Ashok Gajapathi Raju: ఆ కారును ఇష్టపడి తెచ్చుకున్నారు. ఇష్టపడి అనడం కంటే పోరాడి మరీ తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు ఆ కారు ఎక్కాలి అంటేనే ఆయన భయపడుతున్నారు. కారును చూసి అంతలా భయపడుతున్నారు ఏంటి అనుకుంటున్నారా..?
AshokGajapathi Raju: కేంద్ర మాజీ మంత్రి, మాన్సాస్, సింహాచలం దేవస్ధానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అశోక్ గజపతిరాజుకు, వైసీపీ ప్రభుత్వం మధ్య నిత్యం ఏదో ఒక అంశంపై వివాదం రగులుతూనే ఉంది. హైకోర్టు ఆదేశాల ద్వారా అనువంశిక ధర్మకర్తగా తిరిగి బాధ్యతలు స్వీకరించిన అశోక్ గజపతిరాజుకు కేటాయించిన వాహనం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. వాహనాన్ని కేటాయించాలని లేఖ రాసిన మొదట్లో స్పందన రాకపోగా.. అశోక్ గజపతికి, సింహాచలం ఈవోకు ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచిన సుమారు 40 రోజులకు కేటాయించిన కారు అశోక్ గజపతి రాజు బంగ్లాకు చేరింది. ఇదంతా జరిగి దాదాపు 4 నెలలు దాటినా ఆ కారు ఇంకా చెట్ల కిందే ఓ మూలన పడి ఉంది. ఆఖరికి అశోకగజపతిరాజు సింహాచలం వచ్చినా.. మాన్సాస్ పనులపై వెళ్లినా వ్యక్తిగత వాహనాలనే ఉపయోగిస్తున్నారు. తనకు కేటాయించిన వాహనంలో తిరిగడం లేదు. మరి అంతలా పోరాడి తెచ్తేచుకున్న కారును ఆయన ఎందుకు వాడడం లేదు.. ఎందుకు మూలన పడేశారు.. కారణం ఏంటి..?
ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ అధికారంలొకి రాగానే.. మాన్సాస్, సింహాచలం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్, కేంద్ర మాజీ మంత్రి అయిన అశోక్ గజపతిరాజుకు కష్టాలు మొదలయ్యాయి. మొదట మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్దానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా తొలగించింది. ఆయనకున్న అధికారాలను కట్ చేసింది. దీంతో హైకోర్టును ఆశ్రయించిన అశోక్ గజపతిరాజు.. ప్రభుత్వంపై విజయం సాధించారు. ప్రభుత్వ నిర్ణయాలను కొట్టేస్తూ.. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో అనువంశిక ధర్మకర్తగా తిరిగి బాధ్యతలు స్వీకరించారు.
తరువాత అశోక్ గజపతి రాజుకు మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం ఆలయం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా పున: బాధ్యతలు స్వీకరించారు. కానీ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా ఆయన దక్కాల్సిన అధికారాలు, సదుపాయాల విషయంలో ప్రభుత్వం తోనూ, అధికారులతో నిత్యం ఫైట్ చేయాల్సి వస్తోంది. సింహాచలం దేవస్దానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత.. మొదట్లో ఆయన సొంత వాహనంలోనే అన్ని కార్యక్రమాలకు, దేవాలయ సందర్శనలకు వెళ్లేవారు. ట్రస్ట్ బోర్ట్ చైర్మన్ గా తన కోసం కేటాయించాల్సిన అధికారిక వాహనాన్ని ఆలయ అధికారులు కేటాయించలేదు. దీంతో కొద్ది రోజుల తర్వాత ..తను తిరిగి ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టినందున తనకు వాహనాన్ని కేటాయించాలని ఆలయ ఈవోకు లేఖ రాశారు. మొదట్లో పెద్దగా స్పందన రాకపోగా.. ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచిన సుమారు 40 రోజులకు AP31 EP 1701 నెంబర్ కలిగిన ఇన్నోవా కారు అశోక్ గజపతి రాజు బంగ్లాకు చేరింది.
ఆ కారు అశోక్ బంగ్లాకు చేరి దాదాపు 4 నెలలు దాటినా ఆ కారు ఆయన బంగ్లాలోని చెట్ల కిందే ఓ మూలన ఉంచేసారు. ఇప్పటికీ సింహాచలం వెళ్లాలన్నా.. మాన్సాస్ పనులపై వెళ్లినా వ్యక్తిగత వాహనాలనే ఉపయోగిస్తున్నారు. దీనివెనక బలమైన కారణం ఉంది. మొదట్లో సింహాచలం దేవస్థానం సమకూర్చిన ఇన్నోవాపై ఎటువంటి నేమ్ బోర్డు లేకుండా బంగ్లాకు వచ్చింది. దీంతో.. అశోక్ గజపతిరాజు, ఈవోల మధ్య వివాదం మొదలైంది. అది ఛైర్మన్ కారుగా గుర్తించడంతో పాటు ఈ వాహనం సింహాచలం దేవస్థానానికి చెందినదిగా కారుపై ఉండాలి. గతంలో ఛైర్మన్లుగా వ్యవహరించిన అందరికీ ఈ పద్ధతి పాటించారు. ఇప్పుడు తన దగ్గరకు వచ్చేసరికి గత సంప్రదాయాలు ఎందుకు పాటించడంలేదని ఈవోను నిలదీస్తూ ఈవోకు ఉత్తరాలు రాసారు అశోక్.
దీంతో "ప్రభుత్వ వాహనం" అనే స్టిక్కర్ అతికించి పంపించారు. దీంతో అశోక్ గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వ వాహనం అని రాయడం ఏంటంటూ ఈవోకు మరో లేఖ కూడా రాసారు. ఇక అధికారిక వాహనానికి సంబంధించిన గత చైర్మన్ సంచయితకు 75వేల రూపాయలు రవాణా ఖర్చుల కోసం కేటాయించగా.. తనకెందుకు కేటాయించడం లేదన్నది మరో ఆరోపణ.
ప్రభుత్వ వాహనంలో అధికారికంగా ప్రయాణించే అవకాశం .. అధికారిక హోదా ఉన్నవారికి తప్ప మిగిలిన వారికి ఉండదు. సింహాచలం దేవస్థానం ఆస్తి అంటే నేరుగా ప్రభుత్వానికి చెందినది కాదు. సర్కార్ నియంత్రణలో ఉన్న దేవస్థానానికి సంబంధించినది. ప్రస్తుతం అశోక్ వర్సెస్ ప్రభుత్వం అని వాతావరణం హాట్‌హాట్‌గా ఉంది. ఈ తరుణంలో ప్రభుత్వ వాహనం అనే బోర్డు పెట్టుకుని రోడ్డెక్కితే.. దానినీ ఓ కారణంగా చూపించి రచ్చ చేస్తారు, కేసులు పెడతారనే అనుమానం అశోక్ గజపతి రాజు లో ఉంది. దీంతో కోరి తెప్పించుకున్న కారును కూడా వాడకుండా అలానే వుంచేసారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.