Vangaveeti Security: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. ఓ వైపు రాష్ట్రంలో కాపు నేతలంతా హైదరాబాద్ లో రహస్యంగా భేటీ అయితే.. ఏపీలో వంగవీటిపై వైసీపీ స్పెషల్ కేర్ తీసుకుంటోంది.. అసలేం జరిగిందంటే..?
Vangaveeti Radha Security: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అప్పుడే ఎన్నికల వాతావరణ కనిపిస్తోంది. పొత్తులు.. గెలుపు వ్యూహాల్లో అప్పుడే అన్ని పార్టీలు మునిగి తేలుతున్నాయి. ముఖ్యంగా కాపు సామాజిక వర్గ ఓట్ల చుట్టూ పార్టీల వ్యూహాలు కనిపిస్తున్నాయి. ఓ వైపు రాష్ట్రంలో ప్రముఖ కాపు నేతలంతా హైదరాబాద్ లో ప్రత్యేకంగా సమావేశమైతే.. ఇటు వంగవీటి రాధకు వైసీపీ దగ్గర అవుతున్నట్టు కనిపిస్తోంది పరిస్థితి. తాజాగా కృష్ణా జిల్లా (Krishna District) రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. దివంగత నేత వంగవీటి మోహన రంగా వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ (Vangaveeti Radha) సంచలన వ్యాఖ్యలు చేయడం.. అది కూడా మంత్రి కొడాలి నాని.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీల సమక్షంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం కొత్త రాజకీయనికి తెరలేపినట్టు అయ్యింది..
తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని.. కొంతమంది తనను చంపేందుకు కుట్ర చేశారని రాధా బాంబు పేల్చారు. అయితే ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు మంత్రి కొడాలి నాని.. ఎమ్మెల్యే వంశీ అక్కడ ఉండడమే ఇప్పుడు సరికొత్త చర్చకు తెరలేపుతోంది. వంగవీటి రాధను వైసీపీలో మళ్లీ చేర్చుకునేందుకు కొడాలి నాని ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం ఉంది..
తాజాగా తనపై రెక్కీ నిర్వహించారన్న వంగవీటి రాధా వ్యాఖ్యలపై సీఎం జగన్ విచారణకు ఆదేశించారు. ఈ అంశాన్ని మంత్రి కొడాలి నాని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విచారణ చేసి రిపోర్టు ఇవ్వాలని ఆయన వెంటనే ఇంటెలిజెన్స్ డీజీని ఆదేశించడం చకచక జరిగిపోయాయి. అక్కడితోనే ఆగకుండా రాధాకు వెంటనే 2+2 సెక్యూరిటీ కల్పించాలని ఆదేశించినట్లు చెప్పారు మంత్రి కొడాలి నాని.
వంగవీటి రధ వ్యాఖ్యలు చేయడం.. ఆ వెంటనే అవి సీఎం వరకు చేరడం.. ఆయన అనూహ్యంగా సెక్యూరిటీ ఏర్పాటు చేయడం లాంటి పరిణామాలు చూస్తే.. వంగవీటి రాధను వైసీపీ దగ్గర చేసుకునే ప్లాన్ చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.. ఎందుకంటే ప్రస్తుతం ఏపీలో కాపు నేతలంతా వైసీపీ దూరంగా ఉంటున్నారనే ప్రచారం ఉంది.
ఇదే సమయంలో తాజాగా కాపు కీలక నేతలంతా హైదరాబాద్ (Hyderabad) సమావేశమయ్యారు. కొత్త పార్టీ పెట్టడానికి చర్చలు జరిపారంటూ ప్రచారం ఉన్నా.. టీడీపీ అనుకూల నేతలు ఈ వ్యవహారం నడిపిస్తున్నారనే అనే ప్రచారం కూడా ఉంది. సరిగ్గా నాలుగు రోజుల క్రితం ఈ సమావేశం జరిగింది. అందులో ప్రధాన అజెండా ఏంటంటే.. సీఎం జగన్ పాలనకు వ్యతిరేకంగా కాపు నేతలు ఉన్నారనే సంకేతాలు అందుతున్నాయి. అందుకే ఇదే అదునుగా అటు తెలుగు దేశం, బీజేపీ కూడా పావులు కదుపుతున్నాయి. అందులో భాగంగానే తెలుగుదేశంలోని ఒక ముఖ్యనేత డెరెక్షన్ లో ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కాపులందరు ఒక్కతాటిపైకి వస్తునార్న సంకేతాలు అధికార పార్టీకి ఇవ్వడానికే ఈ సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది.
ఇలా కాపు నేతలంతా ఒక్కటవ్వుతుండడంతో విజయవాడలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాపు వర్గంలో వంగవీటి రాధకు మంచి పట్టు ఉంది.. అందుకే అతడ్ని దగ్గరచేసుకోడానికి వైసీపీ ప్రయత్నం చేస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
మరోవైపు వంగవీటి రాధపై హత్య యత్నానికి సంబంధించి తమకు ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదన్నారు బెజవాడ పోలీసులు. ఎవరెన్ని కుట్రలు చేసినా దేనికీ భయపడనని.. ప్రజల్లోనే ఉంటానని స్పష్టం చేశారు రాధా. వంగవీటి రంగా ఆశయాల సాధనే తన లక్ష్యమన్నారు. అంతేకాదు తనపై రెక్కీ నిర్వహించిన వారి పేర్లు త్వరలోనే బయటకు వస్తాయని చెప్పారు..
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.