రాగల 24 గంటలలో జార్ఖండ్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్‌లలోని మిగిలిన ప్రాంతాలు, ఉత్తర అరేబియా సముద్రం అంతా, ఒడిశా, ఉత్తర మహారాష్ట్ర, మధ్య అరేబియా సముద్రంలలో కొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. తదుపరి 2 రోజులలో మొత్తం దేశం నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు అనుకూల పరిస్థితులు నెలకొన్నాయి. నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. తూర్పు మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రం ప్రాంతాలలో సుమారుగా అక్టోబర్ 29 తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. వీటి ప్రభావం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది.
ఉత్తర కోస్తాంధ్రలో ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రలో ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈరోజు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది.
ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొట్టాయి. తెలంగాణతో పాటు ఏపీలోనూ భారీ వర్షపాతం నమోదైంది. ఏపీలో ఈ ఏడాది జూన్1 నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 27.9 శాతం అధిక వర్షపాతం నమోదైంది. 26.71 శాతం మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదుకాగా.. కేవలం 4.62 శాతం మండలాల్లో మాత్రమే సాధారణం కంటే లోటు వర్షపాతం రికార్డయింది. కడప జిల్లాలో సాధారణం కంటే 67.7 శాతం అధిక వర్షపాతం నమోదైంది. తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాగా గుర్తింపు తెచ్చుకున్న అనంతపురం జిల్లాలో సాధారణం కంటే 58.2 శాతం అధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో 460 మండలాల పరిధిలో అధిక వర్షపాతం, 79 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. కేవలం 31 మండలాల్లో మాత్రమే సాధారణం కంటే తక్కువ వర్షం కురిసింది. భారీ వర్షాలకు రైతులు ఇబ్బందిపడినప్పటికీ.. రాబోయే కాలంలో సాగునీటికి ఇబ్బంది ఉండదనే భావన కూడా అన్నదాతల్లో వ్యక్తమవుతోంది.
మరోవైపు వరదల వల్ల నష్టపోయిన రైతులకు అక్టోబర్ 27న ఇన్ పుట్ సబ్సిడీ అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. గత ప్రభుత్వాలు వరదలు వచ్చి రైతులు పంట నష్టపోయిన తర్వాత ఎప్పటికో ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చేవని, చరిత్రలో తొలిసారి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంత వేగంగా రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తోందన్నారు. రైతులకు సాయం చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకోవడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. అలాగే, వరదలకు, వర్షాలకు తేడా తెలియకుండా విమర్శలు చేస్తున్నారంటూ టీడీపీ నేత నారా లోకేష్ మీద మంత్రి కన్నబాబు మండిపడ్డారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.