ANDHRA PRADESH STATE ELECTION COMMISSIONER NIMMAGADDA RAMESH KUMAR ISSUES STRICT ORDER TO OFFICIALS AHEAD OF PANCHAYAT ELECTIONS PRN
AP Panchayat Elections: ఎన్నికల నిర్వహణకు అసలు కారణం అదే.., నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక ప్రకటన
నిమ్మగడ్డ రమేష్ కుమార్ (ఫైల్ ఫోటో)
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పంచాయతీ ఎన్నికల (Panchayat Elections)పై రగడ కొనసాగుతోంది. రేపు (జనవరి 23) ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Nimmagadda Ramesh Kumar) సిద్ధమవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలపై రగడ కొనసాగుతోంది. రేపు (జనవరి 23) ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సిద్ధమవుతున్నారు. సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ అత్యవసర విచారణకు ధర్మాసనం నిరాకరించడంతో నోటిఫికేషన్ విడుదల దాదాపు ఖాయమైంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ కీలక ప్రకటన చేశారు. ఈనెల 21 నుంచి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని.., ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంలో కలెక్టర్లు, ఎస్పీలకు పూర్తి అధికారాలు ఇచ్చామని స్పష్టం చేసారు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణ రెండున్నరేళ్లు ఆలస్యమైందని.. ఎన్నికలు నిర్వహిస్తే గ్రామస్థాయి పాలన సక్రమంగా జరుగుతుందన్న ఉద్దేశంతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఉండే అధికారాలే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కి ఉంటాయని.. అధికారులంతా ఎస్ఈసీ ఆదేశాలు పాటించాలన్నారు. గత అనుభవాల దృష్ట్యా ఈసారి మరింత పకడ్బందీ చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల నిర్వహణ అంశాన్ని ఇప్పటికే రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని.. ఎన్నికల సంఘం తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారని పేర్కొన్నారు. ఇక కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెల్లడించారు. కొవిడ్ వ్యాప్తి చెందకుండా పటిష్టంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఎలాంటి హాని జరగకుండా పూర్తి రక్షణ కల్పిస్తామన్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. అభ్యర్థులకు పూర్తి రక్షణ కల్పించాల్సిందిగా ఇప్పటికే పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు.
అధికారులపై చర్యలు
మరో వైపు శనివారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్న నేపథ్యంలో.. పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై వేటువేశారు నిమ్మగడ్డ. ఇద్దరు ఐఏఎస్, ఒక ఐపీఎస్ అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించడంతో పాటు ఇద్దరు కలెక్టర్లు, ఒక ఎస్పీని బదిలీ చేయాలని, మరో ఇద్దరు డీఎస్పీలు, నలుగురు సీఐలపై చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎస్, డీజీపిలకు ఆయన లేఖ రాశారు. గుంటూరు, చిత్తూరు కలెక్టర్లు, తిరుపతి అర్బన్ ఎస్పీలను బదిలీ చేయాలని ఏపీ ఎస్ఈసీ ఆదేశించారు. పలమనేరు, శ్రీకాళహస్తి డీఎస్పీలతో పాటు మాచర్ల, పుంగనూరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐలపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటన విడుదల చేశారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.