Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH NEW DISTRICTS PROTESTS FOR SOME AREAS LOCAL YCP LEADERS ALSO AGAINST NEW DISTRICTS NGS

AP New Districts: కొత్త జిల్లాలపై మొదలైన అసంతృప్తి.. కొందరు వైసీపీ నేతల అభ్యంతరం..? ఎక్కడ..? వివాదం ఏంటి..?

కొత్త జిల్లాలపై వివాదం

కొత్త జిల్లాలపై వివాదం

AP New Districts: ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు కసరత్తు పూర్తైంది.. ఉగాది నాటికి ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం కానుందని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పటికే జిల్లాల విభజనపై అసంతృప్తి జ్వాలలు మొదలయ్యాయి.. ముఖ్యంగా అధికార పార్టీ నేతలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు..

ఇంకా చదవండి ...
  AP New District:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం విడుదల చేసిన కొత్త జిల్లాల నోటిఫికేషన్ (AP New Districts) పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలతో పాటు రాజకీయ పార్టీలు కూడా దీనిపై స్పందిస్తున్నాయి.  ప్రధాన ప్రతిపక్షం టీడీపీ (TDP),  ఇతర విపక్షాలు జనసేన (Janasena), బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress ) లాంటి పార్టీల నుంచి ఎక్కడా వ్యతిరేకత పెద్దగా వినిపించలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తే.. టీడీపీ అధినేత  చంద్రబాబు నాయుడు కానీ, టీడీపీ కీలక నేతలు కాని.. ఇటు జనసేన అధినేత, ఇతర పార్టీ కీలక నేతలు కూడా స్పందించలేదు.  కొన్ని ప్రాంతాల్లో కొత్త ఆకాంక్షలు, డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. స్థానిక వైసీపీ నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమానికి సిద్ధమవుతుండగా, కొందరు వివిధ మార్గాల్లో నిరసన తెలియజేస్తున్నారు. కొన్ని రెవెన్యూ డివిజన్ల రద్దుపైనా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

  జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఒక జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉన్న తమను... మరో జిల్లా పరిధిలోకి తీసుకురావడంపై కొన్నిచోట్ల స్థానికుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్త జిల్లాల కోసం ఎప్పటి నుంచో ఉన్న కొన్ని డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోలేదన్న అసంతృప్తి కొందరి నుంచి వ్యక్తమవుతోంది.  నంద్యాల లోక్‌సభ స్థానం పరిధిలోని పాణ్యం శాసనసభ స్థానాన్ని కర్నూలు జిల్లాలో కలపడాన్ని పాణ్యం, గడివేముల మండలాల్లో ఉన్న స్థానికులు, రాజకీయ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జిల్లా విభజన జరిగితే కల్లూరు, ఓర్వకల్లు మండలాల్ని కర్నూలు జిల్లాలో కలపాలని కల్లూరు పరిరక్షణ సమితి ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తోంది. ప్రభుత్వ నిర్ణయంతో వారి ఆకాంక్ష నెరవేరినట్టయింది. కానీ పాణ్యం, గడివేముల మండలాల వారికి ఇబ్బందిగా మారింది. నంద్యాలకు 5 నుంచి15 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమను కర్నూలు జిల్లాలో కలపడమేంటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  ఇదీ చదవండి : వివాదంలో ఉపాసన కొణిదెల.. ఆమె పోస్టు పై నెటిజన్లు ఆగ్రహం.. ఏం జరిగిందంటే?

  వైసీపీ నేత అసంతృప్తి
  లోక్‌సభ నియోజకవర్గ కేంద్రం రాజంపేటను జిల్లా కేంద్రం చేయకపోవడంపై రాజంపేట మునిసిపల్‌ వైస్‌ఛైర్మన్‌ మర్రి రవి సీఎం జగన్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ప్రభుత్వ నిర్ణయం మార్చుకోకపోతే రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో వైసీపీ ఓడిపోతుందన్నారు. కావాలంటే రాయచోటిని, మదనపల్లెని కలిపి వేరే జిల్లాగా చేసుకోవాలన్నారు. ప్రభుత్వ నిర్ణయం మార్చుకోకపోతే తాను పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. తమను ఉంచితే కడప జిల్లాలో ఉంచాలని, లేకపోతే రాజంపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ రాజంపేట మండలం కొత్తబోయినపల్లెలో 108 అడుగుల అన్నమయ్య విగ్రహం దగ్గర టీడీపీ నేతలు బ్లాక్ బ్యాడ్జులు పెట్టుకుని నిరసన తెలిపారు.

