ANDHRA PRADESH POLITICAL NEWS GRATER VISAKHAPATNM MAYOR JUST ACTING EVERTHING LOOK SAHADOW MAYOR NGS VSP
Shadow Mayor: మహానగరానికి మేయర్ ఆమె.. కానీ పెత్తనం ఎవరిదో తెలుసా..?
షాడో మేయర్
GVMC Shadow Mayor: కాబోయే పరిపాలన రాజధాని.. అలాంటి మహానగరానికి తొలి మేయర్ మహిళ అని అంతా గొప్పగా ప్రచారం చేసుకున్నారు. కానీ ఇప్పుడు కేవలం పేరుకే మేయర్ గా మిగిలిపోతున్నారా... పాలనలో చక్రం తిప్పే వ్యక్తి వేరే ఉన్నారా..? ప్రస్తుతం విశాఖ నగరంలో ఇదే హాట్ టాపిక్ అవుతోంది.
Shadow Mayor in Visakhapatnam: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కు తొలి మహిళ మేయర్ అంటూ అంతా గొప్పగా చెప్పుకున్నారు. కానీ పేరుకే ఆమె మేయర్.. పెత్తమంతా వేరే వ్యక్తిది అన్నట్టు పరిస్థితి మారింది. ఆయన కనీసం కార్పొరేటర్ కూడా కాదు. అయినా ప్రతిరోజూ మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ)కు వస్తారు. మేయర్ ఉన్నా... లేకపోయినా, ఆమె ఛాంబర్లో కూర్చుని అధికారులతో సమీక్షలు నిర్వహిస్తుంటారు. ఏ పని ఎలా చేయాలో ఆదేశిస్తారు. స్టాండింగ్ కమిటీతోపాటు కౌన్సిల్ అజెండాలో ఏఏ అంశాలను పెట్టాలో అధికారులకు నిర్దేశిస్తారు. పేరుకు మేయర్ గొలగాని హరివెంకటకుమారి అయినప్పటికీ చక్రం తిప్పేది మాత్రం ఆమె భర్త శ్రీనివాసరావే.
గత కమిషనర్ సృజన హయాంలో ఆయన ఆటలు సాగలేదు. ఆమె బదిలీ అయి కొత్త కమిషనర్ వచ్చిన తర్వాత చక్రం తిప్పడం మొదలెట్టారు. సోమవారం కమిషనర్ స్పందన కార్యక్రమంలో వుండగా ఆయన మాత్రం మేయర్ ఛాంబర్లో టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ప్రస్తుతం పరిస్థితిపై విపక్షాలు సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జీవీఎంసీలో ప్రస్తుతం ‘షాడో మేయర్’ హవా నడుస్తోందన్నది బహిరంగ రహస్యమే అయ్యింది. మేయర్ హరివెంకటకుమారి తన చాంబర్లోనే ఉన్నా... సందర్శకులు, అధికారులు, కార్పొరేటర్లు అంతా షాడో మేయర్‌తోనే మాట్లాడాల్సి ఉంటుంది. తమ వినతులను కూడా ఆయనకే అందజేయాల్సి ఉంటుంది. మేయర్ ఏదైనా కారణం చేత జీవీఎంసీకి రాలేకపోయినా షాడో మేయర్ మాత్రం ప్రతిరోజూ ఆమె ఛాంబర్లో కూర్చుని పాలనా వ్యవహారాలను చక్కబెడుతుంటారు. అయినా దీనిపై అధికారులు స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గత కమిషనర్ సృజన హయాంలో చక్రం తిప్పేందుకు యత్నించగా ఆమె చాకచక్యంగా చెక్‌పెట్టారు. మేయర్ నేరుగా ఆదేశిస్తేనే ఏదైనా ఫైల్‌ను పరిశీలించేవారు. కానీ ఆమె బదిలీపై వెళ్లిపోవడం, కొత్త కమిషనర్ బాధ్యతలు చేపట్టడంతో షాడో మేయర్ మళ్లీ చక్రం తిప్పడం మొదలెట్టారు. పలు విభాగాలకు చెందిన అధికారులను ఛాంబర్‌కు పిలిపించుకుని సమీక్షలు చేస్తూ ఆదేశాలు ఇస్తున్నారు. అలాగే స్టాండింగ్ కమిటీ, జీవీఎంసీ సాధారణ కౌన్సిల్ సమావేశాలకు అజెండా రూపకల్పనలో కూడా అంతా తానై వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
కమిషనర్ డాక్టర్ లక్ష్మీషా ఒక్కరే గ్రీవెన్స్‌లో పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. అదే సమయంలో షాడో మేయర్ మాత్రం మేయర్ ఛాంబర్లో స్టాండింగ్ కమిటీ సభ్యులతో భేటీ అయ్యారు. ఈ నెల 23న జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశానికి అజెండా రూపకల్పనపై చర్చించారు. గత రెండేళ్లలో మెకానికల్ విభాగానికి సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లింపు, లీజు చెల్లించలేదనే కారణంతో సీజ్ చేసిన దుకాణాల్లో కొన్నింటిని తెరుచుకునేందుకు అనుమతించడంతోపాటు 51 అంశాలతో అజెండా తయారుచేస్తున్నట్టు కమిటీ సభ్యులకు షాడో మేయర్ వివరించినట్టు సమాచారం.
టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, ఇంజనీరింగ్ అధికారులను మేయర్ ఛాంబర్‌కు రావాలని షాడో మేయర్ ఆదేశించారు. అందరూ గ్రీవెన్స్‌లో కమిషనర్‌తోపాటు ఉన్నామని చెప్పినప్పటికీ... ఆయా విభాగాల్లో అందుబాటులో వున్న అధికారులను పంపించాలని ఆదేశించినట్టు అధికారులు పేర్కొంటున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితిలో తమ కింది స్థాయి అధికారులను మేయర్ ఛాంబర్‌కు పంపించినట్టు విభాగాల అధిపతులు వాపోతున్నారు.
గత కమిషనర్ హయాంలో ఇలాంటి పరిస్థితి ఎదురవ్వలేదని, ఇప్పుడు కమిషనర్ చూసినా పట్టించుకోనందునే తమకెందుకు వచ్చిన తలనొప్పి అనే భావనతో తాము కాకుండా కిందిస్థాయి అధికారులను పంపిస్తున్నామని చెబుతున్నారు. ఒకవేళ షాడో మేయర్ ఇచ్చిన ఆదేశాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నప్పుడు...ఆ విషయం చెబితే, సీఎం జగన్, రాజ్యసభసభ్యుడు విజయసాయిరెడ్డి పేర్లు ప్రస్తావిస్తున్నారని, దాంతో తాము ఏమీ చేయలేకపోతున్నామని వాపోతున్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.