బలవంతంగా విధులు నిర్వహించేలా ఒత్తిడి చేయడం సరికాదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకటరెడ్డి అన్నారు.
ఎస్ఈసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మరో రెండు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ ప్రారంభమవుతుంది. ఈనెల 23 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుండటంతో సుప్రీం కోర్టు ఎలాంటి ఆదేశాలిస్తుందోననేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో కేరళ స్థానిక సంస్థల ఎన్నికల వివాదం చర్చనీయాంశం అవుతోంది. గత నెలలో కేరళలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై విచారణకు సుప్రీం కోర్టు నిరాకరించింది. కరోనా బాధితులు, 65ఏళ్లు దాటిన ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయవచ్చంటూ 27/A రూల్ ను సవరిస్తూ ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్ ను జస్టిస్ లావు నాగేశ్వరరావు గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసే పిటిషన్ పై విచారణ జరిగే అవకాశం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Published by:Purna Chandra
First published:January 21, 2021, 12:53 IST