Kesineni Nani:
ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ అధికారంలోకి రావాలని టీడీపీ గట్టి పట్టుదలతో కనిపిస్తోంది. ముఖ్యంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే.. కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరుగుతున్నాయి. ఇంత వయసులోనూ యువకుడిలా నియోజకవర్గాలు చుట్టేస్తూ.. కేడర్ కు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు అంతా సిద్ధంగా ఉండండని సూచనలిస్తున్నారు. అయితే చంద్రబాబు అలా పార్టీ కోసం శ్రమిస్తుంటే.. పార్టీలో విబేధాలు కారణంగా ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా బెజవాడలో టీడీపీ పరిస్థితి కాస్త ఇబ్బంది కరంగానే మారింది. ముఖ్యంగా కొత్త ఏడాదిలో బెజవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని కొత్త రాజకీయాన్ని మొదలు పెట్టినప్పటి నుంచీ పార్టీ శ్రేణులు, నేతలు గడగడలాడుతున్నారు. వరుసపెట్టి విజయవాడ టీడీపీ నేతలపై కేశినేని నాని ఘాటైన విమర్శలు చేస్తున్నారు. అక్కడితోనే ఆగడం లేదు పార్టీ పెద్దలకు కూడా చురకలు అంటించారు.
ప్రస్తుతం బెజవాడ టీడీపీలో కేశినేని మాటలు హైలైట్ అవుతున్నాయి. ఇప్పటికే తన మాటలతో చెడుగుడు ఆడేస్తున్నారు నాని. దీంతో బెజవాడ టీడీపీలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. విజయవాడ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేశినేని చేస్తున్న రాజకీయం గురించి చర్చ మొదలైంది. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో నాని వ్యాఖ్యల ప్రభావం పార్టీ మీద ఏస్థాయిలో ఉంటుందో పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు.
ప్రస్తుతం ఆయన దూకుడు చూస్తుంటే.. మరింత ప్రమాదం తప్పలేలా లేదని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఎంపీ నాని తీరు చూస్తుంటే..ఆయన వాక్ ప్రవాహానికి అడ్డుకట్ట పడే సూచనలు అస్సలు కన్పించడం లేదు. దానికి తగ్గట్టే ఇక నుంచి రాజకీయం అంటే ఏంటో చూపిస్తానని అంతర్గత చర్చల్లో ఆయన చెబుతున్నారట. రానున్న రోజుల్లో ఓ రేంజ్‌లో చెలరేగడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారనే సమాచారమే టీడీపీ అధినాయకత్వాన్ని.. బెజవాడలోని పార్టీ లీడర్లను కలవర పెడుతోందట.
కేశినేని నాని తీరును తప్పు పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. పార్టీ పెద్దల ఎదుట తాను చెప్పాలనుకున్నది నిర్మోహటంగా చెప్పే చనువు కేశినేని నానికి ఉంది. తన తమ్ముడు చిన్ని విషయంలో కావచ్చు.. బెజవాడ టీడీపీ నేతల విషయంలో కావచ్చు.. నానికి ఏమైనా అభ్యంతరాలుంటే నేరుగా పార్టీ అధినాయకత్వంతో మాట్లాడకుండా.. ఇలా వ్యవహరించడం ఎంత వరకు కరెక్ట్ అనే చర్చ జరుగుతోంది.
అలాగే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని నాని అంతర్గత సమావేశాల్లో మాట్లాడిన తర్వాతే చిన్ని ఎంటర్ అయ్యారని.. కానీ ఇప్పుడు నాని మాట మారుస్తున్నారని ఆయన వ్యతిరేక వర్గాలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం బెజవాడ రాజకీయాల్లో నాని వ్యతిరేక వర్గం పురుడు పోసుకుందని అంటున్నారు. ప్రస్తుతం నాని ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ఓ రకంగా ఆయన వైఖరే కారణమని అభిప్రాయ పడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, Chandrababu Naidu, Kesineni Nani, TDP