ANDHRA PRADESH POLITICAL NEWS TDP CHEIF NARA CHANDRABABU POLITICAL STRATEGY FOLLOWERS TENSION NGS
Chandrababu: చంద్రబాబు లెక్క తప్పిందా..? చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?
చంద్రబాబు ఫైల్...
Chandrababu: టీడీపీ ప్రస్తుతం దారుణ పరిస్థితి ఎదుర్కొంటోంది. వరుస ఓటములు వెంటాడుతున్నాయి. వీటికి తోడు పార్టీ లీడర్ల వ్యవహారం తలనొప్పిగా మారింది. అయినా చంద్రబాబు ఎక్కడికక్కడ లెక్కలు వేసుకుంటూ.. పార్టీకి పునర్వైభవం తెచ్చే ప్రయత్నం చేశారు.. అయితే ఈ క్రమంలో చేసిన తప్పులే మళ్లీ మళ్లీ చేస్తున్నారని తెలుగు తమ్ముళ్ల ఆవేదన చెందుతున్నారు.
Chandrababu: అధికారంలో ఉండి.. 2019 ఎన్నికల్లో టీడీపీ (TDP) ఘోర ఓటమికి ప్రధాన కారణం సామాజిక సమీకరణాల పరంగా అధిష్టానం చేసిన కొన్ని తప్పులే. గత ఎన్నికల్లో టీడీపీ సామాజిక సమీకరణాల పరంగా కొన్ని తప్పిదాలకు పాల్పడిందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు పార్టీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న బీసీలను కాదని.. కాపు సామాజికవర్గం వైపు మొగ్గు చూపింది. ఫలితంగా బీసీ ఓటు బ్యాంకు దూరమైంది. ఆ తర్వాత ప్రతిపక్షంలో వచ్చాక.. తిరిగి బీసీ ఓట్లు పార్టీ వచ్చేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని భావించారు. కానీ పార్టీ ఆ ట్రాక్ నుంచి పక్కకు వెళ్తోందనే చర్చ జరుగుతోంది. సామాజిక సమీకరణాల విషయంలో తిరిగి పాత బాటలోనే పయనిస్తున్నారనే అనుమానం తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే పార్టీకి మరోసారి నష్టం తప్పదని.. ఇప్పటికైనా అధిష్టానం మేల్కొనాలి అని తెలుగు తమ్ములు అభిప్రాయపడుతున్నారు.
గడచిన ఎన్నికల్లో టీడీపీ నుంచి వచ్చిన బీసీ ఓటు బ్యాంకును పదిలం చేసుకునే దిశగా వైసీపీ (YCP) పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టింది. స్థానిక సంస్థల్లోని పదవులు.. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు అగ్రపీఠం వేస్తూ ఆ వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రతి సందర్భంలోనూ సీఎం జగన్ (CM Jagan) బీసీలను దగ్గర చేసుకునే దిశగా హామీలు ఇస్తున్నారు. ఈ రాజకీయ వ్యూహాన్ని గట్టిగా ఎదుర్కొనేలా బీసీలను ఆకట్టుకునేలా టీడీపీ కార్యాచరణ చేపట్టిందా అంటే లేదనే సమాధానమే కన్పిస్తోంది. ఎన్నికలు దగ్గర పడేకొద్దీ కాపులకు మళ్లీ ఎక్కువ ప్రాధాన్యమిచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా ఉంది.
టీడీపీ పెద్దల నిర్ణయంపై కేడర్‌లో టెన్షన్..?
ఇదే సందర్భంలో టీడీపీలో మరో చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తామని చాలామంది ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. స్వయంగా నారా లోకేష్ దీనిపై హింటిచ్చారు. మంగళగిరిలో జనసేన కార్యాలయానికి వెళ్లి మరి ఆయన అక్కడి నేతలతో ముచ్చట్లు పెట్టారు. దాదాపు సీనియర్లంతా జనసేనతో పొత్తు ఉంటుందనే సంకేతాలు ఇస్తున్నారు. ఈ వైఖరిపై పార్టీలోని బీసీ సామాజికవర్గ నేతలు ఆందోళన చెందుతున్నారట. గడచిన ఎన్నికల్లో కాపులకు రిజర్వేషన్లను ఇవ్వలేమని చెప్పడం ద్వారా బీసీ ఓట్లను వైసీపీ పొలరైజ్ చేసుకుందని.. ఆ అంశం అప్పట్లో టీడీపీకి నష్టం చేకూర్చిందని ఓటమి విశ్లేషనలో తేలింది అంటున్నారు టీడీపీ నేతలు కొందరు. మళ్లీ వచ్చే ఎన్నికల నాటికి కూడా కాపు సామాజికవర్గం ముద్ర వేయించుకున్న జనసేనతో పొత్తు ఉంటే.. వైసీపీ మళ్లీ కాపు.. బీసీ ఫార్మూలాను తెరపైకి తెస్తుందని అనుమానిస్తున్నారట. అదే జరిగితే టీడీపీ సంగతి ఏంటనే టెన్షన్ టీడీపీ శ్రేణుల్లో ఉందట.
బలమైన రాజకీయ వ్యూహాలు లేవా?
గతంలో చేసిన పొరపాట్లు రిపీట్ కాకుండా పార్టీలు జాగ్రత్తపడతాయి. గుణపాఠాలు నేర్చుకుని.. అలాంటి అంశాలపై టచ్‌మీ నాట్‌గా ఉంటాయి. కానీ.. పార్టీ అధిష్టానం మాత్రం చేసిన తప్పునే మళ్లీ మళ్లీ చేస్తోందని మదన పడుతున్నారు. 2019 తర్వాత ఏపీలో టీడీపీ పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు ఉంది. ఈ కష్టం నుంచి గట్టెక్కాలంటే బలమైన రాజకీయ వ్యూహాలు కావాలి. కానీ.. పాత చింతకాయ పచ్చడినే పట్టుకుని వేళ్లాడితే ఉపయోగం ఏంటన్నది కొందరి ప్రశ్న. మరి.. అధినాయకత్వం ఈ అంశాన్ని గమనించిందో లేదో.. కేడర్ మాత్రం భవిష్యత్‌ను తలచుకుని హడలిపోతోందట.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.