Vagnaveeti Radha: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల (Andhra Pradesh Politics)పై అవగాహన ఉన్న ఎవరికైనా వంగవీటి రాధా (Vagaveeti Radha) గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.. ఎందుకంటే ఆయన ఓ సామాజిక వర్గానికి చెందిన పెద్ద నాయకుడికి వారసుడు. మాజీ ఎమ్మెల్యే. ప్రస్తుతం టీడీపీ (TDP)లో కొనసాగుతున్నారు.. అయితే గత కొన్నేళ్లుగా ఆయన సైలెంట్ అయిపోయారు. తన పని తాను చేసుకుపోవడం తప్ప.. రాజకీయంగా పెద్ద హడావుడి లేదు. అసలు ఆయన ఉన్నారన్న సంగతే ఎవరికీ గుర్తు లేదన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాంటి నేత ఇటీవల తన తండ్రి వర్ధంతి రోజున సంచలన వ్యాఖ్యలు చేసి.. ఒక్కసారిగా రాష్ట్రం మొత్తం చూపును తనవైపు తిప్పుకున్నారు. అది కూడా ఆయన ప్రస్తుతం ఉన్నది టీడీపీలో.. ఆ వ్యాఖ్యలు చేసింది ఏపీ మంత్రి కొడాలి నాని (Minster Kodali nani).. వైసీపీతోనే ఉంటున్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (MLA Vallabaneni Vamsi)సమక్షంలో.. దీంతో ఈ వ్యాఖ్యలు రాజకీయ రచ్చకు కారణమయ్యాయి. ఈ వ్యవహారంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy).. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఇద్దరూ జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ ఆయన చేసిన వ్యాఖ్యలు కేవలం వ్యూహంలో భాగమా..? నిజంగా ఆయన చెప్పినట్టు హత్యకు కుట్రం జరిగిందా.. రెక్కీ నిర్వహించారా...? ఇకవేళ ఆయన అన్న వ్యాఖ్యలు నిజమైతే.. రాధాను హతమార్చేంత అవసరం ఎవరికి ఉంటుందనేది ఓ ప్రశ్న.
సాధారణంగా బెజవాడ అంటేనే రాజీకయంగా చైతన్యం ఉన్న నగరం. దానికి తోడు గ్రూపు తగాలు.. కులాల కుమ్ములాటలకు పెట్టింది పేరు. అప్పట్లో వంగవీటి, దేవినేని కుటుంబాల మధ్య వైరం రాష్ట్ర రాజకీయాలపై పెను ప్రభావం చూపించింది. రెండువర్గాల్లోని ప్రధాన నాయకులు కాలం చేశాక.. ఆ రెండు కుటుంబాల మధ్య అసలు వివాదం ఉన్న సంగతే ఎవరికీ గుర్తు లేనట్టు పరిస్థితి మారిపోయింది. రాధా వైసీపీ నుంచి టీడీపీలోకి వస్తే.. దేవినేని నెహ్రూ వారసుడు అవినాష్ టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లారు. ఇలా ఇద్దరూ వేర్వేరు పార్టీలో ఉన్నప్పటికీ వివాదాలు లేవు. మరి.. వంగవీటి రంగా వర్ధంతి రోజున రాధా వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది. అది కూడా వైసీపీ నేతలు, తన సన్నిహితుల మద్య కామెంట్ చేయడం వెనుక అసలు కథ ఏంటి..?
ఇదీ చదవండి : ముందు పెట్రోల్.. డీజిల్ రేట్లు తగ్గించండి.. సోము వీర్రాజు వ్యాఖ్యలకు బొత్స కౌంటర్
వంగవీటి రాధా హత్యకు నిజంగానే కుట్ర జరిగితే ఆయన ఇంత వరకు ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.. కనీసం తాను ఉంటున్న పార్టీ అధినేతకు.. సన్నిహితులకు కూడా ఎందుకు విషయం చెప్పలేదు. రంగా వర్థంతి రోజునే ఈ విషయాన్ని ఎందుకు చెప్పారు? తనపై ఎవరు రెక్కీ నిర్వహించారో తెలుసన్న ఆయన.. వారి పేర్లు ఎందుకు వెల్లడించడం లేదు. తనకు భయంలేదని.. ప్రజల్లోనే ఉంటానని.. తన హత్యకు కుట్ర చేసిన వారిని ప్రజలు దూరం పెట్టాలని చెప్పటంతో.. ఆ కుట్ర చేసింది రాజకీయ నాయకులనే చర్చ మొదలైంది. ప్రస్తుతం టీడీపీలో ఉన్న రాధా ఏ పార్టీకి చెందిన వారిపై ఈ ఆరోపణలు చేశాన్నది క్లారిటీ లేకుండా పోయింది.
ఇదీ చదవండి : ఆంధ్రా అబ్బాయిలకు ఫుల్ డిమాండ్.. ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న విదేశీ యువతులు.. వీడియో
ఒకవేళ రాధా హత్యకు కుట్ర జరిగింది అన్నది అసత్యం అయితే.. ఆయన ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి..? మూడుసార్లు మూడు పార్టీల నుంచి బరిలో దిగి.. ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీలో ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో ఎక్కడా పోటీ చేయలేదు. పైగా సంచలన వ్యాఖ్యలు చేసిన రోజునే టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈ మాజీ ఎమ్మెల్యేను కలిశారు. వీరిద్దరూ మంత్రి కొడాలి నానితో కలిసి గుడివాడలో రంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. వంశీ, నాని సమక్షంలోనే తన హత్యకు రెక్కీ జరిగిందని ఆయన ఆరోపణలు చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అంటూ రాజకీయ విశ్లేషకులే తలలు పట్టుకుంటున్నారు.
అయితే ప్రస్తుతం బెజవాడ రాజకీయాల్లో మాత్రం ఓ ప్రచారం ఉంది. రాధాను తిరిగి వైపీపీలోకి తీసుకురావాలని మంత్రి కొడాలి నాని ప్రయత్నిస్తున్నారని.. అందులో భాగంగానే ఈ వ్యాఖ్యలు చేశారని స్థానిక కార్యకర్తల టాక్. కానీ ఆయని వ్యాఖ్యలు చేయించిన ఉద్దేశం ఒకటైతే.. బయటకు వెళ్లింది వేరేలా అయ్యిందనే మదనం ఇటు వైసీపీ మంత్రుల్లోనూ మొదలైంది. ఇటు రాధా చేసిన ఈ కామెంట్స్‌పై టీడీపీ, వైసీపీ నేతలు ఘాటుగానే స్పందిస్తున్నారు. రాధాకు మేం ఉన్నాం అంటే మేం ఉన్నామంటూ పోటీ పడుతున్నారు. ఇంతకీ ఆయన మనసులో ఏం ఉందో చూడాలి..
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, Devineni avinash, Vangaveeti Radha, Vijayawada