Andhra Pradesh: రేపట్నుంచి రేషన్ షాపులు బంద్ -డీలర్ల సంఘం కీలక ప్రకటన

ఏపీలో రేషన్ షాపులు బంద్

సంక్షేమ పథకాల చిరునామా ఆంధ్రప్రదేశ్ లో రేషన్ షాపులు దాదాపుగా మూతపడనున్నాయి. మంగళవారం నుంచి తలపెట్టిన బంద్ ను డీలర్ల సంఘం ఉపసంహరించుకున్నప్పటికీ, దుకాణాల్లో సరుకుల దిగుమతి, పంపిణీని నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పరోక్షంగానైనా సేవలు నిలిచిపోనున్నాయి..

  • Share this:
ఆంధ్రప్రదేశ్ లో రేషన్ దుకాణాలకు సంబంధించి గందరగోళం కొనసాగుతున్నది. పలు అంశాల్లో జగన్ సర్కారు తీరుకు నిరసనగా మంగళవారం నుంచి దుకాణాలన్నీ మూసేస్తామని రేషన్ డీలర్లు ప్రకటించారు. అయితే, గంటల వ్యవధిలోనే వారు బంద్ పిలుపును ఉపసంహరించుకున్నారు. కానీ దుకాణాలు తెరిచినప్పటికీ, మంగళవారం నుంచి సరుకుల దిగుమతులు, పంపిణీని నిలిపేస్తామని డీలర్లు ట్విస్టిచ్చారు. తద్వారా అప్రకటిత రేషన్ దుకాణాల బంద్ ఖరారైనట్లయింది.

తొలుత దుకాణాలు అన్నిటినీ బంద్ చేస్తామన్న రేషన్ డీలర్ల సంఘం.. ఆ తర్వాత సవరించుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించింది. సమస్యలు పరిష్కరించే వరకు ఆంధ్రప్రదేశ్ లో మంగళవారం నుంచి రేషన్ దిగుమతి, పంపిణీని నిలిపేస్తున్నట్లు రేషన్ డీలర్ల సంఘం ప్రకటించింది. 2020 ఏడాదికిగానూ ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన(పీఎంజీకేవై) కమిషన్ బకాయిలు తక్షణమే చెల్లించాలని రేషన్ డీలర్ల సంఘం డిమాండ్ చేసింది.

డీడీ నగదు వాపసు, ధరల వ్యత్యాస సర్క్యులర్లను అమలు చేయాలని, డీలర్ల నుంచి ఐసీడీఎస్ కు మళ్లించిన కందిపప్పుకు సంబంధించిన బకాయిలు చెల్లించాలని, 2020 మార్చి 29 నుంచి ఇప్పటిదాకా ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్ నుంచి డీలర్లకు రావాల్సిన కమిషన్ బకాయిలు చెల్లించాలని సంఘం నేతలు డిమాండ్ చేశారు. అలాగే, గోనె సంచులను తిరిగి ప్రభుత్వానికిస్తే రూ.20 చెల్లించాలనే జీవోను అమలు చేయాల్సిందేనని డీలర్లు పట్టుపడుతున్నారు. పక్క రాష్ట్రం తెలంగాణలో అది పక్కాగా అమలవుతోందని గుర్తుచేశారు.

తమ న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించేదాకా నిరసనలు కొనసాగిస్తామన్న రేషన్ డీలర్లు.. ప్రస్తుతానికి బంద్ వాయిదా వేసినప్పటికీ, దుకాణాల్లో సరుకుల దిగుమతి, పంపిణీనిని నిలిపేస్తున్నామని, అయినాకూడా ప్రభుత్వం దిగిరాకపోతే సంపూర్ణ బంద్‌ కు దిగుతామని స్పష్టం చేశారు.
Published by:Madhu Kota
First published: