news18-telugu
Updated: August 15, 2020, 9:50 PM IST
ప్రతీకాత్మక చిత్రం (Image;PTI)
ఆంధ్రప్రదేశ్లో రాబోయే 5 రోజులు మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లొద్దని విశాఖ వాతావరణ కేంద్రం సూచించింది. అల్పపీడనం కారణంగా రాబోయే ఐదు రోజుల్లో మరింత వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖలోని వాతావరణ శాఖ హెచ్చరిక చేసింది. మత్స్యకారులు ఎవరూ చేపలవేటకు వెళ్లవద్దని, హెచ్చరిక జారీ చేసింది. తీరం వెంబడి 45 నుంచి 55 వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. గాలుల తీవ్రత గంటకు 65 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఏపీలో ఇప్పటికే వానలు దంచికొడుతున్నాయి. గోదావరి, కృష్ణ నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. ఐతే ఈ వాన కష్టాలు మరిన్ని రోజులు తప్పేలా లేదు. ఉత్తర కోస్తా ఒరిస్సా, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం, గాంగేటిక్ పశ్చిమబెంగాల్ ప్రాంతాలలో కొనసాగుతున్న అల్పపీడనం ఇవాళ ఉదయం తీవ్ర అల్పపీడనంగా మారి అదే ప్రాంతంలో కొనసాగుతోంది. దీనికి అనుబంధముగా 9.5 km ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకు వెళ్ళే కొద్దీ నైఋతి దిశ వైపుకు వంపు తిరిగి ఉందని.. క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ప్రకాశం బ్యారేజి కి భారీగా వరద నీరు చేరుతుంది. 60 గేట్లు అడుగు మేర ఎత్తారు అధికారులు. వరద ప్రవాహాన్ని బట్టి మధ్యాహ్నం కి 60 నుండి 70 గేట్లు ఎత్తుతామని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజి కి ఇన్ ఫ్లో 77 వేల క్యూసెక్కులు ఉందని అన్నారు. ఔట్ ఫ్లో 44,000 క్యూసెక్కులు ఉందని పేర్కొన్నారు. తాగు సాగు నీరు కోసం 11,000 క్యూసెక్కులు ఈస్ట్ కెనాల్, వెస్ట్ కెనాల్ ద్వారా విడుదల చేసారు. రెండు రోజుల పాటు వరద ప్రవాహం ఉంటుందని అంటున్నారు. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసారు. రాత్రి కి 60వేలు క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజికి వస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రకాశం బ్యారేజి ఎగువ భాగాన ఉన్న మున్నేరు, వైరా, కట్లేరు నుంచి వరద నీరు వస్తుందని గుర్తించారు. ఇప్పుడొస్తున్న వరద నీరంతా ప్రకాశం బ్యారేజి క్యాచ్ మెంట్ ఏరియాలోదే అని అన్నారు. ఈ రాత్రికి అప్రమత్తంగా ఉండాలని, వరద తీవ్రత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
August 15, 2020, 9:50 PM IST