  ఇదీ చదవండి : ప్రమేయం లేకుండానే కదులుతున్న కాళ్లూ చేతులు.. ఆహారాన్ని బయటకు నెడుతున్న నాలుక.. కారణం అదే..?

  ప్రకాశం జిల్లా కందుకూరు రెవెన్యూ డివిజన్‌ని రద్దు చేయడం, కందుకూరు శాసనసభ స్థానాన్ని నెల్లూరు జిల్లాలో చేర్చడంపై ప్రజాసంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. కందుకూరు ఒంగోలుకి 44 కిలోమీటర్ల దూరంలో ఉంది. నెల్లూరు వెళ్లాలంటే కనీసం వందకు పైగా కిలోమీటర్లు ప్రయాణించాలి. అలాగే మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటుచేయాలని ప్రకాశం జిల్లా పశ్చిమప్రాంత ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు కనిగిరి కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. బాపట్ల, చీరాల రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుచేస్తున్నారు. ఈ రెండు పట్టణాల మధ్య దూరం 17 కిలోమీటర్లే. వాటి పరిధిలోని మండలాలకు, జిల్లా కేంద్రాలకు మధ్య చాలా దూరం ఉందని స్థానికులు అంటున్నారు. గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గాన్ని గురజాల రెవెన్యూ డివిజన్‌లో కలపడంపైనా రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల్ని కలిపి ప్రత్యేక రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటుచేయాలని.. లేకపోతే పెదకూరపాడును గుంటూరు రెవెన్యూ డివిజన్‌లోనే ఉంచాలని డిమాండ్‌ చేస్తున్నారు.

  ఇదీ చదవండి :భక్తులకు గుడ్ న్యూస్.. ఫిబ్రవరి టికెట్ల విడుదల.. ఇలా బుక్ చేసుకోండి

  విజయవాడ దగ్గర్లోనివి మచిలీపట్నం జిల్లాలోకా?
  విజయవాడకు దగ్గర్లోని పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాలను మచిలీపట్నం కేంద్రంగా ఉన్న కృష్ణాజిల్లాలో చేర్చడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండింటినీ ఎన్టీఆర్‌ జిల్లాలో చేర్చాలని డిమాండ్లు వస్తున్నాయి. ఇక శ్రీకాకుళం జిల్లాను అశాస్త్రీయంగా విభజించారని జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్ష కార్యదర్శులు నల్లి ధర్మారావు, సనపల నర్సింహులు ధ్వజమెత్తారు. శ్రీకాకుళం, పాలకొండ, పలాస కేంద్రాలుగా మూడు జిల్లాలు ఏర్పాటుచేయాలని డిమాండు చేశారు.

  ఇదీ చదవండి : బుడితి విగ్రహాలు ఎందుకంత ఫేమస్.. ప్రత్యేకతలు ఏంటో తెలుసా..? పూర్వ వైభవం వచ్చేనా..?

  ఇటు మంత్రి బొత్స నియోజకవర్గం చీపురుపల్లి రెవెన్యూడివిజన్‌ ఏర్పాటుచేయాలని విజయనగరం లోక్‌సభ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున డిమాండ్‌ చేశారు. అలాగే అరకు లోక్‌సభ స్థానం చాలా పెద్దదైనందున మూడు జిల్లాలుగా చేయాలని ఏపీ ఆదివాసీ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ విశాఖ జిల్లా కన్వీనర్‌ రామారావు దొర డిమాండ్‌ చేశారు. విలీన మండలాల్ని కలిపి, తూర్పుగోదావరి ఏజెన్సీని రంపచోడవరం జిల్లాగా, విశాఖ ఏజెన్సీని పాడేరు జిల్లాగా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్ని కలిపి మరో జిల్లాగా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.. 30 రోజుల పాటు అభ్యంతరాల స్వీకరణకు ప్రభుత్వం సమయం ఇచ్చింది. దీంతో ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందో లేదో చూడాలి..

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Ycp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు