ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లాలోని రామతీర్థం కోదండ రామాలయంలో జరిగిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసింది. ఓ వైపు శ్రీరాముడు విగ్రహ ధ్వంసంపై దర్యాప్తు చేయిస్తున్న ప్రభుత్వం.., మరోవైపు ఆలయంలో నూతన విగ్రహాల ప్రతిష్టకు ఏర్పాట్లు చేస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నూతన విగ్రహాలను తయారు చేయించారు. విగ్రహాల రూపకల్పన పూర్తి కావడంతో దేవాదేశ శాఖ ఆర్జేసీ భ్రమరాంబతో పాటు మరికొందరు అధికారులు తిరుపతి వెళ్లి ప్రత్యేక ఎస్కార్ట్ వాహనంలో సీతారామలక్ష్మణస్వామి విగ్రహాలను రామతీర్థానికి తీసుకువచ్చారు. అనంతతరం స్వామివారి విగ్రహాలను రామతీర్థంలో తిరు వీథి గావించి ఆలయం వద్దకు తీసుకొచ్చారు. నూతన విగ్రహాలకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఉన్న ప్రత్యేక గదిలో భద్రపరిచారు. ఈ నెల 28న బాలాలయంలో శాస్త్రోక్తంగా విగ్రహాలను ప్రతిష్టిస్తామని అధికారులు తెలిపారు. ఆలయ అభివృద్ధి పనులు పూర్తైన వెంటనే ప్రధాన ఆలయంలో ప్రతిష్ట జరగనుంది.
ధ్వసమైన విగ్రహాల తొలగింపు
ఈనెల 21న దేవాదాయశాఖ ధ్వంసమైన విగ్రహాలను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టింది. టీటీడీ నుంచి వచ్చిన ఆగమ శాస్త్ర పండితులు ప్రాయశ్చిత్త హోమాలు కూడా నిర్వహించారు. అనంతరం గోమాతకు తాడుకట్టి.., ఆ తాడు సాయంతో విగ్రహాలను వాటి స్థానాల్లో నుంచి కదిలించారు. కోదండరాముడితో పాటు సీతాదేవి, లక్ష్మణుడి విగ్రహాలను కూడా జరిపారు. శాస్త్రోక్తంగా పక్కకు జరిపిన విగ్రహాలను పండితులు పటిష్ట భద్రత మధ్య కొండ దిగువన ఉన్న ప్రధాన ఆలయానికి తరలించారు. విగ్రహాల తరలింపు ప్రక్రియను అధికారులు అత్యంత గోప్యంగా ఉంచారు. దేవాదాయశాఖ నుంచి వచ్చే ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని రామతీర్థం ఆలయ అధికారులు తెలిపారు.
రూ.3 కోట్లతో రామతీర్థం అభివృద్ధి
ఇక రామతీర్థం దేవాలయాన్ని రూ.3 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. పండితుల సలహాలు, వైఖాసన ఆగమ సంప్రదాయం ప్రకారం ఆలయ అభివృద్ది, పునః నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వివరించారు. పునః నిర్మాణ పనులు ఏడాదిలో పూర్తి చేయాలని అధికారులను అదేశించారు. 700 అడుగు ఎత్తులో ఉన్న ఆలయ నిర్మాణం పూర్తి రాతి కట్టడాలతో చేపడతామన్నారు. అలాగే మొట్ల మార్గం సరిచేయడం పాటుగా కొత్త మొట్లు నిర్మించనున్నట్లు తెలిపారు. దేవాలయ పరిసరాల ప్రాంతం మొత్తం విద్యుత్ దీపాలంకరణ, శాశ్వత నీటి వసతి, కోనేటిని శుభ్రపర్చటం, కోనేటి చుట్టూ గ్రిల్స్ ఏర్పాటు, ప్రాకార నిర్మాణం, హోమశాల, నివేదన శాల నిర్మాణం కూడా పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
కాగా డిసెంబర్ 28న అర్ధరాత్రి సమయంలో రామతీర్థం కొండపైన ఉన్న ఆలయంపై దాడి చేసిన దుండగులు కోదండరాముడి విగ్రహ శిరస్సు భాగాన్ని తొలగించడం సంచలనం రేపింది. హాక్సా బ్లేడుతో విగ్రహాన్ని ధ్వంసం చేసి శిరస్సు భాగాన్ని ఆలయం పక్కనే ఉన్న రామకొలనులో పడేశారు. ఆలయంపై దాడికి నిరసనగా రాజకీయ పార్టీలు నీలాచలం కొండవద్ద ఆందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ సీఎం చంద్రబాబు, వైసీపీ ఎంపీ విజసాయి రెడ్డి ఒకేరోజు ఆలయాన్ని సందర్శించడంతో వాతావరణం వేడెక్కింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఘటనపై సీఐడీ విచారణకు ఆదేశించగా.. పోలీసులు ఇప్పటివరకు 21 మంది అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అలాగే విగ్రహ ధ్వంసానికి వినియోగించిన రంపాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అనుమానితులనైతే అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇంతవరకు అసలు నిందితులను పట్టుకోలేదు.