ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాలో వింత వ్యాధి కలకలం సృష్టిస్తోంది. 45 రోజుల క్రితం ఏలూరులో వందలాది మందిని ఆస్పత్రి పాలుచేసిన వింత వ్యాధి ఇప్పుడు జిల్లాలోని మిగిలిన ప్రాంతాలకు వ్యాపిస్తోంది. తాజాగా భీమడోలు మండలం, పూళ్ల, పరిసర గ్రామాల ప్రజలను వణికిస్తోంది. క్రమంగా బాధితుల సంఖ్య పెరుగుతోంది. తొలుత ఏడుగురు అస్వస్థతకు గురికాగా.., రెండు రోజుల్లో ఆ సంఖ్య 31కి చేరింది. ఫిట్స్, వాంతులు, నీరసంతో జనం కళ్లుతిరిగి పడిపోతున్నారు. కొంతమందిలో డయేరియా లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈనెల 16న అస్వస్థతతో ఇద్దరు పూళ్ల ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చారు. ఆ తర్వాతి రోజు 14 మంది ఆస్పత్రిలో చేరగా.., మంగళవారం మరో 10 మంది మంది ఆస్పత్రికి రావడంతో కలకలం రేగింది.
తాజాగా మరో ఐదుగురు ఆస్పత్రి పాలయ్యారు. వీరిలో 22 పరిస్థితి మెరుగుపడటంతో డిశ్చార్జ్ చేశారు. మిగిలిన వారు పూళ్ల ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో ఇద్దరికి మూర్చరావడంతో నురగలు కక్కి పడిపోయారు. వీరిలో ఒకరికి తలకు గాయం కూడా అవడంతో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మిగిలిన వారు ఇంకా తలనొప్పి, కాళ్లనొప్పులతో బాధపడుతున్నారు. డిశ్చార్జ్ అయిన వారిలో ఇద్దరు వ్యక్తులు మూడుసార్లు మూర్చవచ్చి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
అధికారులు అప్రమత్తం
ఏలూరులో వ్యాపించిన అంతుచిక్కని వ్యాధి తరహాలోనే పూళ్ల బాధితుల్లో లక్షణాలుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఐదు ప్రత్యేక వైద్య బృందాలతో గ్రామంలో ఐదు హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ఒక డాక్టర్, ఏఎన్ఎం, ముగ్గురు ఆశాకార్యకర్తలను నియమించారు. అలాగే బాధితులకు మెరుగైన వైద్యమందించేందుకు జిల్లా ఆస్పత్రి నుంచి ఐదుగురు స్పెషలిస్ట్ డాక్టర్లు, ఐదుగు పీహెచ్ సీ డాక్టర్లను అందుబాటులో ఉంచారు. అలాగే మరో 12 మంది డాక్టర్లు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. అలాగే పూళ్ల PHC, భీమడోలు CHC, ఏలూరు జిల్లా ఆస్పత్రిలో వంద పడకలు సిద్ధం చేశారు.
శాంపిల్స్ సేకరణ
బాధితుల్లోని లక్షణాలు ఏలూరు బాధితుల మాదిరిగా ఉండటంతో వారి నుంచి రక్తం, యూరిన్ శాంపిల్స్ తీసుకున్నారు. అలాగే స్థానికుల నుంచి నీళ్లు, కూరగాయలు, ఆహార పదార్థాల నమూనాలు సేకరించి పరీక్షల కోసం విజయవాడలోని ల్యాబ్ కు తరలించారు. ఏలూరు వింత వ్యాధికి పురుగు మందులే కారణమని తేలడంతో ఆ దిశగా కూడా పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. వీలైనంత త్వరగా రిపోర్ట్స్ వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఆందోళన వద్దు
బాధితులను డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని పరామర్శించారు. వ్యాధిపై ఎవరూ ఆందోళన చెందవద్దని..,ధైర్యంగా ఉండాలని సూచించారు. అలాగే బాధితులకు మెగురైన వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నామని.., ఎమర్జెన్సీ అంబులెన్సులు కూడా సిద్ధం చేసినట్లు తెలిపారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంమే..
పూళ్లలో వ్యాపిస్తున్న వింత వ్యాధిపై మాజీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి మద్యం అమ్మకాలపై ఉన్న శ్రద్ధ ప్రజారోగ్యంపై లేదని విమర్శించారు.