ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రామతీర్థం ఆలయంపై దాడి, శ్రీరాముడు విగ్రహం ధ్వంసం ఘటనలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో ఘటనను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం సీఐడీతో దర్యాప్తు చేయిస్తోంది. మరోవైపు ఆలయంలోని విగ్రహాలను పునఃప్రతిష్టించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే దేవాలయం సంప్రోక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. రెండు రోజులుగా గుడిలో హోమాలు నిర్వహిస్తున్నారు. ధ్వంసమైన పురాతన విగ్రహాలను ప్రత్యేకంగా భద్రపరిచేందుకు ఏర్పాట్లు చేశారు. ఆలయంలో ప్రతిష్టేందుకు నూతన విగ్రహాలను తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శిల్పులు సిద్ధం చేస్తున్నారు. కోదండ రాముడు, సీతాదేవి, లక్ష్మణ విగ్రహాల తయారీ దాదాపు పూర్తైంది. ఈ నెల 8న విగ్రహాలు తయారు చేయాల్సిందిగా దేవాదేయ శాఖ టీటీడీకి విజ్ఞప్తి చేయగా.., వెంటనే కంచి నుంచి కృష్ణశిలలను తెప్పించారు.
ముగ్గురు శిల్పులు పదిరోజులుగా విగ్రహాల తయారీలో నిమగ్నమయ్యారు. శ్రీరాముడు విగ్రహం పీఠంతో కలిపి మూడున్నర అడుగుల ఎత్తుండగా, సీతాదేవి, లక్ష్మణుల విగ్రహాలు పీఠంతో కలిపి 3 అడుగుల ఎత్తులో రూపొందించారు. విగ్రహాల తయారీకి స్థపతులు తొలుత 15 రోజుల సమయం అడగ్గా.. కేవలం 10రోజుల్లోనే పూర్తి చేయడం గమనార్హం. ఈనెల 21న టీటీడీ శిల్ప తయారీ కేంద్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దేవాదాయ శాఖ అధికారులకు అప్పగిస్తారు. పండితులతో చర్చించి మంచి ముహూర్తంలో విగ్రహాలు ప్రతిష్టించేందుకు దేవాదేయశాఖ ఏర్పాట్లు చేస్తోంది.
రూ.3 కోట్లతో అభివృద్ధి
రామతీర్థం దేవాలయాన్ని రూ.3 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. పండితుల సలహాలు, వైఖాసన ఆగమ సంప్రదాయం ప్రకారం ఆలయ అభివృద్ది, పునః నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వివరించారు. పునః నిర్మాణ పనులు ఏడాదిలో పూర్తి చేయాలని అధికారులను అదేశించారు. 700 అడుగు ఎత్తులో ఉన్న ఆలయ నిర్మాణం పూర్తి రాతి కట్టడాలతో చేపడతామన్నారు. అలాగే మొట్ల మార్గం సరిచేయడం పాటుగా కొత్త మొట్లు నిర్మించనున్నట్లు తెలిపారు. దేవాలయ పరిసరాల ప్రాంతం మొత్తం విద్యుత్ దీపాలంకరణ, శాశ్వత నీటి వసతి, కోనేటిని శుభ్రపర్చటం, కోనేటి చుట్టూ గ్రిల్స్ ఏర్పాటు, ప్రాకార నిర్మాణం, హోమశాల, నివేదన శాల నిర్మాణం కూడా పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
కాగా డిసెంబర్ 28న అర్ధరాత్రి సమయంలో రామతీర్థం కొండపైన ఉన్న ఆలయంపై దాడి చేసిన దుండగులు కోదండరాముడి విగ్రహ శిరస్సు భాగాన్ని తొలగించడం సంచలనం రేపింది. హాక్సా బ్లేడుతో విగ్రహాన్ని ధ్వంసం చేసి శిరస్సు భాగాన్ని ఆలయం పక్కనే ఉన్న రామకొలనులో పడేశారు. ఆలయంపై దాడికి నిరసనగా రాజకీయ పార్టీలు నీలాచలం కొండవద్ద ఆందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ సీఎం చంద్రబాబు, వైసీపీ ఎంపీ విజసాయి రెడ్డి ఒకేరోజు ఆలయాన్ని సందర్శించడంతో వాతావరణం వేడెక్కింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఘటనపై సీఐడీ విచారణకు ఆదేశించగా.. పోలీసులు ఇప్పటివరకు 21 మంది అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అలాగే విగ్రహ ధ్వంసానికి వినియోగించిన రంపాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అనుమానితులనైతే అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇంతవరకు అసలు నిందితులను పట్టుకోలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra pradesh news, Chandrababu naidu, Hindu Temples, Vellampalli srinivas, Vijayasai reddy, Vizianagaram