(రఘు - కరెస్పాండెంట్ - న్యూస్18తెలుగు)
దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యం కలిగిన పార్లమెంట్ నియోజకవర్గాల్లో నరసారావుపేట ఒకటి. ఇదివరకు ఇక్కడి నుంచీ పోటీ చేసిన కాసు బ్రహ్మానందరెడ్డి కేంద్ర హోం మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ నియోజకవర్గానికి ఎంతో గుర్తింపు తెచ్చారు. ఆ తర్వాత ఇక్కడి నుంచీ పోటీచేసిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కొణిజేటి రోశయ్య ముఖ్య మంత్రులుగా సేవలందించారు. ఇలాంటి నియోజవర్గం నుంచి 2019 ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా రాజకీయంగా, సామాజిక వర్గ పరంగా, ఆర్థికంగా అత్యంత బలవంతులు కావడంతో ఏపీ రాజకీయాల దృష్టి ఒక్కసారిగా నరసారావుపేట వైపు మళ్ళింది.
గుంటూరు జిల్లాలోని 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒకటైన నరసారావుపేట పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు... వ్యక్తిగతంగా కూడా బలమైన వారు కావడంతో ఇక్కడి పోరు రసవత్తరంగా మారింది. టీడీపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు దశాబ్దాల తరబడి తన రాజకీయ జీవితంలో తలపండిన నేతగా గుర్తింపు పొందారు.
ప్రతిపక్ష వైసీపీ నుంచి బరిలో నిలిచిన లావు శ్రీకృష్ణదేవరాయలు... యువకుడు, విద్యావంతుడు కావడం, నియోజక వర్గంలో ప్రధాన సామాజిక వర్గాల్లో ఒకటైన కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు కావడం ఆయనకు కలిసొచ్చే అంశాలు. రాష్ట్రవ్యాప్తంగా పేరున్న విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ లావు రత్తయ్య కొడుకు కావడం ఆయన ప్రధాన బలం. లావు రత్తయ్యకు టీడీపీతో పాటూ ఆయన సొంత సామాజిక వర్గ నేతలతో వ్యక్తిగత పరిచయాలున్నాయి.
ఇక జాతీయ పార్టీ అయిన బీజేపీ తరపున కాపు సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బరిలో నిలవడంతో నరసారావుపేట పార్లమెంటు రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. కన్నా ప్రభావం రాష్ట్రంలో కాపు సామాజిక వర్గంపై ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది. కన్నా రాజకీయపరంగా, సామాజిక వర్గం పరంగా, ఆర్థికపరంగా అత్యంత బలవంతుడు కావడం ఆయనకు కలిసొచ్చే అంశం.
కాంగ్రెస్, జనసేన పార్టీలు నరసారావుపేట నియోజకవర్గంలో పెద్దగా ప్రభావం చూపట్లేదు. అభ్యర్థులు కూడా బలమైన వారు కాదు. రాజకీయ చైతన్యం కలిగిన నరసారావుపేట ఓటర్లు... పార్లమెంట్ అభ్యర్థుల్లో ఎవరిని గెలిపిస్తారన్నది ప్రస్తుతానికి ఆసక్తికర సస్పెన్స్.
ఇవి కూడా చదవండి :
PUBG : ఇండియాలో పబ్జీ ఎర్రర్ ఫిక్సైంది... ఇక ఎంతసేపైనా ఆడుకోవచ్చు...
టీడీపీకి మరో ఎదురు దెబ్బ... వైసీపీలోకి మాజీ మంత్రి ?
తెలంగాణలో పోటీకి టీడీపీ దూరం... రాహుల్‌తో డీల్ కుదిరిందా ?
డబ్బు కోసమే వైఎస్ వివేకానందరెడ్డిని చంపారా... బీరువాలో రూ.1.20 కోట్లు ఏమయ్యాయి?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Bjp, Kanna, Lok Sabha Election 2019, Narasaraopet S01p14, Tdp, Ysrcp